వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో ఇప్పటికే అటాచ్ చేసిన ఆస్తులకు సంబంధించి డిసెంబర్ 17లోగా వివరణలు ఇవ్వాలంటూ వివిధ సంస్థలకు సమన్లు జారీ అయ్యాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్‌లోని న్యాయ నిర్ణాయక విభాగం(అడ్జుడికేషన్ అథారిటీ) ఈ సమన్లను పంపింది. జగన్ సంస్థల్లో పెట్టుబడుల విషయమై సీబీఐ దాఖలుచేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్... ఐదు సంస్థలకు చెందిన రూ.51 కోట్ల స్థిర, చరాస్తులను అటాచ్ చేసినట్టు గత నెల(అక్టోబర్) 4న ఢిల్లీలో ఒక నోట్‌ను మీడియాకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ)లోని సెక్షన్ 5(1) కింద ఈ ఆస్తుల జప్తునకు చర్యలు తీసుకున్నట్టు ఈడీ ఆ నోట్‌లో పేర్కొంది. ఆస్తుల కేసులో జగన్ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో అక్టోబర్ 5న విచారణకు రాగా దానికి సరిగ్గా ఒకరోజు ముందు ఈడీ ఈ వివరాలను వెల్లడించిన వైనం విదితమే. ‘‘1) హెటెరో డ్రగ్స్ లిమిటెడ్‌కు చెందిన దాదాపు 35 ఎకరాల భూమి, రూ. 3 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్; 2) ఏపీఎల్ రీసెర్చ్ సెంటర్ లిమిటెడ్‌కు(ఇది అరబిందో ఫార్మా లిమిటెడ్‌కు నూరు శాతం అనుబంధ సంస్థ) చెందిన 96 ఎకరాల భూమి; 3) అరబిందో ఫార్మా లిమిటెడ్ పేరిట ఉన్న రూ.3 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్; 4) జననీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన 13 ఎకరాలకుపైబడిన భూమి; 5) రూ.14.50 కోట్ల మొత్తానికి జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్ ఫిక్స్‌డ్ డిపాజిట్’’ను అటాచ్ చేసినట్టు ఆ నోట్‌లో ఈడీ తెలిపింది. అటాచ్‌మెంట్‌పై అప్పీలు...: ఈడీ అటాచ్‌మెంట్ ఉత్తర్వులను అందుకున్న దరిమిలా ఈ ఐదు సంస్థలూ వాటిని సవాల్‌చేస్తూ ఈడీ న్యాయ నిర్ణయాధికార విభాగం ఎదుట అప్పీలు చేసుకున్నాయి. ఈ అప్పీళ్లను పరిశీలించిన సదరు విభాగం వాటిపై విచారణ చేపట్టడానికి ముందు వివరణలు దాఖలుచేయాలంటూ ఐదు సంస్థలకూ సమన్లను జారీచేసింది. అటాచ్‌మెంట్‌ను సవాల్‌చేస్తూ అప్పీలు వచ్చినపుడు దాన్ని విచారణకు చేపట్టే ముందు వివరణ కోరుతూ సమన్లు జారీచేయడం న్యాయప్రక్రియలో భాగం. ఆ మేరకే ఈడీ న్యాయనిర్ణయాధికార విభాగం సమన్లను పంపింది. ఆయా సంస్థలు వివరణలు సమర్పించడానికి డిసెంబర్ 17వరకూ గడువు ఇచ్చింది. ఈ గడువులోగా ఐదు సంస్థలూ తమ వివరణలను దాఖలుచేసి ఉండటంతోపాటు అదే రోజు విచారణకు ఈడీ కూడా సిద్ధంగా ఉన్నట్టయితే డిసెంబర్ 17న ఆ విభాగం అప్పీళ్లపై విచారణ చేపడుతుంది. విచారణ సమయంలో వాయిదాలకు కూడా ఆస్కారం ఉంటుంది. ముగ్గురు సభ్యులుండే న్యాయ నిర్ణయాధికార విభాగం తమ విచారణ సమయంలో ఐదు సంస్థలు వినిపించే వాదనలను, ఈడీ వాదనను ఆలకిస్తుంది. ఈ వాదనలన్నీ విన్నాక నిర్ణయాన్ని వెలువరిస్తుంది. |
http://www.sakshi.com/main/FullStory.aspx?CatId=482324&Categoryid=1&subCatId=32
No comments:
Post a Comment