దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫొటో అంశం కాంగ్రెస్ పార్టీలో మరోసారి కలకలం రేపింది. గాంధీభవన్‌లో నిన్న (31.07.2012) యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ బాధ్యతలు స్వీకరించింది. ఈ సందర్భంగా మాట్లాడిన యువనేతలలో ఎక్కువ మంది ఆ మహానేత సేవలను కొనియాడారు. ఆయన వల్లే తమకు ఈ పదవులు లభించాయని చెప్పారు. అయితే ఈ కార్యక్రమం జరిగే హాలులో వైఎస్ ఫోటో లేదు. హాలులోనే కాదు గాంధీభవన్ లోనే లేదు. దీనిని గమనించిన వైఎస్ ఆప్తమిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రసంగించే సమయంలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని ప్రశ్నించారు. ఈ అంశంపై ఆయన ఉద్విగ్నభరితంగా మాట్లాడారు. కంటనీరు పెట్టుకున్నారు. హాల్ లో గానీ, గాంధీభవన్ లో గానీ వైఎస్ ఫొటోలేకపోవడం సిగ్గుచేటన్నారు. 'కాంగ్రెస్‌లో యువతను ప్రోత్సహించిన వ్యక్తి రాజీవ్‌గాంధీ అయితే రాష్ట్రంలో యువతను ప్రోత్సహించిన వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి. మనందరి హృదయాల్లో ఉన్న వైఎస్ ఆర్ బొమ్మ ఈ వేళ దురదృష్టం కొద్దీ ఈ హాలులో గానీ, ఈ ప్రాంగణంలోగానీ లేదు. ఇక్కడున్న కార్యకర్తలందరినీ ఇది బాధిస్తోంది’’ అని కెవిపి అన్నారు. ఆయన మాటలకు వేదికపైన ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బిత్తరపోయారు. మంత్రులు తలలుదించుకున్నారు. మంత్రి రఘువీరా రెడ్డి అయితే కంటనీరు పెట్టుకొని తలదించుకున్నారు. కార్యక్రమానికి వచ్చిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్‌ఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. దివంగత నేతపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. నినాదాలతో సభ దద్దరిల్లింది. ఆ తరువాత ఈ విషయం పార్టీ వర్గాలలో తీవ్రస్థాయిలోనే చర్చకు దారి తీసింది.
కాంగ్రెస్ పార్టీలోనే కాదు, దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టనటువంటి గొప్ప పథకాలను ఆయన ప్రవేశపెట్టారు. రైతులు, పేదలు, బడుగువర్గాలు, మైనార్టీలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి తద్వారా రాష్టాభివృద్ధికి ఉపయోగపడేటటువంటి అద్వితీయమైన పథకాలు ఆయన ప్రవేశపెట్టారు. ఆయన అమలు చేసిన పథకాలు సామాన్యమైనవి కావు. రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్క్షం, ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను ఆయన సాహసంతో మొదలుపెట్టి నిరాటంకంగా కొనసాగించారు. ఇందిరమ్మ ఇళ్లు, వృద్ధులకు పెన్షన్ పథకం ద్వారా లక్షల మందికి లబ్ది చేకూర్చారు. ఆయన హయాంలో లబ్దిపొందని కుటుంబంలేదంటే అతిశయోక్తికాదు.
35 సంవత్సరాలకు పైగా సుదీర్ఘకాలం ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అనేక పదవులు అలంకరించారు. రెండుసార్లు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నారు. పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దీన స్థితిలో ఉన్న సమయంలో 16 వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి అధికారంలోకి తీసుకువచ్చారు. సంచలన పథకాల ద్వారా ప్రజాధరణ పొంది రెండవసారి కూడా కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఆయనది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన దుర్మరణం చెందారు. అంతటి ఘనచరిత్ర గల ఆ మహానేత ఫొటో పార్టీ కార్యాలయంలో లేకపోవడంతో నేతలకు, కార్యకర్తలకు ఆగ్రహం రావడం సహజం.
No comments:
Post a Comment