YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 8 November 2012

రైతులు ఆత్మహత్య చేసుకునేదాకా వారిని ఆదుకోరా

* ఖమ్మం జిల్లా పర్యటనలో రైతుల పరిస్థితిపై విజయమ్మ ఆవేదన
* ఇంత నష్టం జరిగినా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు
* కనీసం పరిహారం ఎంతిస్తారో కూడా ప్రకటించలేదు
* రైతులు ఆత్మహత్య చేసుకునేదాకా వారిని ఆదుకోరా?
* అసెంబ్లీని వెంటనే సమావేశపరచాలి 
* తడిసిన పత్తిని కొనుగోలు చేయించాలి
* ఎకరాకు రూ.20 వేలు పరిహారం ఇవ్వాలి 

‘‘కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రంలో రైతులు నష్టపోయారు. పంటనష్టాన్ని చూసి గుండెలవిసిన రైతును ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలు తప్ప వేరే మార్గం లేదు. అయినా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు. కనీసం పరిహారం ఎంత ఇస్తారో ప్రకటించలేదు. కేంద్రం సర్వేలు చేసే వరకు పరిహారం ప్రకటించమంటున్నారు. కేంద్రం ఎప్పుడు వస్తుంది? రైతులు ఆత్మహత్యలు చేసుకునేవరకు వారిని ఆదుకోరా?’’ 
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వైఎస్.విజయమ్మ ధ్వజం

ఖమ్మం, న్యూస్‌లైన్ ప్రతినిధి: పంట నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి అన్నదాతకు న్యాయం చేసేంతవరకూ వైఎస్సార్ సీపీ వారి తరఫున పోరాడుతుందని వై.ఎస్.విజయమ్మ భరోసా ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో పంట నష్టపోయిన ప్రాంతాల్లో ఆమె గురువారం పర్యటించారు. మధ్యాహ్నం 2 గంటలకు షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో ఖమ్మం వచ్చిన విజయమ్మ.. బాధితులతో మాట్లాడారు. జిల్లాలోని నాయుడుపేట క్రాస్ రోడ్, తిరుమలాయపాలెం, శివాయిగూడెం, పల్లిపాడు, కొణిజర్ల, వైరా, దమ్మపేటలలో ఆమె కాన్వాయ్‌కు ఎదురేగిన రైతులు పత్తి, మిర్చి మొక్కలను చూపిస్తూ తమ ఆవేదనను వెళ్లబుచ్చారు. ఈ సందర్భంగా తిరుమలాయపాలెం, శివాయిగూడెం, వైరాలలో విజయమ్మ ప్రసంగించారు. వెంటనే రాష్ట్ర అసెంబ్లీని సమావేశపరిచి.. తుపానుకారణంగా జరిగిన నష్టంపై చర్చించాలని.. అన్నదాతలను ఆదుకోవడానికి ప్రణాళికలు రచించాలని డిమాండ్ చేశారు. గత నాలుగు రోజులుగా పంట నష్టపోయిన వివిధ జిల్లాల్లో తాను పర్యటించానని.. అన్ని చోట్లా అన్నదాతలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఖమ్మం జిల్లాలో పత్తి, మిర్చి, వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని, రైతులకు ఎకరాకు రూ.20 వేలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వర్షాలు తగ్గి.. నాలుగు రోజులు కావస్తున్నా.. ఇప్పటికీ ఎంత పరిహారం ఇస్తారన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించకపోవడం దారుణమన్నారు. కేంద్రం సర్వేలు పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ సాయం ప్రకటిస్తామనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తడిసిన పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ద్వారా ఆ పత్తిని కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. ఇసుక మేటలు వేసిన పొలాల్లో ఉపాధి హామీ పనుల ద్వారా మేటలు తొలగించి, వాటిని వ్యవసాయ యోగ్యంగా తీర్చిదిద్దాలని కోరారు. 

ప్రధాని దృష్టికి పంట నష్టం వివరాలు: నీలం తుపాను కారణంగా జరిగిన పంటనష్టం వివరాలను ప్రధాని మన్మోహన్, వ్యవసాయ మంత్రి శరద్‌పవార్‌ల దృష్టికి తీసుకెళ్తామని విజయమ్మ తెలిపారు. వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరా రు. నష్టపోయిన రైతులకు రబీ పంటలో సేద్యం చేసేందుకు సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు అందించాలని డిమాండ్ చేశారు. రైతులు తీసుకున్న బ్యాంకు రుణాలను రద్దు చేయాలని, ఇన్‌పుట్‌సబ్సిడీ వెంటనే విడుదల చేయాలన్నారు. ‘దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి రైతు పక్షపాతి. 

అదే బాటలో ఆయన తనయుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కూడా అన్నదాతల కోసం పోరాటాలు చేస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేదాకా పోరాడాలని జగన్ నాతో చెప్పారు’ అని ఆమె తెలిపారు. రానున్న రోజుల్లో వైఎస్సార్‌సీపీ విజయం తథ్యమని.. జగన్ సీఎం అయిన తర్వాత రైతు బడ్జెట్‌ను ఏర్పాటు చేసి అన్నదాతలకు న్యాయం చేస్తామన్నారు. రైతులు అధైర్యపడక ముందుకు సాగాలని, న్యాయం జరిగేవరకు ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. జిల్లా పర్యటనలో వై.ఎస్.విజయమ్మ వెంట పార్టీ నేతలు వై.వి.సుబ్బారెడ్డి, కె.కె.మహేందర్‌రెడ్డి, గట్టు రామచంద్రరావు, రవీంద్రనాయక్, గున్నం నాగిరెడ్డి, విజయారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, జలగం వెంకట్రావ్, బానోత్ మదన్‌లాల్, చందా లింగయ్యదొర ఉన్నారు. 

మీరొస్తేనే న్యాయం జరుగుతుందమ్మా..
‘ఎకరాకు రూ.25 వేలు పెట్టుబడి పెట్టాం. వర్షాలు మమ్మల్ని నిండా ముంచేశాయి. పత్తి నల్లబారింది. అంతా పోయింది. అప్పులే మిగిలాయమ్మా.. ఆదుకునే వారే కరువయ్యారు. మళ్లీ మీరొస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. మీరే రావాలమ్మా’ అంటూ తిరుమలాయపాలెంకు చెందిన కౌలు రైతు దంపతులు తోట వీరన్న, శాంతమ్మలు.. జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్ విజయమ్మ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. 

విజయమ్మ: ఈ భూమి మీదేనా? 
వీరన్న: కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. 
విజయమ్మ: ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? కౌలు ఎంతకు తీసుకున్నారు?
వీరన్న: 12 ఎకరాలలో సాగు చేస్తున్నాం. ఎకరాకు కౌలు రూ.10 వేలు. 
విజయమ్మ: ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు?
వీరన్న: కౌలు, పెట్టుబడితో కలిపి రూ. 3 లక్షల వరకు ఖర్చు వచ్చిందమ్మా..
విజయమ్మ: పత్తిని ఏమైనా తీశారా?
వీరన్న: ఒక్కసారి తీశామమ్మా..
విజయమ్మ: పెట్టుబడులు వచ్చాయా?
వీరన్న: లేదమ్మా.. రూ.3 లక్షల అప్పే మిగిలింది.
విజయమ్మ: వర్షానికి పంట నష్టపోయాక అధికారులు ఎవరైనా వచ్చారా?
వీరన్న: రాలేదమ్మా.. 
విజయమ్మ: పంట నష్టపోయిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. చర్చిస్తాం. అధైర్యపడవద్దు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!