YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 28 July 2012

‘సుప్రీం’లో మళ్లీ జగన్ బెయిల్ పిటిషన్.

ఆ 26 జీవోలు ‘క్విడ్ ప్రో కో’లో భాగం కాదని
న్యాయసాయం జీవోలే చెబుతున్నాయి
ముఖ్యమంత్రి కూడా ఆ జీవోలు ‘క్విడ్ ప్రో కో’లోభాగం కాదని చెప్పారు
నేను ఏ నేరమూ చేయలేదని దీని ద్వారా స్పష్టమవుతోంది


హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం సుప్రీంకోర్టులో మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసి, తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోరారు. ఇటీవల సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన జగన్‌మోహన్‌రెడ్డి అదనపు సమాచారం జత చేయడానికి వారం కిందట ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అదనపు వివరాలతో పిటిషన్ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతిని పొందారు. 26 వివాదాస్పద జీవోలకు సంబంధించి ఆరుగురు మంత్రులు, ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు న్యాయసహాయం అందిస్తూ ప్రభుత్వం వేర్వేరుగా జారీ చేసిన జీవోల కాపీలను జత చేస్తూ తాజా పిటిషన్ వేశారు.

‘క్విడ్ ప్రో కో’ జీవోలకు బాధ్యులైన మంత్రులు, ఐఏఎస్‌లపై కూడా విచారణ జరిపేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైందని, దీనిని విచారించిన కోర్టు, ఆరుగురు మంత్రులు, ఎనిమిదిమంది ఐఏఎస్‌లకు నోటీసులు జారీ చేసిందని జగన్‌మోహన్‌రెడ్డి తన బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో నోటీసులు అందుకున్న మంత్రులు, ఐఏఎస్‌లకు న్యాయసాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి, ఆ మేరకు జీవోలు జారీ చేసిందంటూ, వాటిని ఆయన సుప్రీంకోర్టు ముందుంచారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ 26 జీవోలు ‘క్విడ్ ప్రో కో’లో భాగంగా కాదని పత్రికాముఖంగా చెప్పారని, ఈ విషయం అన్ని పత్రికల్లో ప్రచురితమైందని వివరించారు. ప్రభుత్వ చర్యలను, వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆ 26 జీవోలు ‘క్విడ్ ప్రో కో’లో భాగంగా విడుదల కాలేదని స్పష్టంగా అర్థమవుతోందని జగన్ అన్నారు.

ఏ నేరం చేయలేదన్నది స్పష్టం: ఆ జీవోలు ‘క్విడ్ ప్రో కో’లో భాగంగా జారీ అయ్యాయని, అందుకు అనుగుణంగా తన కంపెనీల్లో పెట్టుబడులు వచ్చాయని ఆరోపిస్తూ సీబీఐ అధికారులు తనపై కేసు నమోదు చేసి, తరువాత అరెస్ట్ చేశారని జగన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పుడు ప్రభుత్వమే అవి ‘క్విడ్ ప్రో కో’ జీవోలు కాదని చెబుతోందని, కాబట్టి తాను ఏ నేరం చేయలేదని స్పష్టమవుతోందని వివరించారు. సీబీఐ దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరించానని తెలిపారు. దర్యాప్తు ప్రక్రియలో జోక్యం చేసుకోవడంగానీ, సాక్షులను ప్రభావితం చేయడంగానీ, సాక్ష్యాలను తారుమారు చేయడం గానీ ఎన్నడూ చేయలేదని వివరించారు. బెయిల్ మంజూరు సమయంలో కోర్టు ఏ షరతులు విధించినా పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన సుప్రీంకోర్టును అభ్యర్థించారు.

అరెస్ట్ అక్రమం: మరోవైపు తన అరెస్ట్‌ను అక్రమంగా ప్రకటించాలని కోరుతూ తాను దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సైతం జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని, దురుద్దేశాలతో చేసినవని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడంలో కోర్టు విఫలమైందని జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఒకవైపు ఒకటే కుట్ర అంటూనే, మరోవైపు అనేక నేరాలు చేశారంటూ సీబీఐ అర్థం లేని ఆరోపణలు చేస్తోందని, వీటిని హైకోర్టు పరిగణనలోకి తీసుకుని ఉండాల్సింది కాదని ఆయన వివరించారు. కొందరు సాక్షులు సాక్ష్యం చెప్పేందుకు ముందుకు రావడం లేదని సీబీఐ ఆరోపణ చేయగానే, ఆ ఆరోపణల్లో వాస్తవం ఉందో లేదో తెలుసుకునే ప్రయత్నం హైకోర్టు చేయలేదని తెలిపారు. తాను ఎన్నడూ కూడా దర్యాప్తు నుంచి తప్పించుకోలేదని, సీబీఐకి పూర్తిస్థాయిలో సహకరించానని, సీబీఐ తనను 30 గంటల పాటు వివిధ రకాలుగా ప్రశ్నించిందని తెలిపారు. కేవలం సీబీఐ ఆరోపణల ఆధారంగానే హైకోర్టు తన అరెస్ట్‌ను అక్రమమని ప్రకటించలేకపోయిందని, సీబీఐ ఆరోపణల్లో ఎంత వాస్తముందనే విషయాన్ని అసలు పట్టించుకోలేదని వివరించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!