YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 4 August 2012

కాంగ్రెస్‌లో కుంపట్లు

* రాష్ట్ర నాయకత్వం తీరుపై పార్టీలోనే విమర్శల వెల్లువ 
* ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు, ఎంపీల మధ్య సమన్వయం లేదంటున్న నేతలు..

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర కాంగ్రెస్‌లో ‘గ్యాస్’ ప్రకంపనలు మొదలయ్యాయి. కృష్ణా-గోదావరి బేసిన్ గ్యాస్‌ను కేంద్రమంత్రి షిండే మహారాష్ట్రకు తరలించుకుపోవటంపై ఎలా స్పందించాలో అర్థంకాక కాంగ్రెస్ నేతలు అయోమయంలో పడిపోయారు. రాష్ట్రం నుంచి అత్యధికంగా ఎంపీలున్నప్పటికీ కళ్లముందు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోలేకపోయారన్న విమర్శలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రికి, పార్లమెంట్ సభ్యులకు మధ్య సమన్వయం లేకపోవటం ప్రధాన లోపంగా నేతలు చెప్తున్నారు. ఒకవైపు విద్యుత్ కొరతతో రాష్ట్రం అల్లాడుతోంటే.. కేజీ బేసిన్ గ్యాస్‌కు గండి కొట్టటంతో రాష్ట్రంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుల నుంచి రోజూ 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నష్టపోవటం దారుణం అంటున్నారు. 

ఇదే విషయంపై మాజీమంత్రి ఒకరు మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో ఇప్పటికే 2,700 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగిన గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలున్నాయి. గ్యాస్ కొరత వల్ల ఆయా ప్రాజెక్టుల్లో సగం విద్యుత్ కూడా ఉత్పత్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు మరో మూడు వేల మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేసే గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు త్వరలో ఏర్పాటు కాబోతున్నాయి. కేంద్రం తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాల వల్ల అవి పనిచేసే అవకాశాల్లేకుండాపోతున్నాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వం మనుగడకు రాష్ట్రంలోని 31 మంది కాంగ్రెస్ ఎంపీలే కారణమని ఆయన గుర్తుచేశారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలను ఆ ఎంపీలు కానీ, కేంద్రం కానీ ఏ మాత్రం పట్టించుకోకపోవటం దారుణమన్నారు. 

కేంద్రంలో కేబినెట్ మంత్రులుగా ఎస్.జైపాల్‌రెడ్డి, కిషోర్‌చంద్రదేవ్‌లు ఉన్నా.. కేంద్ర సహాయ మంత్రులుగా పళ్లంరాజు, పనబాక లక్ష్మి, పురందే శ్వరిలు కొనసాగుతున్నా.. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ‘‘రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారు. నీటి కేటాయింపుల్లోనూ దారుణమే జరుగుతోంది. చివరకు మన రాష్ట్రంలోనే వెలికితీస్తున్న గ్యాస్‌ను కూడా ఇతర రాష్ట్రాలకు తరలించుకుపోతున్నా అడిగే నాథుడే కరువయ్యాడు’’ అని సీనియర్ ఎమ్మెల్సీ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంపై ఒత్తిడి తేవటంలో రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలమైందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!