YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 23 July 2012

బాబుకు క్లీన్‌చిట్ ఇచ్చినట్లు కాదు

* బాబు అక్రమాస్తులపై దర్యాప్తు సంస్థలను ఆశ్రయించాలని విజయమ్మకు సూచన
* అవి స్పందించకుంటే అప్పుడు తమవద్దకు రావాలని స్పష్టీకరణ
* కేసు మూలాల్లోకి వెళ్లకుండానే పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నామన్న ధర్మాసనం
* హైకోర్టు తీరును తప్పుపట్టిన విజయమ్మ తరఫు న్యాయవాది రాంజెఠ్మలానీ
* వివక్షాపూరితంగా వ్యవహరించిందని వెల్లడి

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు, బినామీల అక్రమాస్తులకు సంబంధించి ముందుగా దర్యాప్తు సంస్థలను ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు సూచించింది. తొలుత దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలని, అవి సరిగా స్పందించకుంటే అప్పుడు తమ వద్దకు రావాలని తెలిపింది. తాము చేసిన ఈ సూచనలను చంద్రబాబు అండ్ కోకు క్లీన్‌చిట్ ఇచ్చినట్లుగా భావించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కేసు మూలాల్లోకి వెళ్లకుండానే తాము పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్లు పేర్కొంది. చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులతో పాటు బినామీలైన రామోజీరావు, సీఎం రమేష్, సుజనా చౌదరి, నామా నాగేశ్వరరావు, మురళీమోహన్, కర్నాటి వెంకటేశ్వరరావు తదితరుల అక్రమాస్తులపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ వైఎస్ విజయమ్మ గత ఏడాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. 

ఈ వ్యాజ్యాన్ని విచారించిన అప్పటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గులాం మహ్మద్, జస్టిస్ నూతి రామ్మోహనరావులతో కూడిన ధర్మాసనం.. విజయమ్మ చేసిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయంటూ దీనిపై ప్రాథమిక విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. ఈ మధ్యంతర ఉత్తర్వులపై చంద్రబాబు బినామీలు రామోజీరావు, సీఎం రమేష్, నామా నాగేశ్వరరావు తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమని, హైకోర్టుకే వెళ్లి తేల్చుకోవాలని సుప్రీం చెప్పింది. దీంతో వారు హైకోర్టులో వేర్వేరుగా పలు అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. బాబు అండ్ కో నాట్ బిఫోర్ నాటకాలకు తెరలేపడంతో, ఈ వ్యాజ్యం పలు ధర్మాసనాలను తప్పించుకుంటూ చివరకు జస్టిస్ రోహిణి, జస్టిస్ అశుతోష్ మొహంతాలతో కూడిన ధర్మాసనం వద్దకు చేరింది. 

జస్టిస్ రోహిణి ధర్మాసనం.. హైకోర్టు అంతకుముందు బాబు అండ్‌కోపై సీబీఐ ప్రాథమిక విచారణకు ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేసింది. తరువాత బాబు అండ్ కో చేసిన అభ్యర్థనకు భిన్నంగా ఏకంగా విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌నే కొట్టేసింది. దీనిపై విజయమ్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం న్యాయమూర్తులు జస్టిస్ టి.ఎస్.ఠాకూర్, జస్టిస్ ఫక్కిర్ మహ్మద్ ఇబ్రహీం ఖలీఫుల్లాలతో కూడిన ధర్మాసనం విచారించింది. విజయమ్మ తరఫున సీనియర్ న్యాయవాదులు రాంజెఠ్మలానీ, ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించగా, రిలయన్స్ తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, చంద్రబాబు తరఫున మరో సీనియర్ న్యాయవాది ఏ.కె.గంగూలీ, రామోజీ తరఫున అనిల్ దివాన్‌లు వాదనలు వినిపించారు. మొదట జెఠ్మలానీ తన వాదనలు వినిపిస్తూ.. విజయమ్మ పిటిషన్‌ను కొట్టివేయడం ద్వారా హైకోర్టు తప్పుచేసినట్లయిందన్నారు. 

ముమ్మాటికీ వివక్షే..
విజయమ్మ కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన హైకోర్టు, చంద్రబాబు తదితరులపై విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌ను మాత్రం కొట్టివేసిందని, ఇది ముమ్మాటికీ వివక్ష చూపడమే అవుతుందని అన్నారు. తనపై కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పిటిషన్లు దాఖలు చేశారని జగన్ నెత్తీనోరూ మొత్తుకున్నా పట్టించుకోని హైకోర్టు, విజయమ్మ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమపై పిటిషన్ దాఖలు చేసిందని చంద్రబాబు తదితరులు చెప్పగానే నమ్మిందని, ఇలాంటి భేదాలు ఎందుకు చూపాల్సి వచ్చిందని జెఠ్మలానీ ప్రశ్నించారు. హైకోర్టు తీరును చూస్తుంటే వ్యక్తి వ్యక్తికో న్యాయంలా కనిపిస్తోందన్నారు. 

ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. తాము కేసు మూలాల్లోకి వెళ్లడం లేదంది. ప్రతివాదులపై (చంద్రబాబు తదితరులు) పిటిషనర్ ఏసీబీ వంటి దర్యాప్తు సంస్థలకు గానీ, సంబంధిత న్యాయస్థానానికి గానీ ఫిర్యాదు చేయవచ్చంది. దీంతో కోర్టుల్లో ఫిర్యాదు చేస్తే విచారణ ప్రారంభమయ్యేందుకు సుదీర్ఘ సమయం పడుతుందని, ఏసీబీ వంటి దర్యాప్తు సంస్థకు ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహకారం లభించే ఆస్కారమే లేదని జెఠ్మలానీ వివరించారు. చంద్రబాబు తదితరులు రాష్ట్ర హైకోర్టులో తమపై ప్రాథమిక విచారణను నిలిపివేయాలంటూ అనుబంధ పిటిషన్లు దాఖలు చేయగా.. విజయమ్మ రాజకీయ కారణాలతో పిటిషన్ దాఖలు చేశారని, ప్రతివాదులకు నోటీసులు కూడా ఇవ్వలేదని పేర్కొంటూ జస్టిస్ రోహిణి ధర్మాసనం ఆ పిటిషన్‌ను కొట్టివేసిందని తెలిపారు. 

‘గతంలో విశ్వనాధ్ చతుర్వేది అనే కాంగ్రెస్ వ్యక్తి ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్‌పై సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్ వేయగా ఇదే న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు ఇవ్వకుండానే సీబీఐ విచారణకు ఆదేశించింది. ప్రాథమిక విచారణ సమయంలో సీబీఐ సదరు వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తుంది. ఆ తదుపరి మాత్రమే దర్యాప్తును మొదలు పెడుతుంది. కాబట్టి కోర్టు సదరు వ్యక్తులకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని జెఠ్మలానీ స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన జస్టిస్ ఠాకూర్ ‘మీకు న్యాయపరంగా ఇతర ప్రత్యామ్నాయాలున్నాయి కదా! మీరు ఈడీకి, ఏసీబీకి, మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదులు చేసుకోవచ్చు కదా’ అని వ్యాఖ్యానించారు. 

జెఠ్మలానీ స్పందిస్తూ.. ‘ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు... వాటి కింద పనిచేసే ఏసీబీ, పోలీసులు మా ఫిర్యాదు విషయంలో సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటారని ఆశించడం ప్రస్తుత పరిస్థితుల్లో హాస్యాస్పదమే అవుతుంది. మెజిస్ట్రేట్ కోర్టులకు సీబీఐ విచారణకు ఆదేశించే అధికారం లేదు’ అని కోర్టు దృష్టికి తెచ్చారు. విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌ను రాజకీయ కోణంలోనే ఎందుకు చూడాలని, ఆమె పిటిషన్‌లో పేర్కొన్న అంశాలపై ప్రాథమిక విచారణ జరిపి ఆ తర్వాతే వారిపై చర్యలు తీసుకోవచ్చు కదా.. అని ప్రశ్నించారు. అక్రమార్జన ఆరోపణలు నిజమా, కాదా అన్న విషయంపై హైకోర్టులో కానీ ఈ న్యాయస్థానంలో కానీ బాబు తదితరులు నోరు మెదపడం లేదని, కేవలం ఇది రాజకీయ కక్ష అనే కోణంలో మాత్రమే వారు వాదిస్తున్నారని నివేదించారు. దీనిపై జస్టిస్ ఠాకూర్ స్పందిస్తూ ‘పిటిషనర్ భర్త ఆరేళ్లు అధికారంలో ఉండి అనేక పదవులు నిర్వహించిన వ్యక్తి. అలాగే బాబు కూడా అధికారాన్ని అనుభవించిన రాజకీయ నాయకుడు. ముఫ్పై ఏళ్ల పాటు వీరిధ్దరి మధ్య రాజకీయ వైరం ఉంది. దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దా?’ అని ప్రశ్నించారు. 

రాజకీయ వైరమని చెప్పినా ఈ కోర్టు పట్టించుకోలేదు...
ఈ సమయంలో విజయమ్మ తరఫున వాదనలు వినిపిస్తున్న మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కల్పించుకొని.. ‘విశ్వనాధ్ చతుర్వేదీ వర్సెస్ ములాయంసింగ్ యాదవ్ కేసులో నేను ములాయం తరఫున వాదించాను. ఆ రోజు విశ్వనాధ్ చతుర్వేది రాజకీయ వైరంతోనే ములాయంపై కేసు వేశాడని పదేపదే కోర్టు దృష్టికి తెచ్చినా, ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో రాజకీయ కోణాలు వెతక్కూడదని ఇదే న్యాయస్థానం నా వాదనలు తోసిపుచ్చుతూ తీర్పులో పేర్కొంది. మరి ఇప్పుడు బాబు తదితరులు అక్రమార్జనకు పాల్పడ్డారని విజయమ్మ పేర్కొనగా దీనిని ఇదే కోర్టు ఎందుకు రాజకీయ కోణంలో చూడాలి?’ అని ప్రశ్నించాచారు. .

జెఠ్మలానీ వాదనలు కొనసాగిస్తూ.. ‘ పిటిషనర్ కుమారుడు జగన్ విషయంలో కనిపించని రాజకీయ కోణం బాబు విషయంలో కనిపిస్తుందా?, ప్రాథమిక విచారణ జరిపించి నిజాలు నిగ్గుతేలిస్తే నష్టం ఎవరికీ వాటిల్లదు. ప్రాథమిక విచారణలో అరెస్ట్‌లు, ఎఫ్‌ఐఆర్ నమోదులు ఉండవు కాబట్టి ప్రాథమిక విచారణకు ఆదేశించాలి. మా కేసులో అదే కోర్టు ప్రాథమిక విచారణకు ఆదేశించడం, వారి కేసులో విచారణ నిలుపుదల చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రాథమిక విచారణలో ప్రతివాదులపై ఆరోపణలు నిజమని తేలితేనే న్యాయస్థానం తదుపరి విచారణకు ఆదేశించవచ్చు. జగన్ కేసులో జగన్, శంకర్రావు, ఎర్రన్నాయుడులు రాజకీయ విరోధులు కాదా?, విశ్వనాధ్ చతుర్వేదీ కేసులో అతను, ములాయంలు రాజకీయ విరోధులు కాదా? . కాబట్టి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను రాజకీయ కోణంలో చూడరాదు’ అని కోర్టును కోరారు. 

తరువాత రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. ‘కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు, తెలుగుదేశం ఎంపీలు లేఖలు రాస్తేనే కోర్టు దాన్ని రిట్‌గా స్వీకరించి ప్రాథమిక విచారణకు ఆదేశించింది. సమాచార హక్కు కింద పొందిన సమాచారంతో దాదాపు 2 వేలకు పైగా పేజీలతో తన ఆరోపణలకు సంబంధించిన అన్ని ఆధారాలను విజయమ్మ కోర్టు ముందుంచితే .. ఇతర న్యాయ మార్గాలున్నాయనడం సరికాదు. అప్పట్లో జగన్ విషయంలో శంకర్రావు, తెలుగుదేశం పార్టీ నేతలకు లేని ఇతర మార్గాలు ఇప్పుడు కొత్తగా మాకు ఉన్నాయా?, ఒక పిటిషన్‌లో ఓ విధంగా, మరో పిటిషన్‌లో మరో విధంగా రెండు ధోరణిలతో ఒకే హైకోర్టు చూడటం వల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయి’ అని నివేదించారు. 

జగన్‌కు ఒక న్యాయం, బాబుకు ఒక న్యాయమా అంటూ ప్రశ్నించారు. దీనికి స్పందించిన జస్టిస్ ఠాకూర్ ‘ప్రాథమిక విచారణకు ఆదేశించే ముందు రాష్ట్ర హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలి కదా?’ అని ప్రశ్నించగా, రాంజెఠ్మలానీ స్పందిస్తూ.. నోటీసులు జారీ చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరం లేదని సుప్రీంకోర్టే ఎన్నో కేసుల్లో పేర్కొన్న విషయాన్ని 
గుర్తు చేశారు.

బాబుకు అనుకూలంగా ఉన్నందునే కక్షగట్టారు...
రిలయన్స్ తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదిస్తూ... ‘వై.ఎస్ రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా తన పత్రికలో కథనాలు రాస్తూ బాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే.. తమ వ్యాపార భాగస్వామి అయిన రామోజీరావుతో తాము జరిపిన లావాదేవీలను, రామోజీ సంస్థల్లో తాము పెట్టుబడులు పెట్టిన తీరును విజయమ్మ ప్రశ్నించారు. 1999-2000 ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం కేజీ బేసిన్ గ్యాస్ కాంట్రాక్ట్‌ను తమకు ఇచ్చిన కారణంగానే రామోజీ సంస్థల్లో మేము పెట్టుబడి పెట్టామనడం సరికాదు. రామోజీకి, విజయమ్మ భర్తకి ఉన్న వైరంలోకి మమ్మల్ని లాగారు. రిలయన్స్ మీద సీబీఐ ప్రాథమిక విచారణకు ఆదేశిస్తే బ్యాంకులు మాకు రుణాలు ఇచ్చేందుకు భయపడతాయి. మా వ్యాపారంపై నీలిమేఘాలు కమ్ముకునే అవకాశాలుంటాయి’ అని పేర్కొన్నారు. 

చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది ఎ.కె గంగూలీ వాదిస్తూ.. ‘వైఎస్ హయాంలో ఇటువంటి ఆరోపణలతోనే కోర్టుల్లో పిటిషన్‌లు దాఖలు చేయగా వాటిని తిరస్కరించడం జరిగింది. సీఎం హోదాలో రాజశేఖరరెడ్డి దాదాపుగా 20 సభా కమిటీలు బాబుపై వేశారు. ఏ ఆరోపణలను కూడా రుజువు చేయలేకపోయారు’ అని తెలిపారు. ఈ సమయంలో జస్టిస్ ఠాకూర్ కల్పించుకొని ‘మీపై ప్రాథమిక విచారణకు ఆదేశిస్తే మీకొచ్చే ప్రమాదం ఏమైనా ఉందా?’ అని ప్రశ్నించారు. దీనికి గంగూలీ స్పందిస్తూ ‘ ప్రాథమిక విచారణకు ఆదేశిస్తే ప్రజలకు వేరేవిధమైన సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. రాజకీయ జీవితంలో ఇటువంటి వాటిని ప్రజలు సున్నితంగా స్వీకరిస్తారు’ అని కోర్టుకు తెలిపారు. రామోజీ తరఫు న్యాయవాది అనిల్ దివాన్ వాదిస్తూ.. ‘రామోజీ పేపర్, టీవీకీ అధినేత. ప్రాథమిక విచారణకు ఆదేశిస్తే పేపర్, టీవీ వ్యాపారం ఇబ్బందులకుగురవుతుంది’ అని విన్నవించారు. 

విజయమ్మ తన పిటిషన్‌లో గతంలో వైఎస్ వేసిన సభాసంఘాల గురించి కానీ, కేసుల గురించి కానీ ప్రస్తావించకపోవడం నిజాలను దాచిపెట్టడంగా భావించాలని అన్నారు. చివరగా జెఠ్మలానీ స్పందిస్తూ.. చంద్రబాబు తదితరుల అక్రమాస్తులపై హైకోర్టు మొదట సీబీఐ ప్రాథమిక విచారణకు ఆదేశించిందని, దానిని ఇప్పుడు కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. అయితే తామలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు మూలాల్లోకి వెళ్లకుండానే విజయమ్మ పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్లు తెలిపింది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!