కెకె మహేందర్ రెడ్డిగా రాజకీయాల్లో నలుగుతున్న కెకె మహేందర్ రెడ్డి కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తనయుడు కెటి రామారావుకు సవాల్ విసురుతున్నారు. విద్యార్థి దశలో వామపక్ష విద్యార్థి సంఘంలో ఉన్న కెకె మహేందర్ రెడ్డి మొదటి నుంచీ తెలంగాణవాది. దాంతోనే ఆయన కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చాలా కాలం కీలక పాత్ర పోషించారు. కెసిఆర్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగాడు.
కరీంనగర్ జిల్లాలో కెసిఆర్‌తో పాటు తిరిగారు. సిరిసిల్ల శానససభా సీటు ఇస్తానని కెసిఆర్ అప్పట్లో కెకె మహేందర్ రెడ్డికి హామీ ఇచ్చినట్లు చెబుతారు. అయితే, ఆ తర్వాత కెటి రామారావుకు ఆ సీటు కేటాయించి, కెకె మహేందర్ రెడ్డికి టికెట్ నిరాకరించారు. అప్పటి నుంచే కెసిఆర్‌కు కెకె మహేందర్ రెడ్డి దూరంగా జరుగుతూ వచ్చారు. 2009 ఎన్నికల్లో ఆయన కెటిఆర్‌పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. కెకె మహేందర్ రెడ్డి కెటి రామారావుపై అతి తక్కువ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. కెకె మహేందర్ రెడ్డి తెగువను గ్రహించిన వైయస్ రాజశేఖర రెడ్డి ఆయనను కాంగ్రెసు పార్టీలోకి ఆహ్వానించారు.
వైయస్ రాజశేఖర రెడ్డి హామీతో ఆయన కాంగ్రెసు పార్టీలో చేరారు. సిరిసిల్ల స్వస్థలం కావడంతో ఆయనకు నియోజకవర్గం మంచి పట్టు ఉంది. వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన వైయస్ జగన్ వెంటే ఉండి పార్టీ ఏర్పాటు తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. కెటి రామారావుపై కెకె మహేందర్ రెడ్డి రాజకీయంగా ప్రత్యర్థిగా మారారు.
ఇప్పటి నుంచే సిరిసిల్లలో కెటి రామారావుకు చెమటలు పట్టించే సవాల్ చేయడం ద్వారా తన సత్తా ఏమిటో నిరూపించుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. కెకె మహేందర్ రెడ్డికి స్థానికంగా ఉన్న పట్టు కారణంగానే కెటి రామారావు ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు.
No comments:
Post a Comment