‘సూదికోసం సోదికెళితే..’ అన్న సామెత చందంగా తయారయింది ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వ్యవహారం. గతాన్ని గుర్తు చేసినందుకు ఆయనగారు మీడియాపై గయ్యిమన్నారు. ఉన్నమాట అన్నందుకు అంతుచూస్తానంటూ అంతెత్తున లేచారు. తగాదాల త్రిమూర్తులుగా ఘనత వహించిన సదరు నేత తన నిజస్వరూపాన్ని మరోసారి బయటపెట్టారు. ఉప ఎన్నికల్లో ‘అందరివాడు’లా ఫోజుకొట్టి ఓట్లు వేయించుకుని ఎమ్మెల్యేగా అవతరించి కొన్నిరోజులైనా గడవక ముందే కదం తొక్కారు. వాస్తవాన్ని వెల్లడించిన ‘సాక్షి’ విలేకరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘నీ సంగతి తేలుస్తా’ అంటూ హడలె త్తించారు. మీ ఆఫీసులు తగెలెట్టించేస్తానంటూ చిందులేశారు.
అసలు విషయం ఏమిటంటే ఆయనపై ఉన్న భూ వివాదం కేసును ఉపసంహరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండాజీవో జారీచేసింది. ఈ విషయాన్ని బయటపెడుతూ ఆయనపై పాత కేసులను ‘సాక్షి’ ప్రస్తావించింది. పైగా అవ న్నీ ఎన్నికల అఫిడవిట్‌లో ఆయనే స్వయంగా ఎన్నికల సంఘానికి విన్నవించుకున్న నికార్సయిన వాస్తవాలు. 1997లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువకుల శిరోముండనం కేసు నుంచి తాజా భూ తగాదా వరకు త్రిమూర్తులు రాజకీయ ప్రస్థానం ఎలా సాగిందో రామచంద్రాపురంతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ ఎరుకే. పాపం ఆయనే మరిచినట్టున్నారు. జ్ఞాపకశక్తి లేకపోవడం, ఉన్నా లేనట్టు నటించడం నేటి రాజకీయ నేతల నైజం. గుర్తుచేయడం మీడియా బాధ్యత. మెదడు మొద్దుబారిన అభినవ ‘పొలిటికల్ గజనీ’ల పాలిట సింహస్వప్నంగా మారిన మీడియాపై నేతల రంకెలు కొత్తకాదు.
అయితే తాము పదవుల వేటలో వెనుకబడతామేమోనన్న అనుమానం కలిగినప్పుల్లా మీడియాపై అక్కసుతో నాయకులు దండెత్తడం ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. ఇప్పుడు త్రిమూర్తులు కూడా ఈ ఫార్ములానే నమ్ముకున్నట్టు కనబడుతోంది. ఈమధ్యన జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ ’కాపు’కాయడంతో రామచంద్రాపురంలో ఆయన ఎమ్మెల్యేగా బయటపడ్డారు. దీంతో ఆయనకు మంత్రి గిరి కోసం వారి అధినేత చిరంజీవి పైరవీలు మొదలుపెట్టారని ఊహాగానాలు షికార్లు చేశాయి. మోపిదేవి వెంకటరమణ జైలుకు వెళ్లడంతో ఖాళీ అయిన ఎక్సైజ్ శాఖను తోటకు కట్టబెట్టాలని చిరు సీరియస్‌గా ప్రయత్నించారని వార్తలు వ్యాపించాయి. అందులో భాగంగానే తోటపై ఉన్న భూ తగాదా కేసును ప్రభుత్వం ఎత్తివేసిందన్న ఆరోపణలు వినబడుతున్నాయి.
ఊరిస్తున్న అమాత్య పదవి అందకుండా పోతుందన్న భయంతోనే త్రిమూర్తులు ‘సాక్షి’పై విరుచుకుపడినట్టు కనబడుతోంది. ఏదేమైనా బాధ్యయుత పదవిలో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలి. అంతకుమించి వాస్తవాలను ఒప్పుకునే ధైర్యముండాలి. ఈ నిజం మన నాయకులు ఎప్పుడు గ్రహిస్తారో...?
No comments:
Post a Comment