* కర్నూలు జిల్లాలోకి ‘మరో ప్రజాప్రస్థానం’
* షర్మిలకు స్వాగతం పలికేందుకు పోటెత్తిన జనసంద్రం
* రోడ్డుపై కిలోమీటరు మేర కిక్కిరిసినజనంతో తిరునాళ్లలా సాగిన పాదయాత్ర
* మూడు కిలోమీటర్లు నడవడానికి 2 గంటలు పట్టిన వైనం
* మద్దికెర సభలో చంద్రబాబుపై, ప్రభుత్వంపై ధ్వజమెత్తిన షర్మిల
* బాబును కాంగ్రెస్ కాపాడుతున్నందుకే ఆయన అవిశ్వాసం పెట్టడం లేదని విమర్శ
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’గురువారం యాత్ర ముగిసేనాటికి..రోజులు: 22,
కిలోమీటర్లు: 281.30
‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: అడుగడుగునా మంగళ హారతులు.. జయజయహో నినాదాలు... ప్రతి అడుగుకీ బంతిపూల స్వాగతాలు... తిరునాళ్లను తలపించేలా జోరు హోరుగా డప్పుల దరువులు, విచిత్ర వేషధారణలు.. కిలోమీటరు పొడవునా ఇసుకేస్తే రాలనంత జనం.. చూడ్డానికి ఓ మహా జాతర సాగుతోందనే భావన.... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర గురువారం సాయంత్రం కర్నూలు జిల్లాలోకి ప్రవేశించినప్పుడు కనిపించిన దృశ్యమిది. ప్రజల సమస్యలు పట్టని ప్రభుత్వ వైఖరికి, దానితోనే కుమ్మక్కయిన టీడీపీ రాజకీయాలకు నిరసనగా వైఎస్ జగన్ తరఫున పాదయాత్ర చేపట్టిన షర్మిలకు జిల్లా ప్రజానీకం ఘనంగా స్వాగతం పలికింది.
ఎటుచూసినా కనుచూపు మేర నేల కనిపించని రీతిలో జన ప్రవాహం కిలోమీటరు మేర కిక్కిరిసిపోవడం గమనార్హం. గురువారం ఉదయం 10.45కు అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలో 22వ రోజు పాదయాత్ర ప్రారంభించిన షర్మిల 11.30కు కసాపురం చేరుకున్నారు. అక్కడ సభలో మాట్లాడిన తరువాత షర్మిల ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన కసాపురం ఆంజనేయస్వామిని దర్శిం చుకున్నారు. అనంతరం కర్నూలు జిల్లా మరో రెండు కిలోమీటర్ల దూరంలో ఉండగా మధ్యాహ్న భోజనానికి ఆగారు. సాయంత్రం 4.40కి మద్దికెర సమీపంలో షర్మిల కర్నూలు జిల్లాలోకి ప్రవేశించేసరికి వేలాదిగా ఆ జిల్లా ప్రజలు తరలివచ్చి ఘనస్వాగతం పలికారు.
షర్మిలను చూడాలని, పాదయాత్రలో కదం తొక్కాలని యువతీయువకులు, మహిళలు, రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. షర్మిల జిల్లాలోకి అడుగు పెట్టిన ప్రాంతం నుంచి సభ ప్రాంతానికి వెళ్లడానికి మధ్య దూరం 3 కిలోమీటర్లు. అడుగు తీసి అడుగు వేయడానికి వీల్లేనంతలా జనం పోటెత్తడంతో ఆమె సభ ప్రాంతానికి చేరుకోవడానికి రెండుగంటలు పట్టడం గమనార్హం. మద్దికెర సభలో షర్మిల మాట్లాడుతూ.. ‘జగనన్న మాట మేరకు ఈ మరో ప్రజాప్రస్థానం చేపట్టి వైఎస్సార్ జిల్లా, అనంతపురం జిల్లా పూర్తిచేసుకుని ఈ జిల్లాలో అడుగుపెట్టగానే అపూర్వ స్వాగతం పలికారు. మీ ప్రేమ, ఆత్మీయతలు ఎన్నటికీ మరిచిపోలేం’ అని కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు తీరును, ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.
అమ్మా, వదిన ఢిల్లీ వెళితే కాంగ్రెస్‌తో కుమ్మక్కయినట్టా?: ‘మాట ఇవ్వడమంటే, దానిపై నిలబడడమంటే చంద్రబాబుకు ఈ జన్మలో అర్థం కాదు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చే సి ప్రభుత్వంతో కుమ్మక్కయి అబద్ధపు కేసులు, వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారు. పైగా వాళ్లంటారు జగనన్న కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారట. అందుకే అమ్మ, వదిన ఢిల్లీ వెళ్లారట. అసలు మీరు మనుషులా? మా లాయర్లు ఢిల్లీలో ఉంటే వారిని కలవడానికి వెళితే కూడా కుమ్మక్కయినట్టా? అలా కుమ్మక్కయి ఉంటే జగనన్న ఎప్పుడో కేంద్ర మంత్రో, ముఖ్యమంత్రో అయ్యేవారు. కుమ్మక్కయ్యింది మీరు.. అందుకే మీపై కేసులు ఉండవు. విచారణ ఉండదు. అందుకు ప్రతిఫలంగా మీరు ఈ ప్రభుత్వాన్ని కాపాడుతారు. అవిశ్వా సం పెట్టరు’’ అని బాబుపై షర్మిల నిప్పులు చెరిగారు.
రైతు కడుపు మీద కొడుతున్నారు: ‘‘దారిలో ఓ టమాటా రైతును కలిశాను.. తాను పండించిన టమాటాలను కింద పారబోశాడు. కారణం.. దానికి ధర రాదట. కిలో ఒక్క రూపాయి వస్తుందట. ఈమాత్రం దానికి ఇంత తీసుకెళ్లి అమ్మడం ఎందుకని పారబోశామని చెప్పాడు. మనసుకు చాలా బాధేసింది. చాలా కష్టమనిపించింది. రాజన్న రైతుకు సకాలంలో ఎరువులు, విత్తనాలు ఇచ్చి, కరెంటు ఇచ్చి, గిట్టుబాటు ధర ఇచ్చి, దురదృష్టవశాత్తూ పంట నష్టపోతే పరిహారం ఇచ్చి రైతన్నకు అండగా నిలబడ్డాడు. కానీ వైఎస్ రెక్కల కష్టం మీద వచ్చిన ఈ ప్రభుత్వం రైతన్నను గాలికి వదిలేసింది. కడుపు మీద కొట్టి వేడుక చూస్తోంది’ అని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు.
కర్నూలు జిల్లా మద్దికెర వద్ద షర్మిలకు స్వాగతం పలికేందుకు తరలివచ్చిన నేతల్లో వైఎస్‌ఆర్ సీపీ శాసనసభా పక్ష ఉపనేత శోభా నాగిరెడ్డి, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కోట్ల హరిచక్రపాణిరెడ్డి, మాజీ మంత్రి మారెప్ప, మాజీ ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి.మోహన్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జిలు బుగ్గన రాజారెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఎ.వి.సుబ్బారెడ్డి, ఎర్రబోతుల వెంకటరెడ్డి, జి.జయరామ్, పార్టీ నేతలు బుడ్డా శేషురెడ్డి, కర్రా హర్షవర్ధన్‌రెడ్డి, ఎర్రకోట జగన్ మోహన్‌రెడ్డి, హఫీజ్ ఖాన్, సురేందర్ రెడ్డి, జయంతి వెంకటేశ్వర్లు తదితరులున్నారు.
ఒక్క బల్బుకు రూ.200 బిల్లు..అనంతపురం జిల్లాలో కసాపురం దాటాక షర్మిలకు రెండు చోట్ల వ్యవసాయ కూలీలు ఎదురయ్యారు. ఒక చోట ఓ వ్యవసాయ కూలీ తెచ్చుకున్న టిఫిన్ బాక్స్‌లో రెండు ముద్దలు పప్పన్నం కలిపి షర్మిలకు తినిపించగా.. ఆమె ఆనందంగా తిన్నారు. ఒక చోట కూలీలు తమకు కరెంటు రావట్లేదని, వచ్చినా ఒక్క బల్బుకే రూ. 200 బిల్లు వస్తోందని వాపోయారు. వారి సంభాషణ సాగిందిలా..
షర్మిల: ఏమ్మా బాగున్నారా? కూలి పనికొచ్చారా?
మహిళ: బతకడమే కష్టమైంది. తండ్రి(వైఎస్‌ను ఉద్దేశించి) ఉన్నట్టుండి వెళ్లిపోయాడు. మాకు సాయం చేసేవారే లేరు.
షర్మిల: కరువుపని దొరుకుతోందా అమ్మా..
మహిళ: పని దొరకడం లేదమ్మా..
షర్మిల: బియ్యం సరిగ్గా ఇస్తున్నారా?
మహిళ: ఆ.. 8 షేర్లు(కిలోలు) ఇస్తున్నారు.
మరో మహిళ: వాళ్లిచ్చే బియ్యం చాలడం లేదు. మేం మళ్లా అవ్వే బియ్యం బయట కిలో రూ. 12, రూ.15కు కొంటున్నాం.
షర్మిల: కరెంటు పరిస్థితి ఎట్లా ఉందమ్మా..
మహిళ: మాకు కరెంటు బిల్లు రూ. 200 నుంచి రూ. 250 వస్తోంది. కరెంటు రెండు గంటలే ఉంటుంది.
మరో మహిళ: ఒక్కటే బల్బుంది మాకు. కానీ రూ. 200 బిల్లు వస్తోంది.
షర్మిల: అవును.. ఇంకా వీళ్లేదో కరెంటు బాగా ఇస్తున్నట్టు బిల్లులొకటి మళ్లీ..
మహిళ: బిల్లు కట్టకపోతే కనెక్షన్ తీసేస్తారట.
షర్మిల: చంద్రబాబు ఉన్నప్పుడు ఇట్లాగే వేధిస్తే 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. జగనన్న సీఎం అయ్యాక మీ కష్టాలు తీరుస్తాడు.
ఇడుపులపాయ నుంచి కర్నూలు సరిహద్దు వరకు..అక్టోబర్ 18న ఇడుపులపాయలో రాజశేఖరరెడ్డి సమాధి చెంతన ప్రారంభమైన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఇప్పటికి ఐదున్నర రోజుల పాటు వైఎస్సార్ జిల్లాలో, 16 రోజుల పాటు అనంతపురం జిల్లాలో సాగింది. వైఎస్సార్ జిల్లాలో 82.5 కిలోమీటర్లు, అనంతపురం జిల్లాలో 194.5 కిలోమీటర్ల మేర షర్మిల నడిచారు. గురువారం 22వ రోజు అనంతపురం జిల్లాలో 8.2 కి.మీ. నడిచిన షర్మిల సాయంత్రం నుంచి కర్నూలు జిల్లాలో 4.3 కి.మీ. పాదయాత్ర చేశారు. 22వ రోజు మొత్తం 12.5 కి.మీ. సాగింది. మొత్తంగా ఇప్పటివరకు 281.30 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది.
అనంతాభిమానం...అనంతపురం జిల్లాలో 16 రోజుల పాటు సాగిన షర్మిల పాదయాత్రలో జిల్లా ప్రజలు కదం తొక్కుతూ అనంతమైన అభిమానం కురిపించారు. అక్టోబర్ 23న దాడితోట వద్ద భారీ సంఖ్యలో జిల్లా ప్రజలు తరలివచ్చి స్వాగతం పలికి.. జిల్లా సరిహద్దు దాటేవరకు వెన్నంటే ఉన్నారు. జిల్లా ఎమ్మెల్యేలు కాపు రాంచంద్రారెడ్డి, గురునాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ డి.నారాయణ రెడ్డి, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు తోపుదుర్తి కవిత, గిరిరాజు నగేష్, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు వై.విశ్వేశ్వర్‌రెడ్డి, పైలా నర్సింహయ్య, జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే జొన్న రామయ్య, నేతలు తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, వీఆర్ రామిరెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, కడపల మోహన్‌రెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి, చవ్వా రాజశేఖర్‌రెడ్డి, వై.మధుసూదన్‌రెడ్డి తదితరులు పాదయాత్రలో షర్మిల వెంట నడిచారు. గురువారం యాత్రలో పాల్గొన్న వారిలో ఎమ్మెల్యేలు సుచరిత, అమర్‌నాథ్‌రెడ్డి తదితరులున్నారు.
No comments:
Post a Comment