హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రతిపక్షంలో ఉన్నా అధికారపక్షంతో కుమ్మక్కైనందుకే టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు పాదయాత్రకు ప్రజా మద్దతు లభించడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యుడు, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైతే ఆ ప్రభుత్వాన్ని కాపాడటానికి కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ కుట్రలు పన్నుతున్న విషయాన్ని తెలియజేయడానికే షర్మిల సాగిస్తున్న మరో ప్రజాప్రస్థానానికి ప్రజలు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారని చెప్పారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... షర్మిల వెంట పల్లె పల్లెనా జనం హరోం హర... అని కదం తొక్కుతూ కదులుతుంటే బాబు యాత్ర మాత్రం నానాటికీ ప్రజారహితంగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ఓవైపు అవిశ్వాస తీర్మానం పెట్టకుండా ప్రభుత్వాన్ని బతికిస్తూ... మరో వైపు పాదయాత్రలో అదే అధికారపక్షాన్ని చంద్రబాబు విమర్శిస్తుంటే ప్రజలు నమ్మడం లేదన్నారు. బాబు మోకాటి యాత్రలు చేసినా, పొర్లు దండాలు పెట్టినా జనం ముమ్మాటికీ విశ్వసించరని చెప్పారు.
షర్మిలకు బ్రహ్మరథం: షర్మిలకు ఏ పదవీ లేకపోయినా జనం ఆహ్వానించి ఆదరిస్తున్నారని ఆదరాభిమానాలతో ఆమెను అక్కున చేర్చుకుంటున్నారని కరుణాకర్‌రెడ్డి చెప్పారు. షర్మిల 21 రోజులుగా 265 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారని, 93 గ్రామాలు, మూడు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ పరిధిలో పర్యటించారని తెలిపారు. అన్యాయంగా, అక్రమంగా నిర్బంధంలో ఉన్న జగన్ బయటకు రాలేని పరిస్థితిలో... రాష్ట్రంలో సాగుతున్న చీకటి పాలన, కుమ్మక్కు కుట్ర రాజకీయాలపై పాశుపతాస్త్రంగా తన సోదరి షర్మిలను సంధించారని వ్యాఖ్యానించారు. బషీర్‌బాగ్ పోలీసు కాల్పుల సంఘటనపై పన్నెండేళ్ల తర్వాత వామపక్ష నేతలపై కుట్ర కేసులు బనాయించడాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని భూమన చెప్పారు.
No comments:
Post a Comment