YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 4 August 2012

సోనియాను విజయమ్మ కలవలేదు

రైతు సమస్యలు, సీబీఐ కక్షసాధింపుపై వివరించడానికే ఢిల్లీ వెళ్లాం
కాంగ్రెస్, టీడీపీల నుంచి వలసలను ఆపుకోవడానికే దుష్ర్పచారం జరుగుతుండవచ్చు
మా పార్టీలోకి ఎవరు వచ్చినా జగన్ స్క్రీనింగ్ చేసే తీసుకుంటారు
మొదట వచ్చినవారికి మొదటి అవకాశం.. 

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారంటూ వచ్చిన వార్తలను ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ‘‘జూలై 4వ తేదీన విజయమ్మతో పాటు నేను, మాజీ ఎంపీ మైసూరారెడ్డి, మాజీ మంత్రి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యేలు సుచరిత, శోభానాగిరెడ్డి కలిసి ఢిల్లీలో ప్రధాని మన్మోహన్‌సింగ్, కేంద్ర మంత్రి పవార్, లెఫ్ట్ నేతలు బర్ధన్, ప్రకాష్ కారత్, టీఎంసీ నేత సుల్తాన్ అహ్మద్‌ను కలుసుకున్నాం. చివరిగా మేమంతా విజిలెన్స్ కమిషనర్‌ను కూడా కలిశాం. అక్కడ విజయమ్మ వారికి తొలుత చెప్పింది రాష్ట్రంలో రైతుల సమస్యల గురించి. ఆ తరువాత సీబీఐ తమపై ఎలా కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందో వివరించారు. 

వాస్తవం ఏమిటంటే సోనియాను విజయమ్మ కలవలేదు. (ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ) అందులోనే వచ్చింది కదా, కాంగ్రెస్ నుంచి వలసలను ఆపుకోవడానికి ఇలాంటి వార్తను ప్రచారం చేసి ఉండొచ్చని’’ అంటూ మేకపాటి వివరించారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అడిగిన ప్రశ్నలకు ఆయన పై విధంగా స్పందించారు. టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా ‘‘కాంగ్రెస్ మాదిరిగానే టీడీపీ కూడా వలసలను ఆపుకోవడానికి ఆయనతో అలా మాట్లాడించి ఉండవచ్చు’’ అని మేకపాటి అన్నారు. ఆ రెండు పార్టీలూ స్వీయ రక్షణలో పడి ఇలాంటి విమర్శలు చేస్తున్నాయన్నారు.

జగన్ గెలుపును ఆపలేరు: అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎవరితోనూ కలవాల్సిన అవసరం లేదని రాజమోహన్‌రెడ్డి అన్నారు. అలాగే ఏ పార్టీ కూడా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గెలుపును రాష్ట్రంలో ఆపలేదని విశ్వాసం వ్యక్తంచేశారు. మొన్నటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి పోరాడింది కనుక చాలా చోట్ల రెండో స్థానంలోకి వచ్చిందని, 2014లో మాత్రం ఆ పార్టీ మూడో స్థానానికి దిగజారుతుందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీయే జగన్‌తో వైఎస్సార్ కాంగ్రెస్‌ను పెట్టించిందన్న విమర్శలకు ఆయన నవ్వుతూ అవి పూర్తిగా హాస్యాస్పదమైన వ్యాఖ్యలని, కాంగ్రెసే జగన్‌తో పార్టీని పెట్టించి ఉంటే ఇన్ని రోజుల పాటు ఆయన జైలులో ఎందుకు ఉండాల్సి వస్తుంది? అని అన్నారు. కాంగ్రెస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారన్న విమర్శలను ఆయన తోసి పుచ్చుతూ రాష్ట్రంలో ఎవరు ఎవరితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటున్నారో ప్రజలకు తెలుసునని, శంకర్‌రావు జగన్‌పై పిల్ వేయడం, అందులో టీడీపీ నేతలు వాదులుగా చేరడం అందరికీ తెలిసిందేనన్నారు. మన రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ ఎంపీలున్నా కేంద్రం మాత్రం ఆంధ్రప్రదేశ్‌పై శీతకన్ను వేస్తోందని మేకపాటి విమర్శించారు. సహజవాయువు కేటాయింపులో మన రాష్ట్రానికి కోత విధించడాన్ని ఉద్దేశించి ఆయన పై వ్యాఖ్య చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో 35 నుంచి 40 స్థానాల వరకూ గెల్చుకుంటే జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తుందని, అప్పుడు రాష్ట్రానికి కావాల్సినవి డిమాండ్ చేసి తెచ్చుకోవడానికి అవకాశముంటుందని అన్నారు. 

ప్రభుత్వాన్ని పడగొట్టం: రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న తొందర తమ పార్టీకి ఏ మాత్రం లేదని, అసలు తాము ఆ ప్రయత్నం చేయడం లేదని ఎంపీ మేకపాటి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాంగ్రెస్ నుంచి ఎంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులు వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వస్తున్నారని ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలియదని, మంత్రులెవరైనా తమ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని రావాలనుకుంటూ ఉండొచ్చన్నారు. ‘‘మా పార్టీలోకి రావాలని చాలా మంది ఉబలాటపడుతున్నారు... తొలుత వచ్చిన వారికి తొలుత (ఫస్ట్ కం ఫస్ట్ సెర్వ్) అనే ప్రాతిపదికన అవకాశాలుంటాయి. ఇప్పటికే రద్దీ ఎక్కువైంది. కొన్ని చోట్ల మా పార్టీ తలుపులు మూసేస్తున్నాం.. అలాంటి చోట్ల తమ స్థానాలు ఫిలప్ అయి పోయాయే.. అని కూడా బయట ఉన్న వారు కొందరు ఆవేదన చెందుతున్నారు. మా పార్టీలోకి రావాలనుకున్న వారిని జగన్ కచ్చితంగా స్క్రీనింగ్ చేసే తీసుకుంటారు. ఫలానా వ్యక్తి మా పార్టీలోకి రావాలనుకుంటే ప్రజల్లో ఆయనకున్న ప్రతిష్టను కూడా పరిగణనలోకి తీసుకుంటాం’’ అని అన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!