YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 4 August 2012

మహారాష్ట్రకు గ్యాస్ మళ్లింపుపై ప్రధానికి విజయమ్మ లేఖ


* లేదంటే వీధి పోరాటం మినహా ప్రజలకు గత్యంతరం లేదు
* మహారాష్ట్ర కోసం మేం త్యాగం చేయాలనడం ఏ మేరకు సబబు?
* ఇష్టానికి కేటాయింపులు చేసే హక్కు మంత్రుల బృందానికెక్కడిది?
* రత్నగిరి ప్రాజెక్టుకు అసలు సహజవాయువు పొందే అర్హతే లేదు
* కేంద్రం వల్లే రాష్ట్రానికి నిత్యం ఇక్కట్లు..

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర విద్యుత్ ప్రాజెక్టులకు కేటాయించిన గ్యాస్‌ను మహారాష్ట్రకు మళ్లించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వులను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయం కోసం ప్రజలు వీధులకెక్కడం తప్ప గత్యంతరం లేదన్నారు. రాష్ట్ర ప్రాజెక్టులకు కేటాయించిన గ్యాస్‌ను మహారాష్ట్ర రత్నగిరి విద్యుత్కేంద్రానికి మళ్లించడంతో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ, ఆ ఆదేశాలను తక్షణం రద్దు చేయాలని కోరుతూ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు శనివారం విజయమ్మ లేఖ రాశారు. వివరాలిలా ఉన్నాయి..

గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి,
ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల రోదన. మా రాష్ట్రానికి చెందిన విద్యుత్ ప్రాజెక్టులకు కేటాయించిన సహజవాయువు వాటాను మహారాష్ట్రలోని రత్నగిరి విద్యుత్ ప్రాజెక్టుకు మళ్లించడంపై మీరు జోక్యం చేసుకోవాలని కోరుతున్నాం. ఈ మేరకు ఆగస్టు 1న పెట్రోలియం, సహజవాయువుల శాఖ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయకపోతే న్యాయం కోసం రాష్ట్ర ప్రజలు వీధుల్లోకి రావడం తప్ప గత్యంతరం లేదు. కృష్ణా-గోదావరి బేసిన్‌లోని డీ6 బ్లాకు నుంచి వెలువడే సహజవాయువును నిజాయతీగా, హేతుబద్ధ రీతిలో వివిధ ప్రాజెక్టులకు కేటాయించేందుకు కేంద్రంలో మంత్రుల సాధికారిక బృందాన్ని (ఈజీఓఎం) ఏర్పాటు చేశారు.

కొన్ని రాష్ట్రాలకు, కొన్ని ప్రాజెక్టులకు తమ ఇష్టానుసారం సహజవాయువును కేటాయించే అధికారం ఈ బృందానికి అసలే లేదు. దేశంలో ఇప్పటికే నెలకొల్పిన గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుల కంటే రత్నగిరిని ప్రత్యేకంగా ఈ మంత్రులు ఎలా పరిగణిస్తారు? దాన్ని ఒక్కదాన్ని మాత్రమే ఎరువుల ఫ్యాక్టరీలతో సమానంగా ఎలా చూస్తారు? మహారాష్ట్ర ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ త్యాగం చేయడం సబబేనంటారా? రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్‌కు నెలలో 12 రోజుల పాటు కోత విధించారు. మంత్రుల బృందం నిర్ణయం వల్ల రాష్ట్ర పరిశ్రమలు ఇకపై నెలంతా కోతలను భరించాల్సి ఉంటుంది!

ఎల్‌ఎన్‌జీ ఆధారిత ప్రాజెక్టది..
వాస్తవానికి రత్నగిరి ప్రాజెక్టుకు ఒక్క క్యూబిక్ మీటర్ సహజవాయువును కూడా కేటాయించడానికి వీల్లేదు. ఎందుకంటే దాన్ని నిర్మించిందే విదే శాల నుంచి ఎగుమతి చేసుకునే ఎల్‌ఎన్‌జీ ఆధారంగా. ఈ ప్రాజెక్టుకు కేజీ బేసిన్ గ్యాస్ నుంచి ఎలాంటి లింకేజీ (కేటాయింపు) లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులన్నింటికీ గ్యాస్ కేటాయింపులపై కేంద్రం ఆధ్వర్యంలోని గ్యాస్ లింకేజీ కమిటీయే 1989-2002 మధ్య లిఖితపూర్వక హామీలిచ్చింది. అప్పట్లో తూర్పు-పశ్చిమ ప్రాంతం గ్యాస్‌పైప్ లైన్ లేని నేపథ్యంలో కేజీ బేసిన్ నుంచే ప్రత్యేకంగా ఈ లింకేజీనిచ్చింది. కృష్ణా జిల్లా కొండపల్లి దాటాక గ్యాస్ పైప్‌లైన్ లేదు గనుక కేజీ బేసిన్ గ్యాస్‌ను రాష్ట్ర ప్రాజెక్టులే వినియోగించుకోవాల్సిన పరిస్థితి దానికి కారణం. రాష్ట్రంలో విద్యుత్కేంద్రాలతో పాటుగా కేజీ బేసిన్ గ్యాస్ ఆధారంగా నిర్మితమైనది ఒక్క నాగార్జున ఫెర్టిలైజర్స్ మాత్రమే.

కేంద్రం వల్లే ఇక్కట్లు
కేజీ బేసిన్ గ్యాస్ ఆధారంగా దేశంలో మరెక్కడా గ్యాస్ ఆధారిత ఎరువుల ఫ్యాక్టరీ గానీ, విద్యుత్ ప్రాజెక్టు గానీ నిర్మితం కాలేదనేది ఇక్కడ అతి ముఖ్యమైన అంశం. 1999-2002 మధ్య కేజీ బేసిన్ నుంచి లభ్యమయ్యే 16 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్ ఆధారంగానే రాష్ట్రంలోని విద్యుత్, ఎరువుల ప్రాజెక్టులను నిర్మించారు. 2009కి ముందు కేజీ బేసిన్ ఓఎన్‌జీసీ బావుల్లో గ్యాస్ ఉత్పాదన బాగా తగ్గినప్పుడు రాష్ట్ర ప్రాజెక్టులన్నీ ఉత్పాదక సామర్థ్యం కన్నా చాలా తక్కువగా విద్యుదుత్పత్తి చేశాయి. దాంతో ఖజానాకు విపరీతమైన నష్టం వాటిల్లింది. కేంద్రం తన వాగ్దానాన్ని నిలుపుకోలేకపోవడమే అందుకు కారణం. ఆ ఇబ్బందులను అధిగమించడానికి కూడా కేంద్రం అప్పట్లో సహకరించలేదు.

ఎప్పుడూ మాకే అన్యాయం
కేజీ బేసిన్‌లో రిలయన్స్‌కు చెందిన డీ6 బ్లాకు నుంచి మళ్లీ ఉత్పాదన మొదలైనప్పుడు సహజంగా ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు గ్యాస్ ఇవ్వడం పూర్తిగా న్యాయం. ముందు రాష్ట్ర ప్రాజెక్టులకు ఇచ్చాకే ఇతర ప్రాజెక్టులకివ్వాలి. మంత్రుల బృందం కూడా ముందుగా హామీ ఉన్న ప్రాజెక్టులకే గ్యాసివ్వాలి. గతంలో గ్యాస్ ఉత్పాదన లేనపుడు రాష్ట్ర ప్రాజెక్టులు పడ్డ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 16 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను మాకివ్వాలి. కానీ ఆశ్చర్యకరంగా అప్పుడూ మేమే ఇబ్బందులకు గురయ్యాం. ఇప్పుడూ మేమే సంక్షోభంలో ఉన్నాం.

రత్నగిరికి గ్యాస్ కేటాయిస్తూ పెట్రోలియం, సహజ వనరుల శాఖ జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలి. కేజీ బేసిన్ గ్యాస్ ఆధారంగా నిర్మితమైనవి మా రాష్ట్ర ప్రాజెక్టులే గనుక ముందుగా వాటికే 16 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ తర్వాత మిగిలే గ్యాస్‌ను మాత్రమే వేరే రాష్ట్రాలకివ్వాలి. ముందుగా మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నాం. మా కోరిక రాజ్యాంగంలోని 297 అధికరణను ఉల్లంఘించినట్లు ఎంతమాత్రమూ కాదని మనవి చేస్తున్నాం.

మీ విశ్వాస పాత్రురాలు
-వైఎస్ విజయమ్మ

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!