YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 31 July 2012

చీకటి రాజ్యం!

విద్యుత్ వినియోగంలో గత కొంతకాలంగా అమలవుతున్న అంతులేని నిర్లక్ష్యం, హద్దుమీరిన అరాచకం ప్రపంచంలోనే మన దేశం పరువును బజారుపాలు చేసింది. వరసబెట్టి రెండురోజులపాటు దేశ రాజధాని నగరం ఢిల్లీలోనూ, మరికొన్ని రాష్ట్రాల్లోనూ అంధకారం అలుముకుని మన నేతలు చెబుతున్న అభివృద్ధి అసలు రంగేమిటో లోకానికి వెల్లడించింది. సోమవారం ఎనిమిది రాష్ట్రాల్లో 15 గంటలు, మంగళవారం 22 రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో 62 కోట్ల మంది జనం విలవిల్లాడారు. సోమవారం అర్ధరాత్రి దాటాక హఠాత్తుగా ఆగిపోయిన సరఫరా సాయంత్రం వరకూ పునరుద్ధరణే కాలేదు. గండం గడిచిందని అందరూ ఊపిరి పీల్చుకునేలోగానే మరోసారి మళ్లీ విద్యుత్ బ్లాకవుట్ అయింది. ఈసారి ఉత్తరాది రాష్ట్రాలతోపాటు తూర్పు, ఈశాన్య రాష్ట్రాలు కూడా విద్యుత్ సంక్షోభాన్ని చవి చూశాయి. దేశవ్యాప్తంగా 300 ప్రయాణికుల రైళ్లతోపాటు మొత్తం 500 రైళ్లు, మెట్రో సర్వీసులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. విద్యుత్ అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వ, ప్రైవేటు లావాదేవీలన్నీ ఆగిపోయాయి. గొంతు తడుపుకోవడానికి మంచినీళ్లు సైతం దొరకలేదంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్ధమవుతుంది. 

జనరేటర్లున్న కొన్ని ఆస్పత్రులు మినహా చాలా చోట్ల ముఖ్యమైన ఆపరేషన్లు, ఇతర వైద్య సేవలు ఆగిపోయి రోగులు పడరాని పాట్లుపడ్డారు. పశ్చిమబెంగాల్‌లోని సోడెపూర్, సత్‌గ్రామ్‌లలోని ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ గనుల్లో 200 మంది కార్మికులు చిక్కుకుపోయారు. దేశంలోని సగం భూభాగంలో పారిశ్రామి కోత్పత్తి కూడా కుంటుపడింది. అసలు ఒక్కసారిగా ఈ పరిస్థితి ఏర్పడ్డానికి మూల కారణమేమిటన్న అంశంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేయే అయోమయంలో ఉన్నారు. ఏం జరగడంవల్ల ఇంత సంక్షోభం ఏర్పడిందో సంజాయిషీ ఇచ్చినవారే లేకపోగా, ఈ సంక్షోభ పరిస్థితికి గుర్తింపు అన్నట్టు షిండేకు కేంద్ర హోంమంత్రిగా ‘పదోన్నతి’ కూడా లభించింది. అది కూడా చీకట్లోనే!

విద్యుత్ రంగంలో అరాచకం రాజ్యమేలుతున్నదని కొంతకాలంగా నిపుణులు హెచ్చరిస్తూ వస్తున్నారు. అడిగే నాథుడు లేడన్న ధీమాతో కొన్ని రాష్ట్రాలు కేటాయించిన విద్యుత్‌కన్నా అదనంగా తీసుకుంటూ చిత్తం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాయి. ఇలాంటి వారిని నియంత్రించి విద్యుత్ పంపిణీ సక్రమంగా, సాఫీగా జరిగేలా చూడాల్సిన నాయకత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఇలాంటి రాష్ట్రాలపై వేసే జరిమానాలు స్వల్ప మొత్తాల్లో ఉంటున్నాయి గనుక అవి మారుమాట్లాడకుండా చెల్లిస్తూ, మళ్లీ మళ్లీ ఆ పనే చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రాలకు ఇదో అలవాటుగా మారింది. గత మూడు నెలల డేటాయే తీసుకుంటే...యూపీ 3,011 మి.యూ. వాడుకోవాల్సి ఉండగా అది 3,762 మి.యూ. వినియోగించింది. హర్యానా అయితే 1,817 మి.యూ.కు 20,648 మి.యూ., రాజస్థాన్ 1,407 మి.యూ.కు 1,505 మి.యూ. వినియోగించాయి. 

అంటే... యూపీ 5 శాతం అదనంగా, హర్యానా 51 శాతం అదనంగా, రాజస్థాన్ 15 శాతం అదనంగా విద్యుత్‌ను తీసుకున్నాయన్న మాట! వివిధ విద్యుదుత్పాదన కేంద్రాలనుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను స్వీకరించి దాన్ని వివిధ ఫ్రీక్వెన్సీల్లో వేర్వేరు రాష్ట్రాలకు పంపిణీ చేసే ప్రక్రియ ఇలాంటి రాష్ట్రాల వైఖరివల్ల దెబ్బతింటున్నది. గ్రిడ్‌నుంచి సాధారణంగా 49.5 హెర్ట్జ్ నుంచి 50.2 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో పంపిణీ అవుతుండగా సోమవారం నాడు ఇది ఒక్కసారిగా 50.46కు చేరింది. ఉత్తరప్రదేశ్ తనకున్న కేటాయింపులను మించి 900 మెగావాట్లు, హర్యానా 580 మెగావాట్లు, పంజాబ్ 500 మెగావాట్లు ఎక్కువగా తీసుకున్న కారణంగానే ట్రిప్ అయి ఉండొచ్చుననేది ప్రాథమిక అంచనా. కేటాయింపులకు మించి ఏ రాష్ట్రామూ అధికంగా విద్యుత్‌ను వాడుకోకుండా పర్యవేక్షణ చేయాల్సిన జాతీయ ప్రాంతీయ లోడ్ పంపిణీ కేంద్రం (ఎన్‌ఆర్‌ఎల్‌డీసీ) జూలై 10నే వివిధ రాష్ట్రాల అధిక వినియోగంపై హెచ్చరికలు జారీచేసిన మాట వాస్తవమే. అయితే, ఆ ఆదేశాలను పట్టించుకునేదెవరు? 

కర్ణుడి చావుకు వేయి కారణాలన్నట్టు ఈ విద్యుత్ సంక్షోభంలో రాష్ట్రాలతో పాటు కేంద్రానికి కూడా సమాన భాగస్వామ్యం ఉంది. దేశంలో వివిధ వనరుల ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్ ఎంత... దాన్ని ఎవరెవరికి ఎలా పంపిణీ చేయాల్సి ఉంటుందన్న అంచనాలు సరిగాలేకుండా అభివృద్ధి మంత్రం జపించడం ఇందుకు తార్కాణం. ఉదాహరణకు గుర్‌గావ్‌లాంటి ప్రాంతాలను అభివృద్ధి పేరిట పెంచు కుంటూ పోయేముందు అందుకు తగిన స్థాయిలో విద్యుత్‌ను అందజేయగలమా అన్న ప్రశ్న ఎవరిలోనూ తలెత్తలేదు. ఒకవేళ ఈ ‘అభివృద్ధి’కి కావాల్సిన విద్యుత్‌ను ఇప్పుడున్న వనరులద్వారా సమకూర్చలేకపోతే అందుకు ప్రత్యామ్నాయ మార్గా లేమిటని ఆలోచించాలి. అదీ చేయలేదు. అలాగే, కేటాయించిన విద్యుత్‌లోనే సరఫరాను ప్లాన్ చేసుకోవాల్సిన రాష్ట్రాలు క్రమశిక్షణను తప్పుతున్నాయి. మామూలు సమయాల్లో జాతీయ ప్రయోజనాల గురించి గంభీరంగా ఉపన్యాసా లిచ్చే నేతలు తమకు రోజు గడిస్తే చాలు... దేశం ఏమైపోతేనేం అన్నట్టు వ్యవహరిస్తు న్నారు. 

ఈ మొత్తం వ్యవహారం యూపీఏ పనితీరును ప్రతిబింబిస్తోంది. విద్యుత్ రంగంలో పెట్టుబడుల్ని పెంచి, ఉత్పాదనను గణనీయంగా పెంచుతామన్న హామీని అది నెరవేర్చలేకపోయింది. పవన విద్యుత్, సౌరశక్తి, బయోమాస్, ఇథనాల్ వంటి సంప్రదాయేతర ఇంధన వనరుల పెంపుపై దృష్టి సారించడంలో విఫలమైంది. పర్యవసానంగా పంచవర్ష ప్రణాళికల్లో విద్యుత్ ఉత్పాదనపై పెట్టుకుంటున్న లక్ష్యాలన్నీ నీరుగారుతున్నాయి. థర్మల్ విద్యుత్, అణు విద్యుత్ వంటి అంశాల్లో ప్రజల్ని ఒప్పించి, ఏకాభిప్రాయాన్ని సాధించడానికి అవసరమైన పారదర్శకతను ప్రదర్శించలేకపోతోంది. ఇప్పుడొచ్చిన సంక్షోభంతోనైనా యూపీఏ ప్రభుత్వం కళ్లు తెరవాలి. సమస్యను అన్ని కోణాల్లోనూ సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలి.


ఉత్తర, తూర్పు గ్రిడ్‌లు కుప్పకూలినా, దక్షిణాది గ్రిడ్ మాత్రం భద్రంగానే ఉంది. ఎందుకంటే.. దక్షిణాది రాష్ట్రాలు గ్రిడ్ పౌనఃపున్య సమతౌల్యాన్ని కచ్చితంగా పాటిస్తాయి. కాగా, ఇటీవల ఉత్తరాది, తూర్పు, పశ్చిమ గ్రిడ్‌లను అనుసంధానించారు. దీనినే న్యూ (నార్త్, ఈస్ట్, వెస్ట్) గ్రిడ్ అంటారు. న్యూ గ్రిడ్‌తో దక్షిణాది గ్రిడ్‌ను అనుసంధానించే ప్రక్రియ ఆలస్యమవడం కూడా మరో కారణం. విద్యుత్ సరఫరా లైన్ల ఏర్పాటులో ఆలస్యం కారణంగా ఈ అనుసంధాన ప్రక్రియ పూర్తి కాలేదు. అనుసంధానమే జరిగి ఉంటే ఆ రెండు గ్రిడ్‌ల వైఫల్యం ప్రభావంతో దక్షిణాది గ్రిడ్ కూడా కుప్పకూలి ఉండేది. దాని ప్రభావం వల్ల మన రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల్లోనూ చీకట్లు అలముకొని ఉండేవే.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!