అనంతపురం,న్యూస్‌లైన్: ఉదయం 10.20 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర బుధవారం మొత్తం అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో సాగింది. ఉదయం పాదయాత్ర ప్రారంభం నుంచే జనప్రవాహం మొదలైంది. ఓవైపు భరించలేని ఎండ, మరోవైపు జనతాకిడితో పాదయాత్రలో సాగుతున్నవారి దుస్తులు చెమటతో తడిచిపోయాయి. తొలుత పట్టణ శివారులో ఉన్న వైఎస్ విగ్రహానికి నివాళులర్పించిన షర్మిల.. పట్టణంలో అడుగిడిన తరువాత జనప్రవాహంలో ముందుకు సాగడం సులువుకాలేదు. భద్రతా సిబ్బంది ముప్పుతిప్పలు పడాల్సి వచ్చింది. పార్టీ కార్యకర్తలు షర్మిల చుట్టూ తాడుతో వలయంగా నిలుచున్నా జనం ముందుకు కదలలేదు. మధ్యాహ్న భోజనం అనంతరం 4 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహిరంగ సభకు చేరుకునేందుకు గంటా ఇరవై నిమిషాలు పట్టింది. మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరావడం, యువకులు షర్మిలను చూడాలంటూ చెట్లు, ఫ్లెక్సీలపైకి ఎక్కడం కనిపించింది. జనం రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి షర్మిలకు స్వాగతం పలుకగా.. షర్మిల అంతే ఆత్మీయతతో అభివాదం చేస్తూ తండ్రిని, అన్నను తలపించారు.
సభా ప్రాంతానికి చేరేసరికి ఇసుకేస్తే రాలని రీతిలో జనం గుమిగూడారు. బహిరంగ సభ అనంతరం షర్మిల డీఎంఎం గేట్ వైపు సాగుతుండగా ముస్లిం సోదరులు ఘన స్వాగతం పలికారు. అక్కడ వారిని ఉద్దేశించి కొద్దిసేపు మాట్లాడారు. రిజర్వేషన్ కోసం మైనారిటీల పక్షాన రాజన్న నిలబడిన రీతిలో రేపు జగనన్న కూడా వారి అభ్యున్నతి కోసం అహర్నిశలూ పాటుపడతాడని హామీ ఇచ్చి ఆమె ముందుకు కదిలారు. రాత్రి 8.10కి రాత్రి గుంతకల్లు శివారులో ఏర్పాటుచేసిన బసకు చేరుకున్నారు. బుధవారం 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. ఇప్పటివరకు మొత్తం 268.80 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయింది. బుధవారం పాదయాత్రలో ఎమ్మెల్యేలు సుచరిత, అమర్‌నాథ్‌రెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి, గురునాథరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ డి.నారాయణరెడ్డి, గుంతకల్లు నియోజకవర్గ ఇన్‌చార్జి వై.వెంకట్రామిరెడ్డి, పార్టీ నేతలు వాసిరెడ్డి పద్మ, కొల్లి నిర్మలాకుమారి, తోపుదుర్తి కవిత, వై.విశ్వేశ్వర్‌రెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
నేటి నుంచి కర్నూలు జిల్లాలో షర్మిల పాదయాత్రకర్నూలు, న్యూస్‌లైన్ ప్రతినిధి: షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర గురువారం కర్నూలు జిల్లాలోకి ప్రవేశించనుంది. గతనెల 18న ఇడుపులపాయలో షర్మిల ప్రారంభించిన ఈ యాత్ర ఇప్పటి వరకు వైఎస్‌ఆర్, అనంతపురం జిల్లాలలో సాగింది. షర్మిల గురువారం ఉదయం అనంతపురం జిల్లాలో యాత్ర మొదలు పెట్టి మధ్యాహ్నం తర్వాత కర్నూలు జిల్లాలోని మద్దికెర చేరుకుంటారు. మద్దికెరలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం ఒకటిన్నర కిలోమీటర్లు నడుస్తారు.
No comments:
Post a Comment