YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 8 November 2012

రాజన్న బిడ్డకు ఆత్మీయ ఆదరణ

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిలకు జనం జేజేలు పలికారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రాజన్న కూతురు తమ ముంగిట కు రాబోతున్నదన్న ఆనందంతో ప్రజలు దారిపొడవునా బారులు తీరారు. మహిళలు మంగళహారతులు ఇస్తూ పూలతో స్వాగతం పలికారు. ‘మరో ప్రజా ప్రస్థానం’లో భాగంగా 22వ రోజు షర్మిల గురువారం సాయంత్రం 4.40 గంటల సమయంలో కర్నూలు జిల్లా సరిహద్దు మద్దికెర లోకి ప్రవేశించారు. 

అంతకు ముందు అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి కసాపురం మీదుగా పాదయాత్ర సాగించారు. తనను చూసేందుకు వచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ... టమాట రైతుల కష్టాలు వింటూ మద్దికెర మండల కేంద్రంలోని వాడవాడ తిరుగుతూ పాదయాత్ర కొనసాగించారు. జిల్లాలో 4.3 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన షర్మిల రాత్రి 7.30 గంటల సమయంలో మద్దికెర శివార్లలో బస చేశారు.

అపురూప స్వాగతం... షర్మిల గుంతకల్లు నుంచి ఉదయం 11 గంటల సమయంలో
బయలు దేరిన విషయం తెలుసుకున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, జిల్లాలోని వివిధ 
ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు మధ్యాహ్నం 12 గంటల నుంచే మద్దికెరకు చేరుకోవడం ప్రారంభించారు. ఆటోలు, జీపులు, ఆర్టీసీ బస్సుల, ఇతర వాహనాల్లో తరలివచ్చిన జనం జిల్లా సరిహద్దులు దాటి షర్మిల కోసం ఎదురు వెళ్లారు. భారీ ప్రభంజనంలా, ఉవ్వెత్తున లేచిన జన తరంగంలా... వచ్చిన జనంతో కలిసి షర్మిల జిల్లాలోకి అడుగుపెట్టారు. ఆమెను చూడాలని, కరచాలనం చేయాలని అభిమానులు పడ్డ అవస్థలు వర్ణనాతీతం. మహిళలు, వృద్ధులు, చిన్నారులు అనే తేడా లేకుండా తరలివచ్చిన జనాన్ని చూసి షర్మిల ఆనందం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ప్రజలు ఇచ్చిన అపూర్వ స్వాగతాన్ని మరిచిపోలేనని ఆమె ఉద్వేగంగా చెప్పడమే అందుకు నిదర్శనం.

నాన్న బతికుంటే 
ఈ కష్టాలు వచ్చేవా..?: షర్మిల 
‘కర్నూలు జిల్లాలో అడుగుపెట్టగానే అపూర్వ స్వాగతం పలికారు. మీ ప్రేమకు, అభిమానానికి కృతజ్ఞతలు. కర్నూలులో అడుగుపెట్టగానే టమోటాలను రోడ్డు పక్కన పడేసిన ఓ రైతన్నను కలిశాను. పండించిన పంటకు ధరలేదని, కిలో రూపాయికి అడుగుతున్నారని... రూపాయికి అమ్ముకునే బదులు పడేసినట్లు చెప్పాడు. మనసుకు చాలా కష్టమనిపించింది. రాజన్న బతికుంటే ఈ పరిస్థితి వచ్చేదా? నాన్నకు రైతంటే చాలా ప్రేమ’ అని షర్మిల ఉద్వేగ పూరితంగా చేసిన ప్రసంగం మద్దికెర ప్రజలను ఆలోచింపజేసింది. మద్దికెరలో 20 నిమిషాలు షర్మిల ప్రసంగించగా... ఆమె మాట్లాడుతున్నంత సేపూ ప్రజలు జేజేలు కొడుతూనే ఉన్నారు. పత్తికొండ వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కోట్ల హరిచక్రపాణి రెడ్డి తొలుత ప్రారంభోపన్యాసం చేస్తూ పత్తికొండ ప్రజల బాధలను వివరించారు. 

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుట్రపూరితంగా జగన్‌ను జనం మధ్య లేకుండా చేశారని, ఆయన ఎక్కడున్నా ప్రజలు ఆయన వెంటే ఉన్నారన్నారు. అనంతరం షర్మిల ప్రసంగంలో రైతులు, విద్యార్థులు, మహిళలు, కార్మికులు పడుతున్న బాధలను వివరిస్తూ రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే జగనన్నతోనే సాధ్యమని హర్షధ్వానాల మధ్య స్పష్టం చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కు రాజకీయాల గురించి వివరిస్తున్నప్పుడు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నిజస్వరూపాన్ని వివరించినప్పుడు కూడా ప్రజలు కేరింతలు కొట్టారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!