YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 31 July 2012

మనందరి హృదయాల్లో ఉన్న నేత వైఎస్సార్.

- యువజన కాంగ్రెస్ వేదికపై కేవీపీ కన్నీటి పర్యంతం
- మనందరి హృదయాల్లో ఉన్న వైఎస్ బొమ్మ ఇక్కడెక్కడా కనిపించడంలేదు
- ఇది దురదృష్టకరం.. కార్యకర్తలంతా బాధపడుతున్నారు
- భావోద్వేగంతో ప్రసంగించిన కేవీపీ
- బిత్తరపోయిన సీఎం.. తలదించుకున్న మంత్రులు
- కన్నీటిని ఆపుకోలేకపోయిన రఘువీరారెడ్డి
- వైఎస్ అమర్ రహే అనే నినాదాలతో దద్దరిల్లిన సభ
- వైఎస్ ముద్రను చెరిపేయాలన్న మంత్రులపై సుధాకర్‌బాబు ధ్వజం
- ఆ మంత్రులే 2014లో వేరే పార్టీలోకివెళ్తామంటున్నారు
- వారి మాటలు సెల్ ఫోన్లో రికార్డయ్యాయి.. వాటిని సీఎం వెంటనే బయటపెట్టాలి 


హైదరాబాద్, న్యూస్‌లైన్: మంగళవారం సాయంత్రం 6.30 గంటలు. హైదరాబాద్ గాంధీభవన్‌లోని ప్రకాశం హాలు. కొత్తగా ఎన్నికైన యువజన కాంగ్రెస్ రాష్ట్ర నేతల ప్రమాణ స్వీకార కార్యక్రమం. వందలాది కార్యకర్తలతో హాలంతా సందడిగా ఉంది. కార్యక్రమానికి హాజరైన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ముఖ్య నేతలు కార్యకర్తల సందడిని ఆస్వాదిస్తున్నారు. ఆ సమయంలో వేదికపై మాట్లాడుతున్న వక్తలంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి వల్లే సామాన్యులమైన తమకు ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్ పదవులు లభించాయని కొనియాడుతున్నారు. ఒకరిద్దరు తప్ప అందరూ వైఎస్ వారి హృదయాల్లో ఏ విధంగా ముద్ర వేసిందీ మననం చేసుకుంటున్నారు. సభలో వైఎస్ పేరు ప్రస్తావనకొచ్చినప్పుడల్లా కార్యకర్తలంతా చప్పట్లతో అభిమానాన్ని చాటుకుంటున్నారు. 

దీనినంతా వేదికపైనున్న పెద్దలు గమనిస్తూనే ఉన్నారు. వారితోపాటే ఉన్న వైఎస్ ఆప్తమిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు వేదికపైన, చుట్టుపక్కల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎక్కడా వైఎస్ బొమ్మ లేకపోవడాన్ని గమనించారు. ఆవేదనకు గురయ్యారు. ఆయన మాట్లాడే సమయం రాగానే భావోద్వేగానికి గురై.. ‘‘కాంగ్రెస్‌లో యువతను ప్రోత్సహించిన వ్యక్తి రాజీవ్‌గాంధీ అయితే రాష్ర్టంలో యువతను ప్రోత్సహించిన వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి. మనందరి హృదయాల్లో ఉన్న వైఎస్సార్ బొమ్మ ఈవేళ దురదృష్టంకొద్దీ ఈ హాలులో, ఈ ప్రాంగణంలో లేదు. ఇక్కడున్న కార్యకర్తలందరినీ ఇది బాధిస్తోంది’’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో సభలో ఒక్కసారిగా అలజడి నెలకొంది. 

ఈ మాటలు వింటూనే ముఖ్యమంత్రి బిత్తరపోయారు. మంత్రులు తలలు దించుకున్నారు. అంతసేపూ సభలో కార్యకర్తలా కూర్చొని ఉల్లాసంగా నేతల ప్రసంగాల్ని వింటున్న మంత్రి రఘువీరారెడ్డి కూడా కంట తడిపెట్టుకుని తలదించుకున్నారు. అదే సమయంలో హాలులోని కార్యకర్తలంతా ‘‘వైఎస్ అమర్ రహే...’’ అంటూ చేసిన నినాదాలతో ఆ ప్రాంగణమంతా మారుమోగిపోయింది. వెంటనే తేరుకున్న కేవీపీ.. ‘‘నేనెవరినీ తప్పుపట్టాలని అనలేదు. మనందరి హృదయాల్లో ఉన్న నేత వైఎస్సార్. ఇదే గాంధీభవన్‌లో వైఎస్ చివరిసారిగా మాట్లాడుతూ రాహుల్‌గాంధీని ప్రధానిగా చూడటమే ఆయన జీవిత లక్ష్యమని చెప్పారు. 41 ఎంపీ సీట్లను కేంద్రానికి అందిస్తామని కూడా చెప్పారు. సోనియాగాంధీ నాయకత్వంలో రాష్ట్రాన్ని వైఎస్ ఎంత ప్రగతి బాటలో నడిపారో మనందరికీ తెలుసు. అలాంటి వ్యక్తికి మనందరం నివాళులు అర్పిద్దాం’’ అంటూ ప్రసంగాన్ని ముగించారు. 

ఆ వెంటనే మైకందుకున్న రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు.. ‘‘కాంగ్రెస్‌లో వైఎస్ ముద్రను చెరిపేద్దామని ప్రతిపాదించిన మంత్రుల కమిటీలోని సభ్యులే కేబినెట్ చాటున సెల్‌ఫోన్లలో మాట్లాడుతూ 2014 నాటికి వేరే పార్టీలోకి వెళ్లిపోతామని చెబుతున్నారో లేదో ముఖ్యమంత్రి చెప్పాలి. కేబినెట్ మంత్రులే నాటకాలాడుతున్నారు తప్ప మాలాంటి కార్యకర్తలు కాదు. వాళ్ల మాటలన్నీ సెల్‌పోన్లలో రికార్డయ్యాయి. వాటిని ఇప్పుడైనా సీఎం బయటపెట్టాలని కోరుతున్నా’’ అంటూ ఆవేశంగా మాట్లాడారు. అక్కడున్న కార్యకర్తలంతా చప్పట్లు, నినాదాలతో మద్దతు ప్రకటించారు. దీంతో సీఎం, మంత్రులు మరింత ఇరకాటంలో పడ్డారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!