ప్రపంచంలోనే అతి పెద్ద నెట్ వర్క్ ఉన్న భారతీయ రైల్వే వ్యవస్థలో భద్రత ఒట్టిమాటేనని తేలిపోయింది. ప్రయాణికుల భద్రత కోసం బడ్జెట్లలో వేలకోట్లు కేటాయించిన అదంతా బూడిదలో పోసిన పన్నీరవుతోంది. ప్రతి సంవత్సరం జరిగే రైలు ప్రమాదాల్లో వందల మంది అమాయక ప్రయాణికులు బలవుతున్నారు. పట్టాలు తప్పడం, రైల్వేగేట్‌ల వద్ద ప్రమాదాలతో పాటు అగ్నిప్రమాదాలు ప్రయాణికులను కలవరపెడుతున్నాయి. ట్రైన్ ఎక్కినవాళ్లు సురక్షితంగా గమ్య స్థానానికి చేరుతారో చేరరో చెప్పలేని పరిస్థితి. ఎక్కడ ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని దుస్ధితి. రైల్లో కూర్చున్న వాళ్లు కూర్చున్నట్లే తుది శ్వాస విడిస్తే ఆ కుటుంబానికి దిక్కెవరు. గతంలో జరిగిన గౌతమి ఎక్స్ ప్రెస్ ఘటన మరవక ముందే నెల్లూరు సమీపంలో ఈరోజు తెల్లవారుజామున మరో దుర్ఘటన చోటుచేసుకుంది. న్యూఢిల్లీ నుంచి చెన్నై వెళుతున్న తమిళనాడు ఎక్స్ ప్రెస్ ఎస్-11 బోగీలో జరిగిన అగ్రి ప్రమాదంలో సుమారు 50 మంది ప్రయాణికులు చనిపోయారు. కాలిన గాయాలతో మరో 20 మంది వరకు నెల్లూరులోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు దక్షిణ మధ్య రైల్వే 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు, గాయపడ్డ వారికి 25 వేల రూపాయల పరిహారం చెల్లించనుంది. శనివారం రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఢిల్లీ నుంచి బయల్దేరిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్.... సోమవారం ఉదయం ఏడు గంటలకు చెన్నై చేరాలి. ఉదయం నాలుగున్నర ప్రాంతంలో ఈ రైలు నెల్లూరు స్టేషన్ దాటింది. అప్పుడే మంటలు... విజయమహల్ గేట్ దగ్గర ప్రయాణికులు చైన్ లాగి ట్రెయిన్ ఆపారు. కాని అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని జరిగిన సంఘటన తెలుసుకునే లోపే... పొగ, మంటలు వారిని కబళించేశాయి. మరో రెండు గంటల్లో గమ్యస్థానం చేరుతామనుకున్న ప్రయాణికులు ఈ దుర్ఘటనతో కనీసం గుర్తించడానికి వీల్లేని విధంగా కాలిపోయారు. పేర్లు, ఊర్లు అన్ని తెలిసినా... ఎవరో, ఏమిటో గుర్తించలేని విషాదస్థితి. తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ఎస్-11 బోగి మంటల్లో మాడి మసైంది. అప్రమత్తంగా ఉన్న కొద్ది మంది ప్రయాణికులు ప్రాణాలు దక్కించుకున్నా...మంటలు, పొగకు ఊపిరాడక ఎక్కడి వారు అక్కడే ప్రాణాలు వదిలారు. S-11 బోగి శవాల గుట్టను తలపించింది. తమిళనాడు ఎక్స్ ప్రెస్ రైలుకు మన రాష్ట్రంలో రెండే రెండు హాల్టులు. వరంగల్, విజయవాడలో మాత్రమే ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఆగుతుంది. రాత్రి వెళ్లి చెన్నైలో పనులు చక్కబెట్టుకొని తిరిగి సాయంత్రానికి విజయవాడ చేరుకునే ఎక్కువ మంది వ్యాపారులు, ఉద్యోగులు తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తారు. గత రాత్రి ఈ రైలులో విజయవాడలో 28మంది, వరంగల్ లో ఏడుగురు ఎక్కారు. కాగా ఇప్పటివరకూ మృతుల సంఖ్యను రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించలేదు. రైళ్లలో ఫైర్ సేప్టీ విధానాలు సరిగా అమలు చేయకపోవడం... అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే వస్తువులను తీసుకురాకుండా అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారనే చెప్పాలి. ఫైర్ డిటక్షన్ విధానాన్ని 500 కోచ్‌లలో అమలు చేయాలని బడ్జెట్‌లో నిధులు కేటాయించినా అది ఇప్పటి వరకు అమలు కాలేదు. ఒక్క కోచ్‌లో ఫైర్ డిటెక్షన్ ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు కేవలం రెండు లక్షల రూపాయలే. ఒక అధ్యయనం ప్రకారం.. 2009 మార్చి- సెప్టెంబర్ మధ్యలో 14 రైళ్లలో అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇందులో 6 ఎలక్ట్రికల్ షాట్ సర్క్యూట్స్ వల్లే జరిగాయంటే అధికారుల నిర్లక్ష్యం ఏమేర ఉందో తెలుస్తోంది. రైళ్లలో అగ్నిప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. జూన్ 6, 1990లో గొల్లగూడలో జరిగిన రైలు అగ్నిప్రమాదంలో 35 మంది సజీవ దహనమయ్యారు. తర్వాత అదే సంవత్సరం అక్టోబర్ 10న చర్లపల్లిలో జరిగిన మరో రైలు అగ్నిప్రమాదంలో 40 మంది కాలి బూడిదయ్యారు. ఆగస్ట్ 5, 2008లో కేసముద్రం వద్ద గౌతమీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగి 32 మంది మృతిచెందారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోనూ పెను విషాదమే జరిగింది. రైల్వే బడ్జెట్‌కు నిధులు భారీగా కేటాయిస్తున్నా.. ప్రమాదాలను నివారించడంలో రైల్వే శాఖ విఫలమవుతోందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మొన్న గౌతమి ఎక్స్‌ప్రెస్.. నేడు తమిళనాడు ఎక్స్‌ప్రెస్. రైలు ఏదైనా ప్రమాదాలు మాత్రం సర్వ సాధారణం అయిపోతున్నాయి. రైలు ప్రమాదం జరిగినప్పుడు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకోవడం.... కంటి తుడుపు చర్యగా పరిహారం ప్రకటించడం రివాజుగా మారింది. ఎక్స్‌గ్రేషియా అయితే ఇవ్వగలరు కానీ చనిపోయిన కుటుంబ సభ్యులను మళ్లీ తీసుకురాగలరా.? బాధిత కుటుంబానికి ఏం సమాధానం చెబుతారు.? చైనాతో పోటీపడుతున్నామని గొప్పలు చెప్పుకునే పాలకులు.. అక్కడ ఉన్న రైల్వే భద్రతను ఎందుకు తెలుసుకోరు? షార్ట్ సర్కూట్‌లు పట్టాలు తప్పడం ఇవన్నీ మానవ తప్పిదాలు అనడం కాదనలేని నిజాలు. నిధులున్నా నిర్వహణా లోపం, అధికారుల అలసత్వంతో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాలలో 42 శాతం రైల్వే సిబ్బంది వైఫల్యం వల్లనే సంభవిస్తున్నాయని రైల్వేల భద్రతపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి గత ఫిబ్రవరిలో నివేదిక సమర్పించిన అనిల్ కకోద్కర్ కమిటీ నిగ్గు తేల్చింది. ఇప్పటికైనా పాలకులు రైల్వే భద్రతపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. |
Monday, 30 July 2012
మృత్యు శకటాలు...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment