కరీంనగర్: టిఆర్‌ఎస్ ప్రకటించిన బంద్ పట్ల పలు చోట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దుకాణాలు బంద్ చేయాలంటూ సిరిసిల్లలో టిఆర్‌ఎస్ కార్యకర్తలు దాడులకు పాల్పడితే వారిపై వ్యాపారస్తులు తిరగబడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలో ఓ పాఠశాలపై టిఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేయడంతో అద్దాలు పగిలిపోయాయి. చాలా మంది విద్యార్థులు బంద్‌లు వద్దు, చదువులే ముద్దని అన్నారు.
టీఆర్‌ఎస్ ప్రకటించిన బంద్‌ను కరీంనగర్ జిల్లా సిరిసిల్ల వాసులు వ్యతిరేకించారు.దుకాణాలను టీఆర్ఎస్ కార్యకర్తలు బలవంతంగా మూసివేయించారు. హోటళ్లు, చిరు దుకాణాలపై దాడి చేసి, తినుబండారాలను కింద పడేశారు. దీంతో వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలకు వ్యాపారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలవారిని శాంతింప చేశారు. తెలంగాణవాదుల చర్యను నిరసిస్తూ వ్యాపారులు ధర్నా, రాస్తారోకో చేశారు. ఉదయం నుంచి షాపులు మూసివేసి మధ్యాహ్నం తెరిచామని తమపై తెలంగాణవాదులు దాడి చేయడమేంటని వ్యాపారులు ప్రశ్నించారు.
పాఠశాలలు ప్రారంభమై నెలన్నరవుతున్నా బంద్‌లు, సెలవుల వల్ల పిల్లల పాఠాలు ముందుకు సాగలేదని నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో స్కూలు యజమాని పాపిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా నిర్మాణాత్మకంగా వుండాలి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు బంద్‌లంటే ఎలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు
ఇదిలా ఉండగా, ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలను మూసేయాలని టిఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేసి, ఆ వెంటనే పాఠశాలపై దాడి చేశారు. అద్దాలు పగలగొట్టారు. తమ మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకోండంటూ పలు చోట్ల ప్రజలు టిఆర్‌ఎస్ కార్యకర్తలను కోరారు. ఏ రోజుకారోజు జరిగే చిరు వ్యాపారాలపై ఆధారపడే తమలాంటి వారిపై దాడి చేయడం ఎంత మేరకు సబబని వారు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణవాదాన్ని భుజానకెత్తుకోవడంలో అందరికంటే ముందుండే తమపైనే టిఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రతాపం చూపడమేంటని వారు మండిపడుతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment