YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 9 November 2012

నాన్న బతికుంటే మీకీ పరిస్థితి వచ్చేదా...?

 ‘హంద్రీనీవా ప్రాజెక్టు కోసం చంద్రబాబు రెండుసార్లు శిలాఫలకాలు వేశారు. కానీ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. నాన్న సీఎం కాగానే హంద్రీనీవా ప్రాజెక్టు పనులు చేపట్టారు. ఆయన చనిపోగానే ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తయితే మీ పరిస్థితి ఇంత అధ్వానంగా ఉండేదా..? సమృద్ధిగా పంటలు పండేవి. కాలువలకు నీరు వచ్చేది. భూగర్బ జలాలు పెరిగి బోర్లకు నీరొచ్చేది. తాగడానికి నీరుండేది. నాన్న బతికుంటే మీకీ పరిస్థితి వచ్చేదా...?’ అని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల ప్రజలను ప్రశ్నించారు. 

‘మరో ప్రజా ప్రస్థానం’లో భాగంగా శుక్రవారం షర్మిల పత్తికొండ నియోజకవర్గంలోని మద్దికెర మండల కేంద్రం శివారు నుంచి ఎం. ఆగ్రహారం, హంపా క్రాస్, పెరవలి మీదుగా తుగ్గలి వరకు సాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హంద్రీనీవా పనులు పూర్తిచేసి రైతులకు నీరందించేందుకు ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే రాజన్న కలలు గన్న కోటి ఎకరాలకు సాగునీరు సాధ్యమవుతుందని, హంద్రీనీవా కూడా పూర్తయి వెనుకబడ్డ పత్తికొండ నియోజకవర్గానికి నీరందుతుందని షర్మిల అన్నారు. హంద్రీనీవా కాలువలు పక్కనుంచి వెళుతున్నా నీరు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూస్తే మనసుకు బాధేస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అందరికీ కష్టాలే: ‘ప్రస్తుత ప్రభుత్వం తొమ్మిదేళ్ల చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం తీసిపోవడం లేదు. బాబు సీఎంగా ఉన్నప్పుడు 4వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పింఛన్లు ఇవ్వమంటే ఊర్లో ఎవరైనా చనిపోతే ఆ స్థానంలో దరఖాస్తు చేసుకొమ్మన్న పెద్ద మనిషి ఆయన. కరెంటు చార్జీలు ఎనిమిది సార్లు పెంచారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఎన్నో అవస్థలు పడ్డారు. ఇప్పుడు అంతకన్నా అధ్వాన్నమైన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి పోవాలంటే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు సమయం వచ్చినప్పుడు గట్టిబుద్ది చెప్పాలి. జగనన్నను ఆశీర్వదించాలి. జగనన్న సీఎం అయితేనే రాజన్న రాజ్యం వస్తుంది’ అని షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు. 

మనీస్కీం నిందితుడిని ఎంపీ రక్షిస్తే ఆయనను కూడా అరెస్టు చేయాలి: శుక్రవారం ఉదయం షర్మిల పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి రాత్రి వరకు ప్రజలతో మాట్లాడితే... అందరూ మనీ స్కీం బాధితులే. శ్రీనందీ యువజన సమాఖ్య పేరుతో ఎల్‌ఐసీ పాలసీలతో ముడిపెట్టి నాలుగు జిల్లాల్లో సుమారు రూ. 100 కోట్లు వసూలు చేసి రంగస్వామి అనే వ్యక్తి పరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షర్మిల ఎక్కడకు వెళ్లినా తాము పుస్తెలు, చెవి కమ్మలు కూడా అమ్మేసి రూ. 700 మనీస్కీంలో వేలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి మోసపోయినట్లు ఫిర్యాదు చేశారు. రంగస్వామి అనే వ్యక్తి ఈ మోసం చేస్తే అతనికి అధికార పార్టీ నేతలు మద్దతు ఇస్తున్నారని, సాక్షాత్తూ ఎంపీ (ప్రస్తుతం కేంద్ర మంత్రి) అతన్ని కాపాడారని, కనీసం అరెస్టు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన షర్మిల మాట్లాడుతూ ఇంత పెద్ద మొత్తంలో మోసానికి పాల్పడి, పేదల నుంచి రూ.కోట్లు వసూలు చేసి పరారైన నిందితుడిని పోలీసులు అరెస్టు చేయకపోవడం శోచనీయమన్నారు. ఈ విషయంపై వైఎస్‌ఆర్‌సీపీ పోరాడుతుందని, పార్టీ ఎమ్మెల్యేలు ఒకటి రెండు రోజుల్లో హోం మంత్రిని కలిసి నిందితుడిని అరెస్టు చేయమని కోరుతారని చెప్పారు. నిందితుడు రంగస్వామిని ఎంపీ కాపాడుతున్నదే నిజమైతే ఎంపీని కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేయనున్నట్లు చెప్పారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!