YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 3 August 2012

రీయింబర్స్‌మెంట్ రద్దుకు సర్కారు యోచన?


సుప్రీం తీర్పు సాకుగా నిపుణుల కమిటీ నియామకం
కామన్ ఫీజుతో పథకంపై పడే ప్రభావం విశ్లేషణకంటూ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన
కమిటీ సిఫారసుల పేరిట పేద విద్యార్థుల నోట్లో మట్టికొట్టేందుకేనంటూ వెల్లువెత్తుతున్న విమర్శలు
ప్రభుత్వ కళాశాలలోనే ఇంటర్ చదవాలనే ఆంక్ష పెట్టాలని యోచన.. 
విద్యార్థుల మార్కులతోనూ పథకానికి లింకు? 
ఇన్సెంటివ్‌లు లేదా మెరిట్ స్కాలర్‌షిప్పుల పేరిట 
కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చే యత్నం

విశ్వసనీయ సమాచారం మేరకు ప్రభుత్వం
దృష్టిసారించిన మూడు కీలకాంశాలు...
ఎలాగైనా ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యయాన్ని తగ్గించుకోవడం
సమూలంగా ఈ పథకం రూపురేఖలు మార్చడం
మేం కూడా విద్యార్థులకు మేలు చేస్తున్నామని చెప్పుకునేందుకు మార్పులతో కొత్త పథకం

హైదరాబాద్, న్యూస్‌లైన్: లక్షలాది మంది నిరుపేద విద్యార్థులు సంతృప్తస్థాయిలో వారు కోరుకున్న కోర్సును ఉచితంగా చదివేందుకు అమలు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి ప్రభుత్వం మంగళం పాడనుందా? ఇందుకు సుప్రీంకోర్టు తీర్పును సాకుగా తీసుకుంటుందా? కామన్ ఫీజు వ్యయాన్ని తప్పించుకునేందుకే నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనుందా? నిపుణుల కమిటీ సిఫారసుల పేరిట తన చేతికి మట్టి అంటకుండా చూసుకోవాలని భావిస్తోందా? రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన ప్రకటన వీటన్నిటికీ పరోక్షంగా అవుననే చెబుతోంది. ‘వృత్తివిద్యా కళాశాలలకు కామన్ ఫీజు ఉండాలన్న హైకోర్టు తీర్పును సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చినందున దీని ప్రభావం ఎలా ఉండబోతుందన్న అంశంపై ‘నిపుణుల కమిటీ’ ఏర్పాటు అవసరమైంది. కామన్ ఫీజు వల్ల ప్రస్తుత రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌పై ఉండే ప్రభావాన్ని విశ్లేషించడంతోపాటు, ఆర్థికంగా భరించగలిగిన విద్యను అందించడానికి ప్రభుత్వం వద్ద ఉన్న విభిన్న అవకాశాలను సిఫారసు చేసేందుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ కమిటీని నియమించారు...’ ఇదీ ఆ ప్రకటన సారాంశం. 

ఈ ప్రకటనను నిశితంగా పరిశీలిస్తే.. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అవుతున్న వ్యయాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని స్పష్టమవుతోంది. వాస్తవానికి ఈ వ్యయంపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే. కానీ ప్రభుత్వంపై వచ్చే విమర్శలను కొంతవరకైనా ఎదుర్కోవచ్చనే భావనతో... నిపుణుల కమిటీ వేసి ఆ కమిటీ సిఫారసుల పేరిట పథకం రద్దు చేసేందుకు సర్కారు యత్నిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కామన్ ఫీజు అమలు చేస్తే రీయింబర్స్‌మెంట్ కింద ఒక్క ఏడాదికే రూ.482 కోట్ల అదనపు వ్యయం అవుతుందని సాంఘిక సంక్షేమ శాఖ ఇప్పటికే ప్రాథమిక అంచనాలను ప్రభుత్వం ముందు పెట్టింది. దీనిపై నిర్ణయం తీసుకోకుండా కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన సమయంలో కమిటీ వేసిందంటే... ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునేందుకేనని స్పష్టమవుతోంది. 

ఈ కమిటీకి కనీసం నిర్దిష్ట కాలవ్యవధిని కూడా నిర్ణయించకపోవడం అనుమానాలకు మరింత ఊతం ఇస్తోంది. సాధ్యమైనంత త్వరలో నివేదిక ఇవ్వాలని చెప్పినా.. ఈనెల 6వ తేదీన ఫీజు రీయింబర్స్‌మెంట్ సబ్ కమిటీ సమావేశంలోపు సమర్పించాలని మౌఖికంగా మాత్రమే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. అయితే రెండే రెండు రోజుల్లో కమిటీ ఏం అధ్యయనం చేసి.. ఏ నివేదిక సమర్పిస్తుందని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఏం కోరుకుంటే అదే సమర్పించడం తప్ప కమిటీ ప్రత్యేకంగా విశ్లేషించేదేమీ ఉండదని చెబుతున్నారు. ఏదిఏమైనా ప్రస్తుతం ఉన్న విధానంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగించరాదనేదే ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆలోచనగా అధికారవర్గాలు చెబుతున్నాయి.

ఇదీ వ్యూహం 
ప్రస్తుత ఫీజును ఇస్తాం.. కానీ పెరిగే ఫీజును ఇంటర్ విద్యార్థులు భరించుకోవాలన్న ఆంక్షలు విధించడం..
ప్రభుత్వ కళాశాలల్లో చదివిన వారికే పథకాన్ని వర్తింపజేయడం

ఇంజనీరింగ్ కోర్సులో వచ్చే మార్కులను బట్టి ప్రోత్సాహకాల రూపంలో విద్యార్థికి నగదు ఇవ్వడం. లేనిపక్షంలో విద్యార్థి చదివిన కోర్సులో సాధించిన ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాలు ఇవ్వడం.. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలుచేస్తున్న ‘ఇన్‌స్పైర్’ వంటి పథకాన్ని ప్రకటించడం. ఉదాహరణకు ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో చేరే విద్యార్థికి.. ఇంటర్‌మీడియెట్‌లో వచ్చిన అత్యుత్తమ మార్కులను పరిగణనలోకి తీసుకుని ఏటా రూ.50 వేల వరకు ఉపకార వేతనం ఇవ్వడం. తద్వారా ఆ విద్యార్థి ఎక్కడైనా చదువుకునేందుకు వీలు కల్పించడం.

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కొనసాగించి (ఇది కేంద్రం భరిస్తుంది) బీసీ, ఈబీసీ వర్గాలకు మాత్రం ఈ ప్రోత్సాహక పథకం గానీ, ప్రతిభ ఆధారిత ఉపకారవేతనాల పథకం కానీ ప్రవేశపెట్టడం. తద్వారా రాజకీయ విమర్శలకు అడ్డుకట్ట వేయడం.

సవరణలకు, కొత్త పథకాలకు సమయం సరిపోదనుకుంటే.. భారాన్ని విద్యార్థుల పైనే మోపడం.

ఉద్దేశపూర్వకంగానే ఇంటర్‌తో లింకు! 

లక్ష రూపాయలలోపు ఆదాయం ఉన్న నిరుపేద విద్యార్థుల్లో ఎక్కువమంది ఇంటర్మీడియెట్ ప్రభుత్వ కళాశాలల్లోనే చదువుతున్న విషయాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తోంది. జూనియర్ కళాశాల ల్లో లెక్చరర్ పోస్టులు 7 వేలకు పైగా ఖాళీగా ఉన్నాయి. వసతులే లేవు. ఈ పరిస్థితుల్లో ఎంతమంది ఇంటర్‌లో అత్యుత్తమ మార్కులు సాధిస్తారు? ఇది కీలకమైన అంశం. కేవలం ప్రతిభనే ఆధారంగా మిగతావారంతా ఏం కావాలి? ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి మూల సూత్రం ఇదే. విద్యార్థులు తగ్గితే ఆ మేరకు ప్రభుత్వానికి వ్యయమూ తగ్గుతుంది.

ఇంటర్‌లో అరకొర చదువుతో ఉత్తీర్ణులై, ఎంసెట్‌లో ఏదో ఒక ర్యాంకు సాధించి ఇంజనీరింగ్‌లో చేరాక.. కోర్సులో ప్రతిభకు లింకు పెడితే ఉన్నఫళంగా ఆ విద్యార్థి ప్రతిభ సాధిస్తాడా? బీటెక్ అర్హత గల ప్యాకల్టీతో ఇంజనీరింగ్ కళాశాలలు నడుస్తున్న రాష్ట్రంలో.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన ఒక సాధారణ నిరుపేద విద్యార్థి ఇంజనీరింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరచగలడా? కార్పొరేట్ కళాశాలల్లో చదివిన వారికే ప్రతిభ ఆధారిత స్కాలర్‌షిప్పుల ద్వారా ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది. 

అర్హత కోర్సులో ప్రభుత్వ కళాశాలల్లో చదివిన వారికే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పరిమితం చేస్తే.. పోటీ ప్రపంచంలో కష్టనష్టాలకోర్చి గ్రామీణ ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్ ముగించినవారి పరిస్థితి ఏంటి? 

ఇప్పటివరకు చెల్లిస్తున్న రూ. 31 వేలు మాత్రమే చెల్లిస్తామని, మిగిలినది విద్యార్థులే మోయాలని చెబితే.. లక్షా 25 వేలు ఫీజుగా ఉండే ఇంజినీరింగ్ కళాశాలలో రూ. లక్షలోపు ఆదాయం ఉన్న విద్యార్థి చేరగలడా? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం గానీ, నివేదిక ఇవ్వబోయే కమిటీ గానీ జవాబు ఇవ్వాల్సి ఉంటుంది.

కమిటీ కూర్పు భలే..! 
నిపుణుల కమిటీలో 9 మంది సభ్యులు ఉన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు దీనికి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. రాజీవ్ యువకిరణాల బాధ్యతలు చూస్తున్న రీక్యాప్ చైర్మన్ కె.సి.రెడ్డి దీనికి ప్రత్యేక ఆహ్వానితులు కాగా సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఉన్నత, సాంకేతిక విద్య ముఖ్య కార్యదర్శి ఎం.జి.గోపాల్, ఆర్థిక శాఖ కార్యదర్శి డి.సాంబశివరావు, ఉస్మానియా మాజీ వీసీలు ప్రొఫెసర్ వి.రామకిష్టయ్య, ప్రొఫెసర్ ఎం.డి.సులేమాన్ సిద్దిఖీ, ఐఐటీ-హైదరాబాద్ డెరైక్టర్ యూబీ దేశాయ్, జేఎన్టీయూ-కాకినాడ వీసీ ప్రొఫెసర్ తులసీదాస్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ శనివారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది. కమిటీ కూర్పును నిశితంగా పరిశీలిస్తే... పాలనలో భాగంగా పనిచేస్తున్న వారే ఎక్కువమంది ఉన్నారు. ప్రభుత్వ ఆలోచనను కమిటీ ముందు పెట్టే బాధ్యతను కె.సి.రెడ్డి తీసుకుంటారని, ఆర్థిక భారానికి ప్రత్యామ్నాయ మార్గాలను ముగ్గురు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు అన్వేషిస్తారని, ఇక కళాశాలలను కట్టడి చేసేందుకు వర్సిటీల్లో ఉప కులపతులుగా పనిచేసిన వారు తగిన సూచనలు చేస్తార ని కళాశాలల యాజమాన్య సంఘాల ప్రతినిధి ఒకరు ‘న్యూస్‌లైన్’తో విశ్లేషించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!