YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 5 November 2012

రైతు కష్టాలు పట్టని ప్రభుత్వమిది

* వరదలొచ్చినా పట్టించుకోవడంలేదు 
* సీఎంకు ఢిల్లీ టూర్‌లు, పదవులే ముఖ్యం: విజయమ్మ 
* పంటలు పోయి రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు
* ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పరిహారమివ్వాలి
* కౌలు రైతులకూ పరిహారం చెల్లించాలి
* జగన్‌బాబు సీఎం అయ్యాక తమ్మిలేరుకు శాశ్వత పరిష్కారం
* ఈ చేతగాని ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది
* కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన 

ఏలూరు (పశ్చిమ గోదావరి)/విజయవాడ, న్యూస్‌లైన్ ప్రతినిధి: ఈ ప్రభుత్వానికి రైతులు, ప్రజల కష్టాలు పట్టడంలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చెప్పారు. ‘‘వరదలొచ్చి రైతులు నిండా మునిగిపోయారు. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రైతులు ఇంత కష్టంలో ఉన్నా ప్రభుత్వంలో స్పందన లేదు. సీఎంగారికి ఢిల్లీ టూర్‌లు ఎక్కువయ్యాయి. వారికి పదవులే ముఖ్యం’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వరద బాధిత ప్రాంతాలను విజయమ్మ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏలూరులో ఎమ్మెల్యే ఆళ్ల నాని నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిందని అధికారులు అంచనా వేస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.15 వేలు నష్ట పరిహారం ఇవ్వాలి. 

రాజశేఖరరెడ్డి హయాంలో ఏవిధంగా ఇచ్చారో అలాగే ఇప్పుడూ కౌలు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలి. పొగాకు రైతులకూ నష్ట పరిహారమివ్వాలి. తుపాను వచ్చి నాలుగురోజులైనా రేషన్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. సర్వం కోల్పోయిన ప్రజలకు నిత్యావసర సరుకులు, కిరోసిన్, రేషన్ వెంటనే అందించాలి. రాజశేఖరరెడ్డిగారి హయాంలో తమ్మిలేరుకు వరద వస్తే ఇక్కడకు వచ్చి రక్షణ గోడకు రూ.17 కోట్లు మంజూరు చేశారు. ఆ డబ్బులు సరిపోకపోవడంతో రెండో విడత రూ.28 కోట్లు మంజూరు చేశారు. రాజశేఖరరెడ్డిగారు మన మధ్య లేకపోవడంతో ఆ పనులు అలాగే ఆగిపోయాయి. ఇప్పటి సీఎం మరో రూ.30 కోట్లు ఇస్తానని చెప్పారట. కానీ ఏమీ చేయలేదు. ఈ చేతగాని ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది. జగన్‌బాబు సీఎం అయ్యాక తమ్మిలేరు రక్షణ గోడ పనులను శాశ్వత ప్రాతిపదికన చేయిస్తారు. త్వరలో జగన్‌బాబు వస్తాడు. అప్పుడు అందరికీ మంచి జరుగుతుంది’’ అని చెప్పారు.

రైతులకు అండగా ఉంటాం..
రైతులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని విజయమ్మ భరోసా ఇచ్చారు. కృష్ణా జిల్లాలో దెబ్బతిన్న పొలాలను ఆమె పరిశీలించారు. బాధిత రైతులను పరామర్శించారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆమె గన్నవరం, ఉంగుటూరు, నందివాడ, బాపులపాడు మండలాల్లో పర్యటించారు. చెరువులను తలపిస్తున్న పంట పొలాలను పరిశీలించారు. కుళ్లిపోయిన వరి దుబ్బలను రైతులు విజయమ్మకు చూపించారు. ‘పంట ఇప్పుడే పాలుపోసుకుంటోంది. మరో పది రోజుల్లో చేతికి వచ్చేది. బుడమేరు కారణంగా నోటికందకుండా పోయింది. ఇక మాకేది దారి..’ అంటూ రైతులు విజయమ్మ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. మహానేత వైఎస్ చనిపోవడంవల్లే తమకీ దుస్థితి కలిగిందని, ఆయన బతికుంటే తమను ఆదుకునేవారని రైతులు వాపోయారు. 

ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే తుపాను బాధితులను వెంటనే ఆదుకునేవారని చెప్పారు. రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. జగన్ సీఎం అయ్యాక బుడమేరు సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని హామీఇచ్చారు. అనంతరం విజయమ్మ పలు గ్రామాలను పరిశీలిస్తూ హనుమాన్ జంక్షన్‌కు చేరుకున్నారు. జంక్షన్‌లో ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వెళ్లారు.

కష్టాల్లో ఉన్నా మా కష్టాలు వినడానికి వచ్చావామ్మా!
పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో విజయమ్మ తొలుత తమ్మిలేరు వరదలకు మునిగిపోయిన ఏలూరు పట్టణంలోని వైఎస్సార్ కాలనీని సందర్శించారు. ‘కష్టాల్లో ఉన్న మీరు మా కష్టాలు వినడానికి వచ్చారామ్మా’ అంటూ పలువురు మహిళలు ఆమెను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. జగన్ సీఎం అయితేనే తమ కష్టాలు తీరతాయని వారు చెప్పారు. ఆ తర్వాత విజయమ్మ పోణంగి కాజ్‌వే దాటి వెళ్లి గ్రామస్తులతో మాట్లాడారు. అనంతరం పాములదిబ్బ, లంకపేట, ఇజ్రాయిల్ పేటలో మునిగిన ఇళ్లను పరిశీలించారు. ఇళ్లు ఎలా ఉన్నాయమ్మా? భోజనం అందుతోందా? అంటూ బాధితులను పలకరించారు. తమ పరిస్థితి దారుణంగా ఉందని వారు వాపోయారు. వారికి ధైర్యం చెప్పి విజయమ్మ ముందుకు కదిలారు. దెందులూరు, భీమడోలు, ఉంగుటూరు, నారాయణపురం, నిడమర్రు, గణపవరం, ఉండి ప్రాంతాల్లో దెబ్బతిన్న పొలాలను పరిశీలిస్తూ భీమవరం చేరుకున్నారు. ఎంత పెట్టుబడి పెట్టారు, మునిగిపోయిన పంటల పరిస్థితి ఏమిటి వంటి విషయాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. 

పాములపర్రు గ్రామస్తులు విజయమ్మను ఆపి తమ గ్రామంలో దెబ్బతిన్న పొలాలను చూడాలని పట్టుబట్టారు. దీంతో రెండు కిలోమీటర్లు లోపలికి వెళ్లి మునిగిన పొలాలను చూసి రైతులతో మాట్లాడారు. రాత్రి 8.30 గంటలకు భీమవరం చేరుకున్నారు. విజయమ్మ వెంట పార్టీ రాష్ట్ర నాయకుడు వైవీ సుబ్బారెడ్డి, పార్టీ రైతు విభాగం కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, కృష్ణా జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), ఆళ్ల నాని, మద్దాల రాజేష్, తానేటి వనిత, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, గ్రంథి శ్రీనివాస్, జ్యేష్ట రమేష్‌బాబు, మేకాప్రతాప్ అప్పారావు, పార్టీ వైద్య విభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ శివభరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం నిద్రపోతోంది : నాగిరెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం నిద్రపోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి విమర్శించారు. తుపాను వచ్చి నాలుగురోజులైనా సీఎం ఇంతవరకు పర్యటించకపోవడం దారుణమని చెప్పారు. రైతులను ఆదుకునే విషయంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.

ఎదురుపడ్డ విజయమ్మ, బాబు కాన్వాయ్‌లు
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కానుమోలు వద్ద వైఎస్ విజయమ్మ, టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌లు ఎదురుపడ్డాయి. టీడీపీ కార్యకర్తలు విజయమ్మ కాన్వాయ్‌పైకి దూసుకువచ్చారు. ఒకదశలో ఇరువర్గాలకు వాగ్వాదం జరిగింది. వైఎస్సార్ సీపీ నాయకుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు వారికి సర్దిచెప్పారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి మాగంటి బాబు కూడా విజయమ్మ కాన్వాయ్ దాటేవరకూ ఎటువంటి సంఘటనలు జరగకుండా ముందు నడిచారు. అదే సమయంలో విజయమ్మతో కరచాలనం చేసేందుకు పెద్ద ఎత్తున మహిళలే ప్రయత్నించారు. వారు చంద్రబాబును పట్టించుకోలేదు.

source:sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!