YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 25 July 2012

కాంగ్రెస్‌లో పోలవరం చిచ్చు

- టెండర్లపై స్వపక్షం నుంచే ఆరోపణలు 
- టీడీపీతో మ్యాచ్‌ఫిక్సింగ్‌కు మరో రుజువంటూ విమర్శలు
- హైకోర్టుకు వెళ్తానంటున్న పాల్వాయి
- రద్దు చేయాలని కోరిన మంత్రులు
- అధిష్టానానికి పీసీసీ నేతల ఫిర్యాదులు
- సీఎంతో మాట్లాడతామంటున్న మంత్రులు
- కిరణ్‌కు లేఖ రాసిన దానం, ముఖేష్ 

హైదరాబాద్, న్యూస్‌లైన్: భారీగా ముడుపులు చేతులు మారాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న పోలవరం టెండర్ల ఖరారు వ్యవహారం అధికార కాంగ్రెస్‌లో రాజకీయ చిచ్చు రేపుతోంది. టెండర్లను అడ్డుకుంటామని పలువురు కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తుండటమే గాక, వాటిని రద్దు చేయాలని ఏకంగా మంత్రులే కోరుతుండటంతో ప్రభుత్వం చిక్కుల్లో పడింది. టెండర్లపై ఇంటా బయటా విమర్శల నేపథ్యంలో మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ సీఎంకు సంయుక్తంగా లేఖ రాశారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్మాణ పనుల నిర్వహణకే అనర్హమని తేలిన కంపెనీకి పోలవరం టెండర్లను ఎలా కట్టబెట్టారంటూ కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. టెండర్ల ప్రక్రియను నిలిపేయాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరినా స్పందించలేదంటూ మీడియా సమక్షంలోనే ధ్వజమెత్తారు. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తానంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు! 

దీనిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని మరికొందరు పీసీసీ నేతలు నిర్ణయించారు. తమ అభ్యంతరాలను త్వరలోనే కిరణ్ ముందుంచుతామని ఇంకొందరు ముఖ్య నేతలంటున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఒక నేత భాగస్వామిగా ఉన్న కంపెనీకి పోలవరం టెండర్ దక్కిందంటూ కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ వ్యవహారంలో టీడీపీతో మ్యాచ్‌ఫిక్సింగ్ జరిగిందని వారు అనుమానిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ముందుగా టెండర్లను రద్దు చేయాలంటూ డిమాండ్ చేసే చంద్రబాబు, ఈసారి మాత్రం కేవలం సంబంధిత ఫైళ్లను స్పీకర్ ముందు పెట్టి అనుమానాలను నివృత్తి చేయాలని కోరడంతో సరిపెట్టడమే అందుకు నిదర్శనమంటున్నారు. తెరవెనక ఏదో జరిగిందనే అనుమానాలు కాంగ్రెస్ నేతల్లో బలపడుతున్నాయి.

రెండు బిడ్లనే తెరిచారేం..?
పోలవరం టెండర్లలో రెండు కంపెనీల బిడ్లనే తెరవడాన్ని పీసీసీ ముఖ్యనేత ఒకరు తప్పుబట్టారు. ప్రజల్లో అనుమానాలు ఏర్పడేందుకు ప్రభుత్వమే ఆస్కారం కల్పిస్తోందని వాపోయారు. ఇది పార్టీతో పాటు ప్రభుత్వానికీ చేటు చేస్తుందంటున్నారు. ‘‘అన్ని బిడ్లూ తెరచి, అతి తక్కువకు కోట్ చేసిన వారికే పనులు కట్టబెడితే కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమయ్యేది కాదు. ప్రజల్లోనూ అపవాదు తప్పేది’’ అని ఆయనంటున్నారు. గతంలో 12 శాతం తక్కువకు కోట్ చేసిన కంపెనీకి ఇప్పుడు కేవలం 2 శాతం తక్కువకే పనులప్పగించడం అనుమానాలకు తావిస్తోందంటున్నారు. టీడీపీ రాజ్యసభ సభ్యుని కంపెనీ భాగస్వామిగా ఉన్న సంస్థకు టెండర్లు ఖరారవడం వెనకున్న రహస్య ఒప్పందాలను విశదీకరిస్తూ అధిష్టానానికి పలువురు కాంగ్రెస్ నేతలు ఫ్యాక్సులు కూడా పంపుతున్నారు. టీడీపీతో మ్యాచ్‌ఫిక్సింగ్ బాగోతాలు ఇప్పటికే కాంగ్రెస్‌ను తీవ్రంగా దెబ్బతీశాయని, టెండర్ల వ్యవహారంతో ప్రజల్లో మరింతగా అభాసుపాలవుతామని ఆ ఫిర్యాదుల్లో పేర్కొంటున్నారు.

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల్లో అసంతృప్తి
పోలవరం టెండర్ల వ్యవహారం మంత్రులతో పాటు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేల్లో కూడా అసంతృప్తిని రాజేస్తోంది. గతంలో 12.08 శాతం తక్కువకు టెండర్లు దాఖలు చేసినా పనులు చేజిక్కించుకోలేకపోయిన సోమా కంపెనీ, ఈసారి కేవలం 2.48 శాతం తక్కువకే ఎలా టెండర్లు పొందగలిగిందని మంత్రులు ప్రశ్నిస్తున్నారు. పోలవరం టెండర్ల వ్యవహారం పదేపదే వివాదాస్పదమై ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తింటోందంటున్నారు. గతంలో టెండర్లు ఖరారైనప్పుడు ప్రభుత్వంపై టీఆర్‌ఎస్‌తో కుమ్మక్కు ఆరోపణలు రాగా, ఈసారి టీడీపీతో కలిసిపోయారన్న వార్తలు వస్తుండటంతో పరువు పోతోందని వాపోతున్నారు. సీఎం కార్యాలయ అధికారులు, కొందరు ముఖ్యనేతలు దగ్గరుండి మరీ ఈ టెండర్ల వ్యవహారాన్ని నడిపించారని, కాంట్రాక్టర్లను సిండికేట్ చేశారని బాహాటంగానే విన్పిస్తోంది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!