ఏడుపుగొట్టు ప్రవక్తలూ, భవిష్యవాణులూ ఇటీవల బహిరంగంగా వాపోవడం ఎక్కువైపోయింది. వార్తలకు, వినోదానికి మధ్య తేడాయే లేకుండా పోయిందని లేదా అతి వేగంగా అంతరించిపోతోందని వారి బాధ. వారి వగపుకు కారణం వారిలోని గందరగోళమే తప్ప మరేమీ కాదు. వార్తలంటే రాజకీయాలకు పర్యాయ పదం కాదు. మనకు ఆసక్తిని కలిగించే ఏ అంశానికి సంబంధించిన కొత్త సమాచారమైనా వార్తే. నిరుత్సాహకరమైన రంకెల రాజకీయాల కంటే ఫ్యాషన్‌ల నుంచి అభూత కల్పనల వరకు ఆనందదాయకమైన ప్రతి అంశంపైనా ప్రజలు ఆసక్తిని చూపుతున్నారనేది వాస్తవం. అలా అని రాజకీయ కథనాలకు చోటు లేకుండానూ పోలేదు. అసంఖ్యాకమైన ఆసక్తికరమైన అంశాలను జోడించే వంతెనల్లాగా వాటి స్థానం వాటికి ఉంది. ఎందుకంటే స్వాభావికంగానే రాజకీయాలు వినోదాన్ని పంచేవి. కాకపోతే మనం చేయాల్సిందల్లా కాస్త ఆగి, ఆలోచించడమే. ఒక్కోసారి ప్రత్యేక వార్తకూ, వ్యంగ్యానికి మధ్య విభజన రేఖ చాలా సన్నగా ఉంటుంది.
ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఓ కథనం ప్రచారంలోకి వచ్చింది. కాంగ్రెస్ తన తాజా బద్ధ శత్రువు జగన్‌మోహన్‌రెడ్డిని తిరిగి తమ పార్టీలోకి తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆ కథనం సారాంశం. కాంగ్రెస్ కాళ్ల దగ్గర పడి ఉండకుండా దూరంగా పోయిన జగన్, వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు. ఈ కథనం రాస్తుండే సరికి ఆయన జైలులో ఉన్నారు. సీబీఐ ఆయనపై తనకు చేతనైన అన్ని రకాల ఆర్థిక నేరాలను మోపింది. ఆ జగన్‌కే ముఖ్యమంత్రి పదవిని కట్టబెడతామని వాగ్దానం చేసి కాంగ్రెస్ తిరిగి తమ పార్టీలోకి తేవాలని ప్రయత్నిస్తోందని ఆ ప్రత్యేక కథనం చెబుతోంది.
ఎప్పటికో ఒకప్పటికి ఆ కథనం నిజమవుతుందనే అనుకుందాం. అప్పుడు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు ఏం చెబుతుంది? ఇలా చెప్పాల్సిందేగా? ‘‘చూడండి! ఈయన తండ్రి కోటాను కోట్ల డాలర్లు, పౌండ్లు, యూరోలు పోగేసుకున్నారనే ఆరోపణతో మేం ఇతన్ని జైలుకు పంపాం. జగన్ మాకు అప్పుడు పనికి రాకుండా పోయినా ఇప్పుడు తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చేశారు. కాబట్టి ఆ ఆరోపణలన్నీ ఉత్తుత్తివేనని, పూర్తిగా అభూతకల్పనలేనని ఇప్పుడు మేం హామీ ఇస్తున్నాం!’’ సీబీఐ పట్టుబట్టడంతో జగన్‌కు చట్టబద్ధంగా ఉన్న బెయిల్ హక్కును నిరాకరించిన పట్టువిడుపుల్లేని న్యాయమూర్తికి అది ఏం చెబుతుంది? ‘‘న్యాయ ప్రభువులు మన్నించాలి, జగన్ కార్యాలయాలపై జరిపిన దాడులన్నీ ఉత్త ఆటపట్టింపు చర్యలే. పిల్లలు కౌమారం దాటే క్లిష్టమైన ప్రాయంలో చిన్నచిన్న మొట్టికాయలు వేయడం ఎలా అవసరమో ఇదీ అంతే. ఇక కోర్టులో జగన్‌కు వ్యతిరేకంగా బుర్రలు బద్దలు కొట్టుకున్న న్యాయవాదులకు సంబంధించి... వాళ్లకు ముట్టాల్సిందేదో కవర్లలో అందుతుందని తమరు ఎరగనిది కాదు. మేమేదో ఇంత క్లుప్తంగా ఉప్పందిస్తే, వాళ్లు దాన్ని పూర్తిస్థాయి కేసుగా మార్చారు. అహ్హ హ్హ హ్హ హ!హ’’
ఎవరో కొందరు రాజకీయవేత్తలు ఒక పాత్రికేయుని చెవి కొరికారనేది ముఖ్యం కాదు. ఎలాంటి ప్రశ్నలు అడగకుండానే ఆ కథనం చక్కర్లు కొడుతుండటమే అసలు సిసలైన జోక్. కొట్టవచ్చినట్టుగా కనిపిస్తున్న ప్రశ్ననే మొదటగా చూద్దాం. అలాంటి ఒప్పందానికి అసలు సమర్థన అంటూ ఉంటుందా? ఇరుపక్షాల నుంచి తీవ్రాతి తీవ్రమైన వాద, ప్రతివాదాలను విన్న ఓటర్లు దాన్ని ఆమోదిస్తారా? జగన్ తల్లి విజయమ్మ ఉక్కుముక్కలాంటి దృఢమైన వ్యక్తిత్వం గలిగిన వ్యక్తి. కాంగ్రెస్, తన కుమారుణ్ణి జైలు పాలు చేయాడాన్ని, శిక్షించడాన్ని కళ్లారా చూసిన ఆమె దీనిపై ఏం మాట్లాడగలుగుతారు? తన తండ్రి విషాదకరమైన అకాలమరణం తదుపరి జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు.
కాంగ్రెస్ అప్పుడే ఆయనకు ఆ పదవిని ఇచ్చి ఉంటే తీసుకునేవారే. కానీ అందుకు అప్పుడు ససేమిరా అంది. జగన్‌కు బదులుగా రాజకీయ పరిణతి ఏమాత్రం లేదని చూస్తేనే తెలిసిపోయే ఎవరికీ తెలియని కిరణ్‌కుమార్‌రెడ్డికి ఆ పదవిని కట్టబెట్టింది. పైగా జగన్‌ను వ్యక్తిగతంగానూ, రాజకీయంగానూ కూడా నామరూపాల్లేకుండా చేయాలని ప్రయత్నించింది. తద్వారా అది తన అవకాశాలను తానే చేజేతులారా కాలదన్నుకుంది. అన్ని విషయాల్లోనూ దారుణంగా విఫలమైంది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఇక మిగిలింది గతం. కాగా, జగన్‌కు ఉన్నది భవిష్యత్తు. జగన్ ఏరికోరి గతించిపోయిన గతాన్ని ఎందుకు ఎంచుకోవాలి?
భారత రాజకీయాలు అసాధారణమైన వినోదం దిశగా పయనిస్తుంటే, జాతీయ ప్రతిష్టను ఇనుమడింపజేయగల భారత క్రీడలు అథఃపాతాళానికి దిగజారుతున్నాయి. ఒలింపిక్స్‌లో ఓ కాంస్య పతకాన్ని సాధిస్తే దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకోవడాన్ని, లేదా అరుదుగా ఓ రజత పతకం లభిస్తే ఆకాశానికెత్తేయడాన్ని చూస్తుంటే వళ్లు జలదరిస్తుంది. భారతదేశపు క్రీడా దారిద్య్రం పూర్తిగా అర్థం చేసుకోదగినదే. భారతీయుల మేథస్సులన్నీ ఆర్థికంగా ఉన్నత స్థానాలకు ఎగబాకాలన్న ఆశలపైనే కేంద్రీకరించి ఉన్నాయి. అసాధారణమైన శారీరక ప్రతిభాపాటవాలపైన దృష్టే లేదు. ఊగిసలాడే శక్తిసామర్థ్యాలతోనే అయినా మనం పోటీ పడే ఒకే ఒక్క క్రీడ క్రికెట్. క్రికెట్ నుంచి డబ్బును దూరం చేసి చూడండి. ఆ గాలి బుడగ సైతం బద్దలయిపోక తప్పదు.
ఇతర క్రీడలకు కూడా ఏదో ఓ ప్రతిఫలం లేకపోలేదు, కానీ శారీరకంగా అనుభవించాల్సిన అసౌకర్యానికి సంబంధించిన వ్యయాలు చాలా ఎక్కువ. తల్లి చేతివంట హాయిగా తిని పెరిగిన మన యువతకు ఆ అసౌకర్యం గురించిన ఆలోచనే ఇబ్బంది కలిగిస్తుంది. కదలగలుగుతున్నామంటే అదే చాలు. లావుగా ఉన్నా సన్నగా ఉన్నా డ్యాన్స్ చేయగలం. శాస్త్రీయ నాట్యానికి సైతం నడుము కొలత ముఖ్యం కాదు. దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్ కు వర్షం వల్ల అంతరాయమేర్పడ్డంతో ఛానళ్లను అటూ ఇటూ మార్చసాగాను. అలా ట్రాంపోలైన్‌పై చైనా వ్యాయామ క్రీడాకారుడు డాంగ్ డాంగ్ అద్భుత ప్రతిభను చూడగలిగాను. డాంగ్ డాంగ్ కనబరచిన అద్భుత ప్రతిభాపాటవాలు కలిగిన అరడజను మంది భారతీయులు తయారుకావాలంటే యుగాలు గడవాల్సిందే.
భారతీయులందరిలాగే నేను కూడా మనం ఒలింపిక్ మెడల్స్‌ను గెలుచుకోవడమనే ఆలోచనను ప్రేమిస్తాను. అలా అని మనం బ్యాడ్మింటన్‌లోనో లేదా ఆర్చరీలోనో ఓడిపోయామని చింతించను. భాగ్యదేవత కరుణించి మనకో బఠానీ గింజను ప్రసాదించినప్పుడల్లా సంబరపడిపోవడాన్ని చూస్తుంటేనే కడుపులో దేవేసినట్టవుతుంది. నమ్మశక్యం కానంతటి కష్టమైన, కళ్లు మిరుమిట్లుగొలిపే జిమ్నాస్టిక్ కళను ప్రదర్శించిన జపనీస్ జిమ్నాస్ట్ కోహీ ఊచిముర కాంస్య పతకాన్ని సాధించి, మూడో స్థానమే దక్కిందని బావురుమన్నాడు. అదేగాని అతడు ఐదడుగుల దూరంలోని తేలికపాటి లక్ష్యాన్ని ఛేదించి కాంస్యాన్ని సాధించిన భారతీయుడై ఉంటే... ఆ దేశోద్ధారకుని రాకకు గౌరవార్థంగా కార్పొరేట్ సంస్థలు మొదటి పేజీ పత్రికా ప్రకటనలను గుప్పించేవి. భారతీయులు తమను తాము గొప్పగా అభినందించుకున్నట్టుగా మరెవరూ అభినందించరు. అదో వ్యాధి.
ఒక్కసారి ఒలింపిక్స్ వైపు దృష్టిసారించి రాజకీయాల కోసం అన్వేషిస్తాను. రాజకీయాలపైకి ఒక్కసారి దృష్టిసారించి, మళ్లీ ఒలింపిక్స్‌కు మళ్లుతాను.
No comments:
Post a Comment