YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 9 November 2012

బయటపడిన బాబు గుట్టు!

చంద్రబాబు నాయుడు మహామేధావి. ప్రత్యర్థి పక్షానికి ఎప్పుడూ ఛాన్సివ్వరు. తన లోటుపాట్లూ, వాటి లోతుపాతులూ ఆయనే స్వయంగా బయటపెట్టుకుంటారు తప్ప ప్రత్యర్థులతో మాట పడరు. ప్రస్తుతం ఆయన నడిపిస్తున్న పాదయాత్ర నాటకం ఆంతర్యమేమిటో బాబుగారే బయటపెట్టుకున్నారు. ‘వస్తున్నా మీ కోసం’ అని తన యాత్రకు ఆయన పేరు పెట్టుకున్నారు. అయితే, ఆ యాత్ర ఇతరుల కోసం చేస్తున్నది కాదనీ, ముఖ్యమంత్రి పదవిని ఎలాగయినా పట్టేయాలనే పట్టుదలతోనే నడిపిస్తున్నారనీ అందరికీ తెలుసు. ఈ రహస్యం ఇతరులకన్నా బాబుకే బాగా తెలుసు. అదే ఆయన మాటల్లో అడుగడుగునా బయటపడుతూ వస్తోంది.

తాబేళ్లతోనూ నత్తలతోనూ పోటీపడి నడుస్తున్న చంద్రబాబు తన పాదయాత్ర పొడుగునా క్రమం తప్పకుండా చేస్తున్నది ఒక్కటే- హామీలూ వాగ్దానాల వర్షం కురిపించడమే! దానికితోడు, గతంలో జీవించే జబ్బు ఒకటి! మహానేత వైఎస్‌ఆర్ అసెంబ్లీలోనే ఒకసారి చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడికి తానిప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాదనే విషయం బుర్రకెక్కలేదు. ‘నేను నిద్రపోను- మిమ్మల్ని నిద్రపోనివ్వను!’ అంటూ హుంకరించి హుంకరించి ఆయనకు మరే విషయమూ గుర్తులేకుండా పోయింది. ప్రస్తుతం పాదయాత్ర సందర్భంగానూ అదే ప్రవర్తన కొనసాగిస్తున్నారు.

2003లోనూ, 2009లోనూ తనను జనం తిప్పికొట్టిన సంగతి జాపకంలేకపోయినా, బీజేపీ తోకపట్టుకుని జాతీయ రాజకీయాల్లో ఈదిన విషయం మాత్రం మర్చిపోలేదు బాబుగారు. ‘నాకు పదవి కొత్తకాదు- ఢిల్లీలో చక్రం తిప్పా’ అంటూ అడుగడుగునా బాబు చేసే ప్రలాపాలు విని జనం నవ్వుకుంటున్నారు. ‘ఢిల్లీలో చక్రం తిప్పానంటున్నాడు- అక్కడేమన్నా ట్యాక్సీయేమన్నా తిప్పినాడా?’ అనుకుని కుర్రకారు జోకులేసుకుంటున్నా బాబు జంకడంలేదు. ‘వాజపేయికి నేనెంత చెప్తే అంత- అబ్దుల్ కలాంను నేనే రాష్ట్రపతిని చేశా- మీ జేబుల్లోని సెల్‌ఫోన్లు నేనిచ్చినవే’ అంటూ చెప్పుకుపోతూనే ఉన్నారు.

అంతకుమించి, ‘రాష్ట్రంలో చేనేత కార్మికులూ రైతులూ ఆత్మహత్యలు చేసుకుంటున్నా’రని బాబు మొసలి కన్నీరు కార్చడం నవ్వులపాలవుతోంది. ఆయన హయాంలో నేతన్నలూ రైతన్నల ఆత్మహత్యల గురించి బాధ్యతారహితంగా మాట్లాడిన బాబేనా ఈ గంభీర ప్రసంగాలు చేస్తున్నది? అని జనం ఆశ్చర్యపోతున్నారు. నష్టపరిహారంగా వచ్చే డబ్బులకోసమే వాళ్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రకటించి, ఘోరపరాజయం పాలయిన బాబు గతాన్ని విస్మరించి ఉండొచ్చు. కానీ జనం ఆ మాటలనూ, దానివెనక ఉన్న మనస్తత్వాన్నీ మర్చిపోలేదు.

జనం కష్టాల్లో ఉన్నారని పదేపదే ప్రటిస్తున్న బాబు ప్రధాన ప్రతిపక్షంగా చెయ్యాల్సిన పనేమిటి? ఈ చేతకాని ప్రభుత్వాన్ని పడగొట్టడం! చిన్నపిల్లలక్కూడా ఈ విషయం తెలుసు. కానీ, ఆయన ఆ పని చెయ్యడంలేదు. పెపైచ్చు, అధికార పక్షంతో కుమ్మక్కయి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని మొగ్గలోనే తుంచేయాలని ప్రయత్నిస్తున్నారని ప్రజలందరికీ తెలుసు. అందుచేతనే ఆయన పాదయాత్రకు ప్రజల మద్దతు లేకుండా పోయింది.

కానీ, బాబు మహానటుడు! ఆ విషయం గుర్తించనట్లే మాట్లాడుతూ పోతున్నారు. ‘నానా ఇబ్బందులూ పడి నేను మిమ్మల్ని చూడ్డానికి వస్తే, మీరు ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించి నన్ను మరింత ఇబ్బంది పెట్టడం న్యాయమేనా?’ అని బాబు ప్రజల్ని దీనంగా ప్రశ్నిస్తున్నారు. అంతే తప్ప తన పాదయాత్ర నాటకం సంగతి జనానికి అర్థమయిపోయిందన్న వాస్తవాన్ని ఆయన గుర్తించినట్లు తోచదు.

అయినా, చంద్రబాబు నాయుడు పాదయాత్రకు సంబంధించిన నిజాలను ఎక్కడికక్కడ రుజువు చేస్తున్నది ప్రత్యర్థి పక్షాలకు చెందిన నేతలు కాదు- స్వయంగా ఆయనే! తను అధికారంలోకి రాగానే, పొడిచేస్తానని బీరాలు పోతుండడం చూస్తేనే ఆయన పాదయాత్ర లక్ష్యం పదవీ సముపార్జన మాత్రమేనని స్పష్టమయిపోవడం లేదూ? మహా మేధావినని చెప్పుకునే చంద్రబాబుకు ఇంత చిన్న విషయం తట్టలేదంటే, ఆయన సాఫ్ట్‌వేర్ చెడిపోయిందని అర్థం. ఇప్పటికయినా బాబు తన పాదయాత్ర నాటకానికి తెరదించి హెరిటేజ్ వ్యాపారం చూసుకోవడంలో కొడుక్కి సాయం చేస్తే బాగుంటుందని జనం అంటున్నారు. బాబుగారూ, వినబడిందా? 


http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=52249&Categoryid=28&subcatid=0

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!