తెలుగు చలన చిత్ర సీమలో మెగాస్టార్ స్థాయికి ఎదిగినా కాంగ్రెస్ రాజకీయాల్లో స్టార్ హోదాను కూడా దక్కించుకోలేకపోతున్న చిరంజీవి మనసంతా కేంద్ర ప్రభుత్వ మంత్రి వర్గ విస్తరణ మీదే ఉంది. సామాజిక న్యాయం నినాదంతో మార్పు లక్ష్యంగా.. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవికి ఆద్యంతము అనుకోని సంఘటనలే ఎదురవుతున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజారాజ్యం పార్టీ గత ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్ కావడంతో కొద్ది రోజులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితిలో రాజకీయ నడిసముద్రంలో ఓ చెక్క ముక్కపై మునగడమా, తేలడమా తెలియని స్థితిలో ఓ ఆసరా కోసం ఎదురు చూస్తున్న ఆయనకు కాంగ్రెస్ ఆఫర్ 'భాగ్యలక్ష్మి బంపర్ డ్రా' తగిలినంత పనైంది.
ఇంకేంటి.. తంతే గారెల బుట్టలో పడినట్టు ఎగిరి గంతేసి.. కాంగ్రెస్ ఒప్పందానికి తలవొగ్గి ప్రజారాజ్యాన్ని తాకట్టు పెట్టారు. ఒప్పందంలో భాగంగా తన భజన పరులకు మంత్రి పదవులు దక్కినా.. కేంద్రంలో మంత్రి హోదాను ఆశించిన ఆయనకు దక్కలేదు. ఆతర్వాత కొందరు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ సీపీ పక్షాన నిలువడం.. రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సంఘటనలు చోటు చేసుకోవడం జరిగిన సంగతి తెలిసిందే. రైతుల పక్షాన నిలిచి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటెయ్యడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు పడింది. తనను గెలిపించిన తిరుపతి నియోజకవర్గ ప్రజలకు చెప్పకుండానే ఎమ్మెల్యే గిరికి రాజీనామాలు పెట్టి, రాజ్యసభ సభ్యత్వంతో ఎంపీ హోదాకు మారారు. దాంతో రాష్ట్రంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఊహించని ఉప ఎన్నికలు ఆయనకు అగ్నిపరీక్ష గా నిలిచాయి.
ఉప ఎన్నికల్లో ఆరు.. ఏడు స్థానాలను గెలిపిస్తానని అధిష్టానం వద్ద ప్రగల్భాలు పలికిన మెగాస్టార్ కు ఆశించిన ఫలితాలు దక్కకపోవడం, స్వయంగా తాను గెలిచిన తిరుపతి నియోజకవర్గంలో కూడా ఊహించిన ఓటమి ఎదురవ్వడంతో ఆయనలో మంత్రి పదవి దక్కుతుందో లేదో అనే అనుమానం మొలకెత్తింది. అటు మంత్రి పదవి దక్కక.. 150 సినిమాపై మోజు తీరక ఊగిసలాడుతున్న చిరంజీవికి తాజా మంత్రి వర్గ విస్తరణ మరో ఆశను రేపింది.
ఆర్ధిక మంత్రి పదవికి ప్రణబ్ ముఖర్జీ రాజీనామా చేసి రాష్ట్రపతిగా ఎంపిక కావడం, వీరభద్ర సింగ్ రాజీనామా తదితర కారణాలతో కేంద్రంలో మంత్రి పదవులకు వేకెన్సీ బోర్డు ఉండటంతో మీడియాలో మంత్రి వర్గ విస్తరణపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. దాంతో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న చిరంజీవికి కారుపై ఎర్ర బుగ్గ మోజు పెరిగింది. ఎంతో మంది నమ్ముకున్న ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలను, అభిమానులను నట్టేటా ముంచి.. మంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టిన చిరంజీవికి ప్రతిఫలం దక్కుతుందా లేదా అని రాజకీయ విశ్లేషకులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
No comments:
Post a Comment