YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 7 November 2012

ప్రభుత్వం మొద్దు నిద్రను వదిలిస్తాం

17 మంది ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం 
బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం
సీఎం తక్షణ సాయం ప్రకటించలేదు
కేంద్రం నివేదిక కోసం చూస్తే అన్నదాతకు ఆకలిచావులే
పంటల బీమా ద్వారా వెంటనే 25 శాతం పరిహారం చెల్లించాలి
వరదలకు మృతి చెందిన వారి కుటుంబాలకిచ్చే పరిహారాన్ని రూ.3 లక్షలకు పెంచాలి 

తుని (తూర్పు గోదావరి)/విశాఖపట్నం, న్యూస్‌లైన్: ‘‘అకాల వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమయింది. వరద బాధిత జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. లక్షలాది ఎకరాల్లో పంట నీటిపాలై రైతులకు కన్నీటిని మిగిల్చింది. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. ఈ ప్రభుత్వం మొద్దు నిద్రను వదిలిస్తాం. మాకున్న 17 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో నిలదీస్తాం. వరద బాధితులకు న్యాయం జరిగేలా అసెంబ్లీలో తీర్మానానికి డిమాండ్ చేస్తాం. న్యాయం జరిగేవరకూ పోరాడతాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ వరద బాధితులకు భరోసా ఇచ్చారు. 

రాష్ట్రంలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న విజయమ్మ బుధవారం తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. వరద బాధితులు, పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. తునిలో విలేకరులతో, విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం సత్యవరంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘‘వరదల వల్ల దెబ్బ తిన్న జిల్లాల్లో మూడు రోజులుగా పర్యటించాను. ఎక్కడా బాధితులకు ప్రభుత్వపరంగా ఎలాంటి సహాయం అందడంలేదు. వరద ప్రాంతాల్లో పర్యటించిన సీఎం ఎక్కడా త క్షణ సాయం ప్రకటించలేదు’’ అని విమర్శించారు. 

దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వ నివేదిక కోసం నిరీక్షిస్తే రైతులకు ఆకలి చావులు తప్పవని హెచ్చరించారు. పంటల బీమా ద్వారా 25 శాతం పరిహారం తక్షణమే రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.1.5 లక్షల పరిహారాన్ని రూ.3 లక్షలకు పెంచాలన్నారు. వరదల వల్ల పాడైన కొబ్బరిని నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని, ఇతర పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవాలని కోరారు. తమలపాకుల పంట రైతులకు భారీ నష్టపరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. కౌలు రైతులకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్నారు. ఏలేరు ఆధునికీకరణకు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.132 కోట్లు కేటాయించినా, ఇప్పటివరకు ఆ పనులు పూర్తిచేయలేదని చెప్పారు.

తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల పరిధిలో ఉన్న తాండవ రిజర్వాయర్ ఆధునికీకరణ జరగకపోవడంతో వేలాది కుటుంబాలు ముంపుబారినపడి సర్వస్వం కోల్పోయాయని తెలిపారు. తాము అధికారంలో లేకపోవడంవల్లే కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజల్ని ఓదార్చడం మినహా ప్రత్యక్ష సాయం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, వైఎస్సార్‌లానే రాష్ట్ర ప్రజల కష్టాలు తీర్చడానికి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం శ్రమిస్తారని హామీ ఇచ్చారు. జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ప్రజల కష్టాలు తీరుతాయని భరోసా ఇచ్చారు.

బురదలోనే నడుస్తూ.. బాధితుల్లో ధైర్యం నింపుతూ...
విజయమ్మ తుని పట్టణంలో ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఓదార్చారు. ఉదయం తొమ్మిది గంటలకు మొదలైన విజయమ్మ పర్యటన గంటా నలభై నిమిషాలు సాగింది. అమ్మాజీపేట, సీతారాంపురం, కంకిపాటివారిగరువు, రాజీవ్ గృహకల్ప, రెల్లి కాలనీ, కుమ్మరిలోవ కాలనీ ప్రాంతాల్లో పర్యటించారు. దారి పొడవునా బాధితులను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. వీధుల్లో పేరుకుపోయిన బురదలోనే కాలినడకన విజయమ్మ బాధితుల చెంతకు వెళ్లి పరామర్శించారు. 

అనంతరం విశాఖ జిల్లా పాయకరావుపేట వెళ్లారు. తొలుత పాయకరావుపేట మెయిన్ రోడ్డులో వైఎస్సార్ సీపీ వైద్య విభాగం నేతృత్వంలో డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి చిల్డ్రన్, డెంటల్ కేర్ యూనిట్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం చాకలిపేటను సందర్శించారు. సీఎం తుని వచ్చినా పాయకరావుపేట రాలేదని బాధితులు ఆక్షేపించారు. రేషన్ అడిగితే ఎవరికి ఓటేశారో.. వారినే అడగండంటున్నారని విజయమ్మ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. అధికారులతో మాట్లాడి రేషన్ వచ్చేలా చూస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వారికి భరోసా ఇచ్చారు. 

అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. తర్వాత స్థానిక పాండురంగ స్వామి దేవాలయాన్ని విజయమ్మ దర్శించారు. అక్కడినుంచి జాతీయ రహదారి మీదుగా విశాఖ వెళ్లారు. మధ్యలో నక్కపల్లి మండలం గొడిచెర్ల వద్ద పత్తి, వరి పంట రైతులు విజయమ్మకు వారి బాధలు వివరించారు. పార్టీ తరఫున బాధితులకు న్యాయం జరిగేవరకూ పోరాడతామని ఆమె హామీ ఇచ్చారు. రేగుపాలెం, అనకాపల్లి వద్ద కూడా బాధితులను విజయమ్మ పరామర్శించారు. సాయంత్రం విశాఖ చేరుకొని, విమానంలో హైదరాబాద్ వెళ్లారు. విజయమ్మ వెంట పార్టీ నేతలు వై.వి.సుబ్బారెడ్డి, కొణతాల రామకృష్ణ, పిల్లి సుభాష్‌చంద్రబోస్, జ్యోతుల నెహ్రూ, గొల్ల బాబూరావు, వంశీకృష్ణ శ్రీనివాస్, చెంగల వెంకట్రావు, గండి బాబ్జీ, కుంభా రవిబాబు, దాడిశెట్టి రాజా, సర్వేశ్వరరావు తదితరులున్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!