ఒంగోలు: ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. జిల్లాకు చెందిన నేత, టిడిపి రాష్ట్ర కార్యదర్శి చుండూరి రవి సోమవారం టిడిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి పంపించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ చంద్రబాబు ఎన్టీఆర్ అభిమానులను అణిచివేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు.
యువకులకు టిక్కెట్లు ఇస్తానని ఆయన మోసం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు బిసిలకు వంద శాతం సీట్లు ఇస్తామనటం కూడా మోసంలో భాగమేనని ఘాటైన విమర్శలు చేశారు. ఆత్మగౌరవం కోల్పోయిన ఎన్టీఆర్ అభిమానులంతా త్వరలో పార్టీ నుంచి బయటకు వస్తారన్నారు. తన నియోజకవర్గ కార్యకర్తలతో చర్చించిన అనంతరం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నట్లు చుండూరి రవి ప్రకటించారు.
కాగా ఇప్పటికే పలు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు జగన్ పార్టీ వైపు క్యూ కడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని జగన్‌కు జై కొట్టారు. పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు సోదరుడు కూడా జగన్ వైపు వెళ్లారు. జిల్లాకు చెందిన మరికొందరు నేతలు కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు.
మరోవైపు నూజివీడు శాసనసభ్యుడు చిన్నం రామకోటయ్య కాంగ్రెసు వైపు వెళ్లారు. తాను కాంగ్రెసు సీనియర్ నేత పాలడుగు వెంకట్రావుతో కలిసి ఇక నుండి పని చేస్తానని చిన్నం చెప్పారు. వల్లభనేని వంశీ జగన్ పార్టీలోకి వెళతారనే ప్రచారం జోరుగా జరిగినప్పటికీ తాను టిడిపిలోనే ఉంటానని ఆయన ప్రకటన చేశారు.
No comments:
Post a Comment