YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal
Thursday, April 10, 2025

Saturday, 4 August 2012

విద్యార్థులపైనే ఫీజు భారం!

* ఏటా పెరగనున్న రూ.500 కోట్ల భారం పేద విద్యార్థులపైనే!
* ప్రస్తుతానికి ఇదే అత్యుత్తమ ప్రత్యామ్నాయమని సూచన
* పథకంలో విద్యార్థుల సంఖ్య తగ్గించడం సరికాదు
* ప్రతిభ ఆధారిత చెల్లింపు ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు
* కామన్ ఫీజు హేతుబద్ధతను మరోసారి పరిశీలించాలి
* కమిటీ భేటీలో వీటిపైనే చర్చ.. ఖరారు కాని సిఫారసులు
* రేపు మరోసారి సమావేశం తర్వాత ప్రభుత్వానికి నివేదిక

హైదరాబాద్, న్యూస్‌లైన్: వృత్తివిద్యా కళాశాలల్లో పెరగనున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ భారాన్ని విద్యార్థులపై మోపడమే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యుత్తమ ప్రత్యామ్నాయమని ఫీజులపై సీఎం కిరణ్ నియమించిన నిపుణుల కమిటీ అభిప్రాయానికి వచ్చింది. పెరగనున్న ఫీజులతో ప్రభుత్వంపై ఏటా రూ.500 కోట్ల చొప్పున అదనపు భారం పడుతున్నందున ఇదే సరైన మార్గమని కమిటీ భావిస్తోంది. ప్రస్తుతం ఇంజనీరింగ్ విద్యార్థులకు చెల్లిస్తున్న రూ.31 వేలే ప్రభుత్వం భరించి.. ఆపై ఎంత పెరిగినా.. ఆ మొత్తాన్ని విద్యార్థే భరించేలా చూడాల్సి ఉంటుందని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డట్టు సమాచారం. 

శనివారం సచివాలయంలో కమిటీ తొలిసారిగా భేటీ అయింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రద్దు చేయడం, విద్యార్థుల సంఖ్య తగ్గించడం సమంజసమైన నిర్ణయాలు అనిపించుకోవని, ప్రతిభ ఆధారిత ఫీజుల చెల్లింపు విద్యార్థుల పరిమిత సంఖ్యకు మాత్రమే పనికొస్తుందని, అది కూడా తక్షణ అమలు సాధ్యం కాదని కమిటీ ప్రాథమికంగా అభిప్రాయపడింది. అయితే సిఫారసులు మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. సోమవారం మరోసారి సమావేశమై సిఫారసులను ఖరారుచేస్తారు.

గణాంకాల విశ్లేషణ..
ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కమిటీ సమావేశంలో తొలుత ఉన్నత విద్య కార్యదర్శి ఎం.జి.గోపాల్ సుప్రీంకోర్టు తీర్పును, దాని ప్రభావంతో మారనున్న ఫీజుల సరళిని, అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్సీ) ప్రతిపాదించిన ఫీజులను వివరించారు. అనంతరం నిపుణుల కమిటీ కన్వీనర్, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జె.రేమండ్ పీటర్ గతేడాది వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 

కోర్సుల వారీగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న విద్యార్థుల సంఖ్య, ప్రభుత్వం భరిస్తున్న మొత్తం, ఫీజుల పెరుగుదల వల్ల పడే భారాన్ని విశ్లేషించారు. గత ఏడాది ఈ పథకం ద్వారా 25 లక్షల మంది విద్యార్థులు లబ్ధిపొందారని, రూ.2900 కోట్లు ప్రభుత్వం వెచ్చించిందని తెలిపారు. పెరిగే ఫీజుల వల్ల రూ.500 కోట్ల భారం పడనుందని వివరించారు.

భారం తగ్గించుకునేందుకు ఏం చేద్దాం..?
ఫీజుల పథకం వల్ల పడే భారాన్ని తగ్గించుకునేందుకు ప్రస్తుతం ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపై కమిటీ సభ్యులంతా చర్చించారు. సమావేశంలో నిపుణుల కమిటీలోని సభ్యులు రీమ్యాప్ చైర్మన్ కె.సి.రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి డి.సాంబశివరావు, ఐఐటీహెచ్ డెరైక్టర్ యు.బి.దేశాయ్, జేఎన్టీయూ కాకినాడ వీసీ తులసీరాందాస్, ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్ రామకృష్ణయ్య పాల్గొన్నారు. నిపుణులంతా వారి సూచనలు, అభిప్రాయాలను వివరించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం సమావేశంలో వ్యక్తమైన ప్రధాన సూచనలు, అభిప్రాయాలివీ..

*ప్రస్తుతం చెల్లిస్తున్న ఫీజు వరకే ఇచ్చి.. పెరిగిన భారాన్ని విద్యార్థులపైనే వేయాలి. మెజారిటీ సభ్యులు మొగ్గు చూపిన అంశం ఇది. అయితే అదనంగా రూ.500 కోట్లే అవుతున్నందున మొత్తం చెల్లిస్తే నష్టమేంటని ఇద్దరు సభ్యులు అభిప్రాయపడ్డారు.

*అసలు ఎంసెట్, ఐసెట్ తదితర అడ్మిషన్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌లో.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందే విద్యార్థులు ఫీజులు కట్టాల్సిన పనిలేదు అనే నిబంధన పెట్టడం సమంజసంగా లేదని నిపుణులు పేర్కొన్నారు. దీనివల్ల కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌లో జాప్యం చోటుచేసుకుంటోందని పేర్కొన్నారు. దీనికి ప్రత్యామ్నాయ మార్గం చూడాలన్నారు. అయితే కళాశాలలు విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా ఈ నిబంధన అవసరమేనని మరి కొందరు సభ్యులు అన్నారు.

*చదువుతున్న కోర్సులో విద్యార్థి ఉత్తీర్ణత శాతాన్ని లింక్ పెట్టడం ద్వారా పథకాన్ని పరిమితం చేయొచ్చన్న సూచన వచ్చింది. అయితే దీనివల్ల లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుందని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.

*అంతకుముందు చదివిన కింది కోర్సులో టాపర్లను ఎంచుకుని ప్రతిభ ఆధారిత ఉపకార వేతనాలు చెల్లించాలన్న సూచన కూడా వచ్చింది. అయితే ఇది ఇప్పటికిప్పుడు సాధ్యపడదని కొందరు, లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుందని మరికొందరు అభిప్రాయపడ్డారు.

*ఇంజనీరింగ్ కామన్ ఫీజు రూ.50,200గా నిర్ధారించడానికి ఉన్న హేతుబద్ధతను మరోసారి పరిశీలించాలని నిపుణులు సూచించారు.

*విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే కాబట్టి.. ఆరు నుంచి పది సిఫారసులను సోమవారం కేబినెట్ సబ్ కమిటీ భేటీకి ముందు సమర్పించాలని అభిప్రాయపడ్డారు. ఇందుకు సోమవారం ఉదయం 10 గంటలకు కమిటీ మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

సిఫారసులు ఇంకా ఖరారు కాలేదు: ఎంజీ గోపాల్
కమిటీ సమావేశంలో చర్చించామే తప్ప.. ఇప్పటివరకు ఫీజులపై ఎలాంటి సిఫారసులు తయారుచేయలేదని, సోమవారం మరోసారి సమావేశమవుతామని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!