YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 5 November 2012

భారీ వర్షంలోనూ చెక్కుచెదరని జనాభిమానం


భారీ వర్షంలోనూ చెక్కుచెదరని జనాభిమానం
జిల్లాలో 14వ రోజు ‘మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర’లో షర్మిలకు బ్రహ్మరథం
పందికుంట, తట్రకల్లు, గంజికుంట, వజ్రకరూరులో హారతులు పట్టిన మహిళలు
షర్మిలకు విజ్ఞాపనపత్రాలు ఇవ్వడానికి పోటీపడిన జనం
మహానేత వైఎస్‌ను విమర్శించిన చంద్రబాబుపై మండిపడ్డ షర్మిల
కిరణ్‌కుమార్‌రెడ్డికి విశ్వసనీయత లే దని ధ్వజం
వజ్రకరూరు బహిరంగసభకు పోటెత్తిన ప్రజానీకం
జగనన్నను ఆశీర్వదించండి.. రాజన్న 
రాజ్యంలో ఆదుకుంటామని షర్మిల భరోసా

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నుంచి న్యూస్‌లైన్ ప్రతినిధి: జనమే జనం.. ఎటు చూసినా జనమే.. పల్లెలకు పల్లెలు కదలివచ్చి కదంతొక్కాయి.. కాంగ్రెస్, టీడీపీ శిబిరాల్లో వణుకు పుట్టించేలా జగన్నినాదాలు చేశాయి. భారీ వర్షంలోనూ పక్కకు కదలకుండా జననేత్రికి నీరాజనాలు పలికాయి. వరుణుడు కన్నెర్ర చేసినా.. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై ప్రలోభ పెట్టినా జనం వెనక్కు తగ్గలేదు.. సరి కదా ఎగిసిన కెరటంలా షర్మిలకు బ్రహ్మరథం పట్టారు. ఇదీ జిల్లాలో 14వ రోజు సోమవారం మహానేత వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు వచ్చిన జనస్పందన. 

ఆదివారం రాత్రి రాగులపాడులో బస చేసిన ఆమె సోమవారం ఉదయం 10.20 గంటలకు పాదయాత్రకు ఉపక్రమించారు. అప్పటికే రాగులపాడులో బస చేసిన ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. భారీ జనసందోహం.. జగన్నినాదాల మధ్య పాదయాత్రను షర్మిల మొదలుపెట్టారు. పందికుంటకు చేరుకునే మార్గమధ్యలో వెంకటాంపల్లి పెద్ద తండా, చిన్నతండా, జరుట్లరాంపురం గ్రామానికి చెందిన లంబాడీలు భారీ ఎత్తున రోడ్డు పక్కన ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసుకుని షర్మిలకు ఘన స్వాగతం పలికారు. 

లంబాడీ మహిళలు సంప్రదాయ నృత్యాలు చేసి, కేరింతలు కొట్టారు. తనను ఆదరించి, అక్కున చేర్చుకున్న లంబాడీలను ఆత్మీయంగా పలకరించిన షర్మిల వారితో మమేకమయ్యారు. అక్కడే రచ్చబండ నిర్వహించారు. జరుట్ల రాంపురం గ్రామానికి చెందిన సోనమ్మ అనే మహిళ మాట్లాడుతూ ‘అమ్మా.. నెల రోజులుగా మాకు కరెంట్ లేదు. గంట కూడా తాగడానికి నీళ్లు ఇవ్వరు. నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లి తాగు నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది’ అంటూ షర్మిలకు వివరించారు. ‘అక్కా.. నాకు వైఎస్ ఇంటిని మంజూరు చేశారు. ఇల్లు కట్టుకుంటుండగానే వైఎస్ మరణించారు. 

ఇప్పుడు ఇంటిని కట్టుకుంటుంటే ఈ ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయడం లేదు’ అంటూ వెంకటాంపల్లి చిన్నతండాకు చెందిన ఓ మహిళ షర్మిల ముందు బోరున విలపించింది. వెంకటాంపల్లి పెద్దతండాకు చెందిన ఓ మహిళ మాట్లాడుతూ ‘అమ్మా.. వైఎస్ ఉన్నప్పుడు మాకు రెండెకరాలు.. మూడెకరాల చొప్పున భూపంపిణీ చేశారు. కానీ ఇప్పుడు 60 సెంట్లు కూడా ఇవ్వడం లేదు. ఎలా బతకాలి’ అంటూ షర్మిలకు వివరించారు. జరుట్ల రాంపురం గ్రామానికి చెందిన మరో మహిళ మాట్లాడుతూ ‘అమ్మా.. వైఎస్ ఉన్నప్పుడు మాకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చేవారు. 

వడ్డీలేని రుణాలు ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఏ ఒక్కరికీ రుణాలు ఇవ్వడం లేదు. ఇలాగైతే ఎలా?’ అంటూ షర్మిలకు విన్నవించారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘అక్కా.. చంద్రబాబు నిద్రపోతుంటే.. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మొద్దునిద్రపోతున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించకుండా ఇద్దరూ కుమ్మక్కై రాజకీయ కుట్రలు చేస్తున్నారు. కొద్ది రోజులు ఓపిక పట్టండి.. రాజన్న రాజ్యం వస్తుంది. జగనన్న సీఎం అవుతారు. వైఎస్ అమలు చేసిన ప్రతి పథకాన్ని అమలు చేస్తారు’ అంటూ వారిలో ఆత్మస్థైర్యం నింపారు. అనంతరం షర్మిలకు లంబాడీ మహిళలు తమ సంప్రదాయ పద్ధతుల్లో సన్మానం చేశారు. కత్తి, డాలును బహూకరించారు.

పోటెత్తిన జనప్రవాహం..
పందికుంట శివారులో ఆ గ్రామ ప్రజలు షర్మిలకు పుష్ప గుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు. వీధుల్లో బంతిపూల వర్షం కురిపించారు. అడుగడుగునా హారతులు పట్టి.. గుమ్మడికాయలతో దిష్టితీసి ఇంటిబిడ్దలా ఆదరించడంతో షర్మిల ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. పందికుంటలో వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించిన ఆమె అక్కడ నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. ప్రతిపక్షంలో చంద్రబాబు వైఫల్యాన్ని వివరిస్తూ షర్మిల చేసిన ప్రసంగానికి జనం నుంచి భారీ స్పందన లభించింది. పందికుంట గ్రామానికి 2008-09లో రూ.2.50 కోట్ల మేర పంటల బీమా పథకం కింద వేరుశనగ రైతులకు పరిహారం వచ్చిందని షర్మిల చెప్పినప్పుడు ‘అమ్మా.. వైఎస్ ఉన్నప్పుడు మాకు న్యాయం జరిగింది. 

కానీ.. ఇప్పుడు వాతావరణ బీమా కింద మేం చెల్లించిన ప్రీమియం మేరకు కూడా నష్టపరిహారం రావడం లేదు’ అంటూ రైతులు ఫిర్యాదు చేశారు. పందికుంట నుంచి తట్రకల్లు దిశగా షర్మిల ముందుకు కదిలారు. తట్రకల్లు శివారులో మధ్యాహ్న భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకున్న ఆమె మధ్యాహ్నం 3.15 గ ంటలకు పాదయాత్రను కొనసాగించారు. తట్రకల్లుకు చేరుకునే క్రమంలోనే ఎంఎన్‌పీ తండాకు చెందిన లంబాడీలు భారీగా కదలి వచ్చి షర్మిలను కలిసి.. పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. 

అనంతరం తట్రకల్లుకు చేరుకున్న ఆమెకు వేలాది మంది ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. తట్రకల్లు బహిరంగ సభలో మాట్లాడారు. అనంతరం గంజికుంటకు బయలుదేరిన షర్మిలకు తట్రకల్లుకు చెందిన కొందరు మహిళలు చీరలు, గాజులు, పసుపుకుంకుమ ఇచ్చి ఇంటిబిడ్డలా ఆదరించారు. అనంతరం గంజికుంట చేరుకున్న ఆమెకు ఆ గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గంజికుంట నుంచి వజ్రకరూరుకు చేరుకునే క్రమంలోనే వరుణుడు ప్రతాపం చూపించాడు. భారీ వర్షంలోనే వేలాది మంది ప్రజల మధ్య షర్మిల వజ్రకరూరుకు చేరుకున్నారు.

వాడీ వేడి ప్రసంగానికి భారీ జనస్పందన..
వరుణుడు భారీ వర్షం కురిపించినా వజ్రకరూరు వీధుల్లో జనం చెక్కుచెదరలేదు. పక్కకు కూడా కదల్లేదు. షర్మిల రాగానే ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. గాంధీ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆమె ఈటెల్లాంటి మాటతో కాంగ్రెస్, టీడీపీలపై విరుచుకుపడ్డారు. ‘తొమ్మిదేళ్లు అధికారం వెలగబెట్టానని.. తొమ్మిదేళ్లు విపక్షంలో ఉన్నానని చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమీ చేయని ఆయన.. ఇప్పుడు వైఎస్ అమలు చేసిన ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి వాటిని అమలు చేస్తానని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు.

వైఎస్ అమలు చేసిన పథకాలను తాను అమలు చేస్తానని చెప్పుకుంటున్న ఈ బాబు మళ్లీ మహానేతనే విమర్శిస్తుండటం విడ్డూరంగా ఉంది’ అని మండిపడ్డారు. అధికారంలో ఉన్నా లేకున్నా మహానేత వైఎస్ ప్రజా సంక్షేమం కోసం పరితపించారని స్పష్టీకరించారు. చంద్రబాబు హయాంలో అనంతపురం జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ భిక్షాటన చేసి ఆ రైతు కుటుంబాలను ఆదుకున్నారని గుర్తుచేశారు. ‘సీఎం కిరణ్ అంటున్నారు.. మాకు అర్జీలు ఇస్తే ఏం ప్రయోజనం ఉండదని. ‘అయ్యా.. మీ మీద విశ్వసనీయత లేకపోవడం వల్ల ప్రజలు మా వద్దకు వచ్చి అర్జీలు ఇస్తున్నారు. జగనన్న సీఎం అయితే వారి సమస్యలు పరిష్కరిస్తారని విశ్వసించడం వల్లే మాకు అర్జీలు ఇస్తున్నారు. అధికారంలో ఉంటే సరిపోదు కిరణ్‌కుమార్‌రెడ్డి గారూ.. చిత్తశుద్ధి కూడా ఉండాలి. చిత్తశుద్ధితో ప్రజల సమస్యలు పరిష్కరించే లక్షణం కూడా ఉండాలి’ అంటూ చురకలంటించారు. 

‘కొన్నాళ్లు ఓపిక పట్టండి.. జగనన్నను ఆశీర్వదించండి.. రాజన్న రాజ్యం వస్తుంది. జగనన్న సీఎం అవుతారు. మీ కష్టాలను తీర్చుతారు’ అంటూ భరోసా ఇచ్చారు. సోమవారం రాత్రి 7 గంటలకు వజ్రకరూరు శివారులోని ఓ రైస్‌మిల్లు వద్ద పాదయాత్రను ముగించి, అక్కడే బస చేశారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో సోమవారం ఆమె దాదాపు 11 కిలోమీటర్ల మేర నడక సాగించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!