YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 26 July 2012

‘నగదు బదిలీ’ లోగుట్టు!

కంట్లో నెరసు పడిందని కనుగుడ్డు పెరుక్కున్నాడట వెనకటికొక మూర్ఖుడు. పేద జనానికి ఎంతోకొంత ఉపయోగకరంగా ఉంటున్న ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)లోని లోపాలను సరిదిద్ది అవి మరింత సమర్ధవంతంగా పనిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు ఏకంగా ఆ వ్యవస్థకే మంగళం పాడే దిశగా పావులు కదుపుతున్నాయి. ఏడాదిన్నరక్రితం పీడీఎస్‌ను క్రమబద్ధీకరించాలని కోరుతూ పౌర హక్కుల ప్రజా సంఘం (పీయూసీఎల్) దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఆ వ్యవస్థ తీరుతెన్నులను న్యాయమూర్తులు ప్రశ్నించారు. ప్రభుత్వ అసమర్ధతను ఎండగట్టారు. ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నా కూడా దేశంలో ఒకవైపు ఆకలి చావులు, మరోపక్క పోషకాహారలోపం ఎలా సంభవిస్తున్నాయని వారు ప్రశ్నించారు. జస్టిస్ వాధ్వా ఆధ్వర్యంలో తామే ఒక కమిటీని నియమించి పీడీఎస్ పనితీరుపై నివేదిక ఇవ్వాలని వారు కోరారు. 

ఆ కమిటీ పీడీఎస్‌లో సాగుతున్న అనేక లోపాలను ప్రస్తావించింది. దీన్ని సమూల ప్రక్షాళన చేయకపోతే పేదలకు తిండిగింజలు అందడం దుర్లభమని తేల్చింది. పూర్తిస్థాయి కంప్యూటరీకరణ చేస్తే అక్రమాలకు అడ్డుకట్టపడుతుందని సిఫార్సు చేసింది. పీడీఎస్ వ్యవస్థ బలహీనంగా ఉన్న సంగతి వాస్తవం. దాని ద్వారా పంపిణీ చేస్తున్న తిండి గింజల్లో 60 శాతం బహిరంగ మార్కెట్‌కు తరలుతున్నాయని ఒక అంచనా. ఆహార సబ్సిడీ కింద కేటాయింపులు ఆ యేటికాయేడు పెరుగుతున్నా అందులో వాస్తవంగా పేదలకు చేరేది తక్కువే. ఈ ఏడాది గోధుమ సేకరణ అనుకున్నదానికంటే ఎక్కువగా జరిగింది గనుక ఆహార సబ్సిడీ లక్ష కోట్లకు చేరవచ్చని ఈమధ్యే కేంద్ర ఆహార మంత్రి కె.వి. థామస్ చెప్పారు. 

అయితే, ఇంత ఘనంగా కేటాయింపులు ఉంటున్నా అన్నార్తులకు సరిగా అందడం లేదు. ఆహార భద్రత బిల్లు తీసుకురాబోతున్నామని, ఇక దేశంలో ఆకలి కేకలు వినబడే ప్రసక్తే ఉండదని ప్రభుత్వం చెబుతున్నా, పీడీఎస్ వ్యవస్థను తీర్చిదిద్దడంలో విఫలమవుతోంది. దేశంలో సంస్కరణలు జోరందుకున్నప్పటినుంచీ సంక్షేమ రాజ్య భావననుంచి మన పాలకులు కొంచెం కొంచెం పక్కకు జరుగుతున్నారు. పీడీఎస్ సంస్కరణలను అందులో భాగంగా చూస్తున్నారు తప్ప, దాన్ని సరిదిద్ది పేదల్ని ఉద్ధరిద్దామన్న యోచన మాత్రం కనబడటం లేదు. అప్పుడెప్పుడో కిరీట్ పారిఖ్ నేతృత్వంలో అధ్యయన బృందం అనేక సూచనలు చేసింది. ఫుడ్ స్టాంప్స్ ద్వారాగానీ, స్మార్ట్ కార్డులు ద్వారాగానీ పీడీఎస్‌ను సమర్ధవంతంగా అమలుచేయొచ్చని ఆ కమిటీ పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం ఇంకొంచెం ముందుకుపోయి పీడీఎస్‌కు మంగళంపాడి దారిద్య్రరేఖకు దిగువనున్నవారికి కిరోసిన్, గ్యాస్ సబ్సిడీలను నగదు బదిలీ పథకం ద్వారా అందజేయాలన్న ఆలోచనచేసింది. అలాగే, రైతులకిచ్చే ఎరువుల సబ్సిడీని కూడా ఇకపై సొమ్ము ముట్టజెప్పడం ద్వారా కానిద్దామని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలకు అవసరమైన సాంకేతిక వ్యూహాన్ని సిద్ధం చేయడానికి నందన్ నీలేకని ఆధ్వర్యంలో ఒక టాస్క్‌ఫోర్స్‌ను కూడా నియమించింది. సహజంగానే నీలేకని తాము రూపొందిస్తున్న ఆధార్ గుర్తింపు కార్డులతో ముడిపెట్టి నగదు బదిలీ పథకాన్ని అమల్లోకి తేవొచ్చని సూచించారు. 

ఆయన చెప్పిన ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఇది అమల్లోకి రావాల్సి ఉన్నా, ఇప్పుడు నిరుపేదలతో బ్యాంకు ఖాతాలను ప్రారంభించే కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికైతే కిరోసిన్‌కు బదులు నగదు బదిలీ పథకాన్ని అమలు చేయబోతున్నామని చెబుతున్నా, భవిష్యత్తులో బియ్యానికి, గోధుమలకు కూడా వర్తింపజేయబోరన్న గ్యారెంటీ ఏంలేదు. మన పీడీఎస్ వ్యవస్థ పరమ అధ్వానంగా ఉందని గత ఏడాది ప్రపంచబ్యాంకు ఒక నివేదికలో వాపోయింది. అందులో నగదు బదిలీ పథకాన్ని ప్రస్తావించింది. దానిద్వారా లబ్ధిదారులకు ఎక్కువ మేలు జరుగుతుందేమో ఆలోచించమని సూచించింది. ఈ పథకాన్ని వేర్వేరు పేర్లతో హోండురస్, నికరాగువా, పెరూ, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, ఈక్వెడార్, బ్రెజిల్, మెక్సికోలాంటి 30 దేశాలు అమలుచేస్తున్నాయి. అందులో 13 దేశాలకు ప్రపంచబ్యాంకు ఆర్ధిక సాయం కూడా అందిస్తోంది.

మన దగ్గర 2009 ఎన్నికల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు దీన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా వాడుకుని భంగపడ్డారు. బహుశా మిగిలిన రంగాల్లో ప్రపంచబ్యాంకు ఆదేశాలను శిరసావహించడానికి అలవాటుపడిన మన నేతలు ‘నగదు బదిలీ’ ఆలోచనను కూడా దాని ఆదేశాలమేరకే అమల్లోకి తెస్తున్నారా అనే అనుమానాలు కలగకమానవు. ఇలా డబ్బు చెల్లించి, బాధ్యతలనుంచి వైదొలగడం ప్రభుత్వాలకు బాగానే ఉంటుందిగానీ... అమల్లోకి తేవాలనుకుంటున్నవారు కొన్ని మౌలిక ప్రశ్నలకు జవాబు చెప్పాల్సివుంది. ప్రస్తుతం రైతులనుంచి కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) చెల్లించి కొంటున్న ఆహారధాన్యాలను పీడీఎస్ ద్వారా పంపిణీ చేస్తున్నారు.

నగదు బదిలీ పథకం తర్వాత రైతుల పరిస్థితి ఏమిటి? వారికిచ్చే ఎంఎస్‌పీ ఏమవుతుంది? అసలు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ఏమవుతుంది? పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నగదు బదిలీ పథకంలో ఇచ్చే సొమ్మును కూడా పెంచుతారా? ఇవన్నీ కాకుండా అసలు ఆహార ధాన్యాలకు బదులు డబ్బిస్తే లబ్ధిదారులు ఆ సొమ్మును ఆహారానికే ఖర్చుపెడతారన్న నమ్మకమేమిటి? మహిళల పేరుమీద బ్యాంక్ ఖాతాలు తెరిపిస్తున్నా, అందులో పడే సొమ్ము ఇంట్లో పెత్తనం చెలాయించే మగవాళ్లకు చేర డానికి, వారినుంచి మద్యం దుకాణాలకు పోవడానికి ఎంతో సమయం పట్టదు. ఇప్పటికే మన సమాజంలో ఆడవాళ్లు, పిల్లలు పోషకాహారలోపంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నగదు బదిలీ పథకం ఆ పరిస్థితిని మరింత దిగజార్చడం తప్ప సాధించేదేమీ ఉండదు. ప్రభుత్వాలు తమ చేతకానితనాన్ని ఇలా కొత్త కొత్త పథకాలద్వారా కప్పిపుచ్చుకోవడానికి చూడటం క్షమార్హం కాదు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!