YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 4 August 2012

పాతిక లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్తును నిలబెట్టగల శక్తి

మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన అసంఖ్యాకమయిన సంక్షేమ పథకాల్లోకెల్లా విశిష్టమయినది ‘ఫీజు రీఇంబర్స్‌మెంట్ పథకం’. లక్ష రూపాయల కన్నా తక్కువ వార్షికాదాయం కలిగి ఉన్న పేదల పిల్లలకు ప్రొఫెషనల్ కోర్సుల నిమిత్తం చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వడమన్నది ఈ పథకం సారాంశం. వాస్తవానికి పేదల పిల్లలకు ప్రొఫెషనల్ చదువులను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడమే ఈ పథకం లక్ష్యం. ఈ పథకం వల్ల పాతిక లక్షల మంది పేద విద్యార్థులు లబ్ధిపొందగలరని అంచనా. పథకం ప్రారంభించిన సంవత్సరమే -2008లో- రెండు వేల కోట్ల రూపాయలను కేటాయించింది ప్రభుత్వం. 2009లో ఈ మొత్తం మరో అయిదు వందల కోట్ల రూపాయల మేరకు పెరిగింది. 2010 నాటికి ఈ పథకం కింద కేటాయించిన మొత్తం 3,500 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ వివరాలు చూస్తే చాలు- ఈ పథకం వల్ల లబ్ధి పొందుతున్న పేద విద్యార్థుల సంఖ్య ఎంత బహుళంగా ఉంటోందో అర్థమయిపోతుంది.

అలాంటి పథకాన్ని అయోమయావస్థలోకి నెట్టేశారు ప్రస్తుత పాలకులు! ఇటీవల రెండు సందర్భాల్లో రాష్ట్ర గవర్నర్ కూడా ఉచిత విద్యా పథకాలను తప్పెన్నుతూ మాట్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రతిభతో నిమిత్తంలేని ఉచిత విద్యా పథకాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని ‘టిస్’ కోర్సుల ప్రారంభోత్సవంలో పాల్గొంటూ వ్యాఖ్యానించారు గవర్నర్. అలాగే, ఉచిత విద్యా పథకాలను ‘నిరంతరం కొనసాగించరా’దని కూడా ఆయన హితవు చెప్పారు. దాంతో, వైఎస్‌ఆర్ రూపొందించిన ఈ పథకం ఇకపై కొనసాగుతుందో లేదో తెలియని గందరగోళ పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ వచ్చే వారం -ఈ నెల 12, 13 తేదీల్లో- విద్యార్థుల కోసం దీక్ష చెయ్యనున్నట్లు ప్రకటించారు. ఈ దీక్ష పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కేంద్రం ఏలూరులో జరుగుతుంది.

నిజానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం విశిష్టత ఏమిటి? దీన్ని మామూలు సంక్షేమ పథకాల్లో ఒకటిగా చూడకూడదు. మహానేత వైఎస్‌ఆర్ అన్నట్లుగా ఇది జాతి భవిష్యత్తుకోసం పెడుతున్న పెట్టుబడి మాత్రమే! ఆ రకంగా చూస్తే ఇది అక్షరాలా సమాజ సంక్షేమ పథకం. విద్యావేత్తలెందరో ఈ పథకాన్ని ‘విప్లవాత్మకమయినది’గా కీర్తించారు. అలాంటి పథకానికి మోకాలు అడ్డం పెట్టడమన్న కార్యక్రమం వైఎస్‌ఆర్ మరణించిన వెంటనే మొదలయిపోయింది. అతిధి నటుడిగా ముఖ్యమంత్రి పదవిని ఆక్రమించిన కె.రోశయ్య తన ఏడాది హయాంలోనే -సంస్కరణల పేరుతో- ఈ పథకానికి గొయ్యి తవ్వడం మొదలుపెట్టారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న విద్యార్థులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని చెప్తూ పగ్గం బిగించారు. దానికి తోడుగా మరికొన్ని షరతులు కూడా విధించారాయన. ఇక చుక్కతెగి రాలినట్లు హటాత్తుగా ముఖ్యమంత్రి అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తొలి మీడియా సమావేశంలోనే ఈ పథకం ‘అర్హులకు మాత్రమే అందుతుం’దని అతి గడుసుగా మాట్లాడారు.

ఉల్లోపల ఏమేం చెప్తున్నారో ఏమో తెలియదు కానీ, బహిరంగంగా అధికార పక్షంతో సహా అన్ని పార్టీల పెద్దలూ ఈ పథకం గురించి సానుకూలంగానే మాట్లాడి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. పేద ప్రజల నట్టింటి దీపం లాంటి ఈ పథకం గురించి వ్యతిరేకంగా మాట్లాడేవారికి రాజకీయ భవిష్యత్తు శూన్యమేననే స్పృహ లేనివారు తప్ప ఎవరూ ఇందుకు భిన్నంగా మాట్లాడలేరు. అయితే, వట్టిమాటలతో కాగల కార్యం ఏముంటుంది? ఈ అవగాహనతోనే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఏలూరులో దీక్షకు కూర్చోవాలని నిర్ణయించారు. పాతిక లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్తును నిలబెట్టగల శక్తి ఈ ఒక్క పథకానికే ఉంది. అందుకే విజయమ్మ దీక్ష విజవంతం కావాలని -పేదల సంక్షేమం కోరుకునేవారంతా- కోరుకోవాలి!

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!