YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 9 November 2012

తెలంగాణ ఎట్ల తెస్తరో కేసీఆర్ చెప్పాలి

100 అసెంబ్లీ, 16 ఎంపీ సీట్లతో తెలంగాణ ఎట్లా వస్తుంది?
ప్రజలను మభ్యపెట్టడానికి మరోసారి ఎత్తులు వేస్తున్నారు
కాంగ్రెస్ ఎంపీగా జగన్ ప్లకార్డు పట్టుకుంటే రాద్ధాంతం చేశారు.. టీడీపీలో ఉన్నప్పుడు 610 జీవోపై మీరేం మాట్లాడారో గుర్తులేదా?

హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రజలను మోసగిస్తూ పదకొండేళ్లుగా రాజకీయ పబ్బం గడుపుకుంటున్న టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు మరోసారి జనాన్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు కొండా సురేఖ మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో 100 అసెంబ్లీ, 16 పార్లమెంటు స్థానాలు సాధిస్తే తెలంగాణ ఎట్లా వస్తుందో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓట్లు, సీట్ల విధానం ద్వారా తాజాగా ప్రజలను మరోమారు మభ్యపెట్టేందుకు కేసీఆర్ ఎత్తుగడలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం కేసీఆర్‌కు ఆమె బహిరంగ లేఖ రాశారు. అనంతరం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ... కేసీఆర్ తీరును ఎండగట్టారు. ‘‘ఉప ఎన్నికల సందర్భంగా ప్రతీసారి టీఆర్‌ఎస్ గెలిస్తే నెలరోజుల్లో తెలంగాణ వస్తదని చెప్పి ప్రజల్ని మోసం చేసిండ్రు. ఇదిగో తెలంగాణ, అదిగో తెలంగాణ అంటూ వెయ్యి మంది ఆత్మహత్యలకు కేసీఆర్ కూడా కారణం. 

ఆయన మాత్రం కాంగ్రెస్‌తో లాలూచీపడి వేల కోట్లు దండుకున్నడు. తెలంగాణ మార్చ్ సందర్భంగా నెల రోజులు ఢిల్లీలో మకాం వేసి తెలంగాణ తెస్తున్నట్లు కలరింగ్ ఇచ్చారు. తీరా ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం లేదని చెప్పడం సిగ్గుచేటు’’ అని అన్నారు. తెలంగాణ సాధన కోసం గొంగళి పురుగునైనా ముద్దాడుతా... కుష్టిరోగినైనా కౌగిలించుకుంటానని ప్రగల్భాలు పలికిన వ్యక్తి.. బీజేపీని మతతత్వ పార్టీగా పేర్కొం టూ, జేఏసీతో పాటు మిగతా పార్టీలను దూరం పెట్టడం దేనికి సంకేతమన్నారు. జేఏసీ తన చెప్పు కింద తేలు మాదిరిగా ఉంటే మంచిదనే రీతిలో కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలను ఇన్నాళ్లు మోసగించినందుకు కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలే ఆయనకు బుద్ధి చెప్పే రోజు వస్తుందని స్పష్టం చేశారు.

అసెంబ్లీలో 610 జీవోపై ఏం మాట్లాడారు?

తెలంగాణ పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ స్పష్టమైన వైఖరితో ఉందని, పార్టీ మొదటి ప్లీనరీలో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశామని సురేఖ గుర్తుచేశారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన అభ్యర్థులపై తమ పార్టీ పోటీ చేయకుండా చిత్తశుద్ధిని చాటుకున్నామని తెలిపారు. కానీ టీఆర్‌ఎస్ లక్ష్యం మాత్రం ఓట్ల ద్వారా కోట్లు గడించడమేనని, తెలంగాణ సాధించాలనే చిత్తశుద్ధి కేసీఆర్‌కు లేదని విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీగా వైఎస్ జగన్ ప్లకార్డు పట్టుకున్నారని రాద్ధాంతం చేస్తున్న కేసీఆర్... తాను టీడీపీలో ఉన్నప్పుడు అసెంబ్లీలో 610 జీవోపై ఏం మాట్లాడారో గుర్తుచేసుకోవాలన్నారు. ఆనాడు నిండు సభలో సమైక్యవాదం వినిపించిన కేసీఆర్, టీఆర్‌ఎస్ పెట్టగానే తెలంగాణవాదిగా ఎలా అయ్యారో సమాధానం చెప్పాలని నిలదీశారు. కేసీఆర్ తన విధానాన్ని మార్చుకున్నట్లుగానే జగన్ కూడా పార్టీ పెట్టాక ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తన ఆలోచనలను మార్చుకోవడం జరిగిందన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ పట్ల ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని, అందుకే నాయకులు, ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. టీఆర్‌ఎస్ చేపట్టే ఏ కార్యక్రమాన్నైనా పరకాల నియోజకవర్గంలో అడ్డుకుంటామనాని స్పష్టంచేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!