మూడు నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఏవిధంగా వస్తుందో టీఆర్‌ఎస్ స్పష్టంగా చెప్పాలని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకురాలు కొండా సురేఖ డిమాండ్ చేశారు. సోమవారం మార్కాపురంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ వస్తుందని టీఆర్‌ఎస్ ఇప్పటివరకు 30 సార్లు చెప్పి ప్రజలను మోసగించిందన్నారు. దీనిపై సెప్టెంబర్ 15 నుంచి ఉద్యమించనున్నట్లు చెప్పారు. పరకాల ఉపఎన్నికలో 44 మంది ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లలో ఒక్క ఓటు కూడా టీఆర్‌ఎస్‌కు పడలేదన్నారు. సిరిసిల్లలో వైఎస్ విజయమ్మ ఇటీవల చేపట్టిన దీక్షను ప్రజలు అడ్డుకోలేదని, కేవలం టీఆర్‌ఎస్ కార్యకర్తలను ఆ పార్టీ నేతలు రెచ్చగొట్టడం వల్లే అడ్డుకునే యత్నం చేశారన్నారు.
సంక్షేమ పథకాలకు తూట్లు : దివంగత నేత వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలకు తూట్లు పొడవడం ద్వారా ప్రభుత్వం ప్రజల మనసుల్లో నుంచి ఆయనను తుడిచివేసేందుకు కుయుక్తులు పన్నుతోందని సురేఖ విమర్శించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదనీ కేవలం వైఎస్సార్సీపీని, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని ఇబ్బందులకు గురిచేసే పనిలో తలమునకలై ఉన్నాయనీ వ్యాఖ్యానించారు. జగన్ నిర్దోషిగా త్వరలో బయటకొస్తారన్నారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాలనూ వైఎస్‌ఆర్ సీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment