రాష్ట్ర ప్రజల హృదయాల్లో నుంచి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముద్రను చెరిపేసేందుకు కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఓ పక్క వైఎస్ మా నేత అంటూనే మరోవైపు ఆయన ఇమేజ్ ను దూరం చేసేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తోంది. పాదయాత్రతో ప్రజలకు మరింత దగ్గరైన వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే పలు ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టారు.
అంతే కాకుండా వాటి అమలుకు ఎనలేని కృషి చేశారు. దాంతో వైఎస్ కాంగ్రెస్ పార్టీ కన్నా వ్యక్తిగతంగా ప్రజల్లో ఆదర అభిమానాలు సంపాదించారు. రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలకు ప్రశంసలే కాకుండా, మిగతా రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచాయి. ఆయన మరణానంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాలను ఒక్కొక్కటిగా అటక ఎక్కిస్తోంది.
వైఎస్ ఇమేజ్ ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కలిసి వస్తోందని భావించిన కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఆపథకాలపై 'రాజ'ముద్రను తొలగించాలని కంకణం కట్టుకుంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలన్ని కాంగ్రెస్ పార్టీవే కానీ...వైఎస్ సొంత పథకాలు కాదని గొంతు చించుకుని చెబుతున్నా ప్రజలు నమ్మలేదు. అందుకు నిదర్శనంగా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఫలితాలనే చెప్పుకోవచ్చు. చాలాచోట్ల డిపాజిట్లు కోల్పోయి 'చేతు'లెత్తిసింది కూడా.
దాంతో ఆత్మశోధనకు దిగిన రాష్ట్ర కాంగ్రెస్ పదిమంది మంత్రుల సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. నెల రోజులు శోధన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ‘ముద్ర’ను తొలగించి, అవన్నీ కాంగ్రెస్ పథకాలుగా ప్రచారం చేయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని ఆ కమిటీ తేల్చింది.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై వైఎస్ ముద్ర ఉన్నందున, ఎన్ని చెప్పినా అవి వైఎస్ పథకాలుగానే ప్రజలు గుర్తిస్తున్నారని కమిటీ భావించింది. దీనిపై చాలాసేపు తర్జన భర్జన పడింది కూడా. ఉదాహరణకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు వైఎస్ హయాంలో 750 కోట్ల రూపాయలు కేటాయించగా, ఇప్పుడు నాలుగు వేల కోట్లు చెల్లించినా అది వైఎస్ పథకంగానే ముద్ర పడిందని పేర్కొంది.
అలాగే నాడు వైఎస్ పల్లెబాట చేపట్టడం ద్వారా ప్రజల ముందుకు ప్రభుత్వ యంత్రాంగం కదిలి వచ్చి సమస్యలు పరిష్కరించడం జరిగినందున, అది కూడా వైఎస్ పథకంగానే ముద్ర పడిందని కమిటీ అభిప్రాయపడింది. ఇప్పుడు ఆ పథకానికి ఇందిరమ్మ బాటగా పేరు మార్చడం వల్ల క్రమేణా వైఎస్ పేరును ప్రజలకు దూరం చేయగలమా? అనే అంశంపై కమిటీ మల్లాగుల్లలు పడింది.
కనీసం వెంటనే కాకపోయినా కొంత కాలానికైనా మార్చేందుకు వీలవుతుందని భావిస్తోంది. అవసరం అయితే పథకాల పేర్లూ కూడా మార్చాలని ఆ కమిటీ సిఫార్సు చేసింది. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి మరింతగా దిగజారుతుందని అభిప్రాయపడింది. ఈమేరకు నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించింది. కమిటీ నివేదికను పరిశీలించి అమలు చేస్తామని ముఖ్యమంత్రిగారు అభయహస్తం ఇచ్చారు.
కులమతాలు, ప్రాంతాల కతీతంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన మహనేత వైఎస్‌ఆర్ ముద్రను చెరిపేయాలనుకోవడం హనుమంతుని ముందు కుప్పిగంతులేయడం లాంటిదని వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో ఒంటిచేత్తో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన వైఎస్‌ఆర్‌ను ప్రజల హృదయాల్లోంచి తుడిపేయాలనుకోవడం కాంగ్రెస్ తరం కాదని సవాల్ విసిరింది. మరి ప్రజల గుండెల్లో నిలిచిన రాజన్న ముద్రను చెరపటం అంత సులభమా? వైఎస్ ముద్ర మాత్రం కాంగ్రెస్‌ను భయపెడుతోంది!
No comments:
Post a Comment