YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal
Wednesday, April 09, 2025

Saturday, 4 August 2012

ఆరోగ్యశాఖకు సుస్తీ!

ఉన్నవి ఖర్చు చెయ్యరు.. రావాల్సినవి ఇవ్వరు
వాడుకోలేకపోయిన నిధులు రూ.700 కోట్లు!
సర్కారు మొండిచేయి చూపినవి మరో రూ.394 కోట్లు
నిధుల్లేకే ఎంబీబీఎస్, పీజీ సీట్లు కోల్పోయిన వైనం
పారిశుధ్యం, నిర్వహణా వ్యయాలకు కూడా దిక్కు లేదు
మూడేళ్లలో ఒక్క బోధనాసుపత్రిలోనూ మౌలిక వసతులు కల్పించలేదు

హైదరాబాద్, న్యూస్‌లైన్: అమ్మ పెట్టదు, అడుక్కూ తిననివ్వదు అన్న చందంగా తయారైంది వైద్య ఆరోగ్యశాఖలో నిధుల పరిస్థితి. ఉన్న నిధులను ఖర్చు చేయకపోగా ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వడం లేదు. మూడేళ్లుగా ఇదే తంతు! దాంతో వైద్య ఆరోగ్య శాఖకు అనుబంధంగా ఉన్న బోధనాసుపత్రులు, వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్యశ్రీ వార్డులు.. ఇలా అన్ని విభాగాలూ మూడేళ్లుగా వసతుల లేమితో కుదేలవుతున్నాయి. నిధుల లేమి వల్లే చివరకు 350 ఎంబీబీఎస్ సీట్లనూ కోల్పోవాల్సి వచ్చింది! పైగా రాష్ట్రానికి రావాల్సిన పీజీ సీట్లనూ తెచ్చుకోలేకపోయారు. బోధనాసుపత్రుల్లోనైతే సౌకర్యాలు రోజురోజుకూ మృగ్యమవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి వచ్చిన నిధులనే కాదు, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) నిధులనూ సకాలంలో ఖర్చు చేయక పనులన్నీ ఆగిపోయాయి. ఇలా 2011-12లోనే సుమారు రూ.700 కోట్ల కేంద్ర నిధులను ఖర్చు చేయలేకపోయినట్టు ప్రాథమిక పరిశీలనలో వెల్లడైంది. నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశే అందరి కంటే వెనకబడిందని కేంద్రం చెప్పడం మన చేతగానితనానికి ప్రత్యక్ష ఉదాహరణ!

వచ్చినవి వాడుకోలేదు

ఎన్‌ఆర్‌హెచ్‌ఎం కింద రాష్ట్రానికి 2011-12లో రూ.960 కోట్లు నిధులొస్తే ఇప్పటిదాకా ఖర్చు చేసింది రూ.560 కోట్లు మాత్రమే. అలా రూ.400 కోట్లు మురిగిపోయాయి. దాంతో ఎన్నో ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారు. 2011-12కు 145 పీజీ వైద్య సీట్ల కోసమంటూ కేంద్రం మనకు రూ.200 కోట్లు కేటాయించింది. తొలివిడతగా రూ.60 కోట్లిచ్చింది. వాటికి 25 శాతం మ్యాచింగ్ గ్రాంట్ కింద రూ.15 కోట్లను రాష్ట్రం ఇప్పటికీ ఇవ్వలేదు. దాంతో రెండో విడత నిధులు ఇవ్వలేమని కేంద్రం తెగేసి చెప్పింది. అలా పీజీ వైద్య విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనకూ గండిపడింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 10 బోధనాసుపత్రుల అభివృద్ధి కోసమంటూ రూ.120 కోట్లు కేటాయించారు. వాటిని నేరుగా ప్రిన్సిపళ్లే ఖర్చు చేయాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. కానీ వారికి చెక్ పవర్ లేక 7 నెలలుగా ఆ నిధులన్నీ అలాగే ఉండిపోయాయి. పైగా ఆరోగ్యశ్రీ ఆపరేషన్లకు మౌలిక వసతుల కల్పన కోసం రివాల్వింగ్ ఫండ్‌గా 2009లో వైఎస్ హయాంలో ఇచ్చిన రూ.55 కోట్లకు ఇప్పటికీ టెండర్లే ఫైనల్ చేయలేని దుస్థితి! గతేడాది మందుల కొనుగోలుకు రూ.324 కోట్లు కేటాయించినా చివరకు రూ.70 కోట్లు ఖర్చు చేయలేక మురిగిపోయాయి.

ఇవ్వాల్సిన వాటికి దిక్కే లేదు: ఇలా ఒకవైపు వచ్చిన నిధులను వాడుకోలేక చేతులెత్తేసిన రాష్ట్రం, తానివ్వాల్సిన నిధులను కూడా అసలే ఇవ్వలేదు. మౌలిక వసతులకు రూ.79.6 కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రానికి మరో 350 ఎంబీబీఎస్ సీట్లు వచ్చేవి. కానీ సర్కారు పైసా కూడా ఇవ్వలేదు. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి రూ.200 కోట్లిస్తామని రెండేళ్లు గడిచినా పైసా కూడా ఇవ్వలేదు. ఒంగోలు, శ్రీకాకుళం రిమ్స్‌లకు సకాలంలో నిధులు మంజూరు చేయక మూడేళ్లుగా నిర్మాణాలే పూర్తవలేదు. దాంతో ఎంబీబీఎస్ సీట్లు కూడా పోయే పరిస్థితి ఎదురైంది. రాష్ట్రంలోని మూడు ఫ్రభుత్వ ఆయుర్వేద, హోమియో కాలేజీలకు నిధులు మంజూరు చేయకపోవడంతో రెండేళ్లుగా వాటికి సీట్ల కేటాయింపును ఆపేశారు. ఏపీవీవీపీ, డీఎంఈ పరిధిలోని ఆస్పత్రులకు నిర్వహణ ఖర్చుల కింద ఏటా ఇవ్వాల్సిన రూ.50 కోట్లు ఇవ్వకపోవడంతో చాలా ఆస్పత్రుల్లో బల్బులు, ఫ్యాన్లు మార్చుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది!

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!