YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 1 August 2012

ఖరీఫ్‌కు కష్టమొచ్చింది

సగం ముగిసిన సీజన్ 
13.5 లక్షల ఎకరాల్లో తక్కువగా పంటల సాగు
విశాఖ, అనంత పురం, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో తక్కువ వర్షాలే
365 మండలాల్లో వర్షాభావం.. 38 మండలాల్లో తీవ్రం
480 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు
283 మండలాల్లోనే సాగుకు అనుకూల వర్షాలు
వ్యవసాయ శాఖ తాజా లెక్కలు
పవార్ లెక్క ప్రకారం రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ కరువు లేనట్లే

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్ సాగు కష్టాల్లో పడింది. జూన్ 1 నుంచి ఆగస్టు 1 వరకు.. అంటే సరిగ్గా సగం సీజన్ పూర్తయిపోయినా.. ఈ ఏడాది అంచనాలకు అనుగుణంగా పంటల సాగు జరగలేదని వ్యవసాయ శాఖ లెక్కలు స్పష్టంచేస్తున్నాయి. మరో రెండు వారాల వరకు ఒక్క వరి సాగుకు మాత్రమే అవకాశముంది. కాగా అన్ని పంటల్లో ఇప్పటివరకు సాగుకావాల్సిన విస్తీర్ణం కన్నా 13.5 లక్షల ఎకరాల్లో తక్కువ సాగు నమోదైంది. పత్తి, సోయాబీన్ లాంటి నాలుగైదు పంటలు మినహా మిగిలిన ప్రధాన పంటలు, పప్పుధాన్యాలు, చెరకు లాంటి పంటలు కూడా తక్కువగానే సాగయ్యాయి.

మొదటి నుంచే వరుణుడి శీతకన్ను..
వాస్తవానికి ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచే వర్షాలు తక్కువగా కురుస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనాలు తప్పుతూ జూన్‌లో వర్షాలు అసలే రాలేదు. జూలైలోనూ ఆలస్యంగా ఓ మోస్తరు వర్షాలే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఖరీఫ్ ఆరంభం నుంచి ఆగస్టు 1 వరకు రాష్ట్రంలో 301.3 మిల్లీ మీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 3 శాతం తక్కువగా 291.3 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ఈ పరిస్థితి కాస్త నయమనిపించినా మండలాల వారీగా చూస్తే మాత్రం విభిన్నంగా ఉంది. మొత్తం 365 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.

అందులో 38 మండలాల్లో అయితే తీవ్ర వర్షాభావం నెలకొని కరువు కమ్మేసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక సాధారణ వర్షపాతం 480 మండలాల్లో నమోదు కాగా, 283 మండలాల్లో మాత్రమే సాగుకు అనుకూల వర్షాలు పడ్డాయి. విశాఖ, అనంతపురం, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో అయితే ఈపాటికి నమోదు కావాల్సిన వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదయింది. రాష్ట్ర వ్యాప్తంగా సాగుకు సరిపోయే వర్షాలు లేకపోవడంతో ఖరీఫ్ సాగు విస్తీర్ణం ఆశించిన మేర లేదు. ఖరీఫ్ సీజన్‌లో 2.2 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 1.35 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు కావాల్సి ఉంది. అయితే అందులో 1.21 కోట్ల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. ఇది సాధారణం కన్నా 13.57 లక్షల ఎకరాలు తక్కువ.

నూనె గింజలకు కష్టకాలమే..
ఈ ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటికే సాగుకావాల్సిన వేరుశనగ పంటలో 11 లక్షల ఎకరాలు తక్కువ సాగు కావడం రాయలసీమ జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులను తేటతెల్లం చేస్తోంది. రాష్ట్రంలో వరి, పత్తి తర్వాత ఎక్కువగా సాగు చేసే ఈ పంట సాధారణ సాగు విస్తీర్ణం 32 లక్షల ఎకరాలు కాగా 17.22 లక్షలు ఎకరాల్లో మాత్రమే వేశారు. వేరుశనగతోపాటు నువ్వులు, ఆముదం, పొద్దుతిరుగుడు వంటి అన్ని నూనె పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. ఖరీఫ్‌లో నూనెగింజల పంటల సాధారణ సాగు విస్తీర్ణం 44 లక్షల ఎకరాలు కాగా ఇప్పటికి కేవలం 25.77 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. వాస్తవానికి ఈ సమయానికల్లా 39.25 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగుకావాల్సి ఉంది. ఖరీఫ్‌లో త్వరగా పంట చేతికి వచ్చి రైతులకు ఆదాయం వచ్చేవి నూనెగింజల పంటలే. అయితే, పత్తి, సోయాబీన్‌లాంటి పంటలను మాత్రం ఈ ఖరీఫ్‌లో రైతులు ఎక్కువగానే సాగు చేపట్టారు. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 39.17 లక్షల ఎకరాలు కాగా, ఈ సీజన్‌లో ఇప్పటికే 45.35 లక్షల ఎకరాల్లో సాగు చేపట్టారు. ఇక సోయాబీన్ విషయానికొస్తే ఈసరికల్లా 3.2లక్షల ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా, అది ఇప్పటికే 4.6లక్షలకు చేరింది.

కేంద్ర మంత్రి లెక్కలో కరువు లేనట్లే..
ఈ సీజన్‌లో మండలాల వారీగా చూస్తే 365 మండలాల్లో తక్కువ (20 నుంచి 99 శాతం తక్కువగా) వర్షపాతం నమోదయింది. అయితే, జిల్లాల సగటు పరంగా లెక్కిస్తే మాత్రం కేవలం నాలుగు జిల్లాల్లోనే తక్కువ వర్షపాతం నమోదయింది. జూలై 15 నాటికి 50 శాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదైన జిల్లాలు, రాష్ట్రాలు ప్రకటించిన కరువు ప్రాంతాలకు మాత్రమే సబ్సిడీపై డీజిల్‌తో పాటు ఇతర ప్రభుత్వ సహకారం అందుతుందని కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్ పేర్కొన్న విషయం విదితమే. ఈ లెక్క ప్రకారం చూస్తే రాష్ర్టంలోని ఒక్క జిల్లాలో కూడా (జిల్లా యూనిట్‌గా) జూలై 15 నాటికి 50 శాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కరువు ప్రాంతాలను ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో తక్కువ వర్షపాతం మండలాల్లోని రైతులకు ఎలాంటి సాయం ప్రభుత్వ పరంగా అందే పరిస్థితి లేనట్లే.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!