YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 3 August 2012

సామాన్య జనం కట్టే పన్ను సొమ్ము తెగతినే ఆధునిక కులీనవర్గం దర్జాగా ....

చేసిన పాపం చెప్తే పోతుందని కొందరు కరుణార్ద్ర హృదయులు అంటారు. అయితే, ‘చేసిన పాపం కట్టి కుడుపుతుం’దని లోకరీతి తెలిసిన అనుభవజ్ఞులు అంటారు. ఐఏఎస్ అధికారిణి చందనా ఖాన్ విషయంలో అనుభవజ్ఞుల మాటే నిజమయినట్లుంది. ప్రభుత్వ పాఠశాలల్లో టాయ్‌లెట్ల పారిశుద్ధ్య బాధ్యత(?) ఆయా పాఠశాలల విద్యార్థులే చేపట్టాలని చందన దయచేయించిన అనుచిత సూచనను విద్యార్థులూ, ఉపాధ్యాయులూ, మేధావులూ ఏకకంఠంతో తిరస్కరించారు. మన రాష్ట్రంలో అస్తినాస్తి విచికిత్సా హేతువుగా పరిణమించి, అసలు ఉందాలేదా అనిపిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూడా తెలివిలోకి వచ్చే స్థాయిలో ఈ విమర్శ చెలరేగింది. ఫలితంగా, చందనను ప్రాథమిక విద్యాశాఖ నుంచి తీసేసి, పర్యాటక శాఖకు బదిలీ చెయ్యకతప్పలేదు మన పాలకులకు. 

మూడు రోజుల కిందట - జులై 31తేదీన- చందనా ఖాన్ ఒక ఉన్నత స్థాయి సమావేశంలో -ప్రాథమిక విద్య, సర్వశిక్షా అభియాన్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి హోదాలో - గంభీరోపన్యాసం చేస్తూ పైన చెప్పిన అనుచిత సలహా దానం చేశారు. తాగు నీటి భద్రత- పారిశుధ్యాల గురించి ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ, యూనిసెఫ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాన వక్తగా ప్రసంగిస్తూ ఆమె ఈ సలహా ఇచ్చారు. అంతేకాదు- తన సలహాకు ఊతంగా -సాబర్మతీ ఆశ్రమంలో గాంధీజీ అనుసరించిన- ఓ మహోన్నత ఆదర్శాన్ని ఊతంగా తెచ్చుకున్నారామె. ఈ ఐఏఎస్ అధికారిణికి సందర్భశుద్ధి అనే పదార్థంతో బొత్తిగా పరిచయంలేదని ఆమె మాటలను బట్టి తేలిపోయింది. ఎప్పుడో ఏడెనిమిది దశాబ్దాల కిందట- ఆనాడు రాజ్యమేలుతున్న బ్రిటిష్ మహాసామ్రాజ్యానికి సవాలుచేస్తూ గాంధీజీ నిర్వహించిన స్వచ్ఛంద సంస్థ సాబర్మతీ ఆశ్రమం.పభుత్వ సహకారం, నిధుల కేటాయింపులు, సంక్షేమ రాజ్యంగా అందించాల్సిన సహాయంలాంటి బాదరబందీలేవీ ఆనాటి విదేశీ ప్రభుత్వానికి లేవు. కానీ, స్వతంత్ర భారత దేశంలో, భావి పౌరుల కోసం ఉద్దేశించిన పాఠశాలల విషయంలో ప్రభుత్వానికి స్పష్టమయిన కర్తవ్యాలు కొన్ని ఉన్నాయని ఐఏఎస్ అధికారిణి చందనా ఖాన్‌కు తెలియవా? ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ సౌకర్యవంతమయిన తరగతి గదులతో పాటు, టాయ్‌లెట్లలాంటి కనీస సౌకర్యాలు కొన్ని కల్పించి తీరాలి. అది రాజ్యం విధి. అలా చెయ్యకపోవడం బాధ్యత నుంచి పారిపోవడమే అవుతుంది. అలాంటి పని ఎవరైనా చేస్తే జనం సహించరు! చైతన్యవంతమయిన మీడియా అలాంటి ఉదంతాలను వెలుగులోకి తీసుకు వస్తుంది. తద్వారా తన ధర్మం నెరవేరుస్తుంది. చందనా ఖాన్ బాధ్యతా రాహిత్యాన్ని అందుకే ఎండగట్టవలసి వచ్చింది.

జులై 31 నాటి ప్రసంగంలో చందనా ఖాన్ ఓ విడ్డూరమయిన వాదన చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులచేత వారివారి టాయ్‌లెట్లు శుభ్రం చేయించి, వారికి శ్రమ పట్ల గౌరవాన్ని -డిగ్నిటీ ఆఫ్ లేబర్‌ను- నేర్పించాలన్నారామె. ‘కన్యాశుల్కం’ నాటకంలో గిరీశం చెప్పిన డిగ్నిటీ ఆఫ్ లేబర్ ప్రవచనంలాగే ఉంది ఇది కూడా. విద్యార్థులకు శ్రమ పట్లా, శ్రమజీవుల పట్లా గౌరవాదరాలు కలిగించవలసిన బాధ్యత ఉపాధ్యాయులకు ఉన్న మాట తిరుగులేని వాస్తవం. కానీ ఇదా అందుకు మార్గం? ఎవరో ఉపాధ్యాయిని అడిగినట్లుగా ఈ ఐఏఎస్ అధికారిణి తన పిల్లలకు ఇదే పద్ధతిలో శ్రమ పట్ల గౌరవాన్ని బోధిస్తారా? లేక, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే ఇలాంటి బోధన ప్రణాళిక ప్రత్యేకమా?

అసలు ప్రభుత్వ పాఠశాలలను మూసేయకుండా నడిపించడమే మహాభాగ్యమనీ, వాటిల్లో టాయ్‌లెట్లవంటి కనీస సౌకర్యాల గురించిన డిమాండ్లు అర్థరహితమనీ మన ఉన్నతాధికారులు భావిస్తున్నారనిపిస్తుంది. సామాన్య జనం కట్టే పన్ను సొమ్ము తెగతినే ఈ ఆధునిక కులీనవర్గం దర్జాగా జీవిస్తున్నదీ, ‘పాష్ లైఫ్ స్టైల్’ గడపగలుగుతున్నదీ కూడా! తెగబలిసిన పందికొక్కులకు ఇంటియజమాని కష్టమూ తెలియదు- అతగాడికి రవ్వంతయినా సౌకర్యం కల్పిద్దామన్న స్పృహా ఉండదు. మన ఉన్నతాధికారులు ఈ పందికొక్కులకు భిన్నమయిన వారు కాదు! అలాంటివారిని, ప్రాథమిక విద్యాశాఖ లాంటి కీలకమయిన శాఖల్లో కొనసాగనియ్యడం ఏమాత్రం క్షేమం కాదు. అంచేత, చందనా ఖాన్‌ను ఆ శాఖ నుంచి బదిలీ చేసి, ప్రభుత్వం కనీస స్పృహ ప్రదర్శించినందుకు సంతోషిద్దాం. 

అయితే, అసలు సమస్య అదికాదు. చందనా ఖాన్ చేసింది పెద్ద నేరమేం కాదని మన ప్రభువులు భావించినట్లుంది. అందుకే బదిలీతో సరిపెట్టారు. ఆమె ప్రసంగం మన ఉన్నతాధికార కులీనవర్గం స్వభావాన్ని పట్టిస్తోందన్న వాస్తవం ఇప్పటికయినా గ్రహించడం అవసరం. సంక్షేమ రాజ్య భావనకు ఈ స్వభావం ఎంతమాత్రం సరిపోదని గుర్తించడం అత్యవసరం. పాలనా వ్యవస్థ మూలుగుల్లో చేరిపోయిన కులీన వర్గ స్వభావం ప్రక్షాళనకు వెనువెంటనే పూనుకోవలసి ఉందని అర్థం చేసుకోవడం తక్షణావసరం!

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!