YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 4 August 2012

జనం నెత్తిన పిడుగు

నగరవాసులపై ‘గ్రేటర్’ పన్నుల కత్తి.. అభివృద్ధి పనులు చేయకున్నా.. నగరవాసులు నిత్యం నరకం చవిచూస్తున్నా.. పట్టించుకోని అధికారులు.. పన్నుల పేరిట దండుకోవడానికి మాత్రం వెనుకాడట్లేదు. ఇప్పటి దాకా వృత్తిపన్ను పరిధిలో లేని వారందరి నుంచి దీన్ని ముక్కుపిండి వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఏటా ఒక్కో ఉద్యోగిపై కనిష్టంగా రూ.700 నుంచి గరిష్టంగా రూ.2500 వరకు.. మొత్తంగా రూ.300 కోట్ల మేర వడ్డించడానికి కసరత్తు చేస్తోంది. హేతుబద్ధీకరణ పేరిట ఇప్పటికే ఆస్తిపన్ను వసూళ్లను పెంచిన జీహెచ్‌ఎంసీ త్వరలోనే దీన్ని రివిజన్ చేయనున్న నేపథ్యంలో అవీ పెరగనున్నాయి.

నెల జీతం రూ.5 వేలు దాటితే బాదుడే..
మీ నెల జీతం రూ.5 వేలు దాటిందా? మీరు పనిచేసే సంస్థ రిజిస్టర్‌లో మీ పేరు నమోదై ఉందా? ఈ రెండూ ఉన్నా.. మీరు ఇప్పటి వరకు వృత్తిపన్ను చెల్లించలేదా? అయితే ఇకపై చెల్లించకుండా తప్పించుకోలేరు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ సంస్థలతో పాటు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం కింద పేరు నమోదైన అన్ని వృత్తి, వ్యాపార రంగాల్లో పనిచేసే వారు వృత్తిపన్ను చెల్లించాల్సిందే. గ్రేటర్‌లో వృత్తిపన్నును వసూలు చేస్తోన్న వాణిజ్యపన్నుల శాఖ నుంచి ఈ బాధ్యతను సర్కారు జీహెచ్‌ఎంసీకి అప్పగించింది. 

అత్యధిక ఆదాయమే లక్ష్యం..
జీహెచ్‌ఎంసీ ఆదాయ మార్గాల్లో ఆస్తిపన్ను, టౌన్‌ప్లానింగ్, ట్రేడ్ లెసైన్సుల ఫీజులు ముఖ్యమైనవి. వీటిలో ఆస్తిపన్ను ద్వారా అత్యధికంగా గతేడాది రూ. 625 కోట్లు వసూలు కాగా, ఈ ఏడాది డిమాండ్ రూ. 800 కోట్లకు పెరిగింది. దీని తర్వాత వృత్తిపన్ను ద్వారా అత్యధిక ఆదాయం ఏటా రూ. 300 కోట్లు రాగలవని అధికారుల అంచనా. ఇప్పటిదాకా వృత్తిపన్నును వసూలు చేస్తున్న వాణిజ్యపన్నుల శాఖ అం దులో ఏటా 95 శాతం స్థానిక సంస్థ అయిన జీహెచ్‌ఎంసీకి అందజేయాల్సి ఉండగా, రూ.50 కోట్లు మాత్రమే చెల్లిస్తోంది. నగరంలోని చాలా ప్రైవేటు సంస్థలు ఉద్యోగుల వృత్తిపన్నును చెల్లించట్లేదనేది జీహెచ్‌ఎంసీ అంచనా. వీటన్నింటి నుంచీ పన్ను వసూలు చేస్తే ఏటా కనీసం రూ.300 కోట్లయినా రాగలవని భావిస్తున్నారు. డాక్టర్లు, ఇంజినీర్లు, ఆర్కిటెక్టులు, ఇంకా పలు ఉద్యోగ వర్గాల నుంచి ఈ పన్ను వసూలవుతున్న దాఖలాల్లేవు. వీరందరినీ వృత్తిపన్ను పరిధిలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే పన్ను చెల్లిస్తున్న వారి వివరాలనూ వాణిజ్యపన్నుల శాఖ నుంచి తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ కృష్ణబాబు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. 

త్వరలో కసరత్తు.. 
వృత్తిపన్ను వసూళ్లపై సర్కిళ్ల వారీగా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ను గుర్తించి, వృత్తిపన్ను చెల్లించని సంస్థలకు నోటీసుల జారీ తదితరమైన పనుల నిర్వహణకు బిల్ కలెక్టర్ల సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. అవసరమైన మేర అదనపు సిబ్బందిని నియమించడంతో పాటు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిం చనున్నారు. అక్టోబర్ నుంచి వృత్తిపన్ను వసూళ్లు ప్రారంభిస్తామని కృష్ణబాబు తెలిపారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!