YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 28 July 2012

దోచేస్తున్న హెరిటేజ్.రైతుల పొట్టగొడుతున్న బాబు డెయిరీ


రైతుల పొట్టగొడుతున్న బాబు డెయిరీ
చిత్తూరులో పాల మద్దతు ధరను రూ.3 దాకా తగ్గించిన వైనం
రోజుకు రూ.45 లక్షల మేర రైతుల సొమ్ముకు సిండికేట్ గండి
అవే పాలను అధిక ధరలకు అమ్ముకుంటున్న డెయిరీలు
లీటరుపై ఏడాది మొదల్లో రూ.2, 
ఇటీవలే మరో రూ. 2 పెంచిన హెరిటేజ్
కర్ణాటక సరిహద్దు రైతులకు మాత్రం ఎక్కువ చెల్లిస్తున్న వైనం
ఇదెక్కడి ఘోరమంటూ వాపోతున్న పాడి రైతులు

తిరుపతి-న్యూస్‌లైన్ ప్రతినిధి: తొమ్మిదేళ్లు సీఎంగా పేదల కోసం ఎంతగానో పాటుపడ్డానని పొద్దస్తమానం పదేపదే చెప్పుకునే చంద్రబాబు.. దశాబ్దాల తరబడి ప్రజా జీవితంలో కొనసాగుతున్న ప్రతిపక్ష నేత.. రైతు, ప్రజా సంక్షేమమే తన పరమావధంటూ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జోరుగా ప్రసంగాలు దంచేస్తున్న టీడీపీ అధ్యక్షుడు.. నిజానికి ఏం చేస్తున్నారో తెలుసా? అదే రైతులను, అందులోనూ సాక్షాత్తూ తన సొంత జిల్లావాసులనే అయినకాడికి, అడ్డంగా దోచేస్తున్నారు! సొంత కంపెనీ హెరిటేజ్ డెయిరీ ద్వారా పాడి రైతుల పొట్ట కొడుతున్నారు. చిత్తూరులో పాల సేకరణ ధరను ఏకంగా 3 రూపాయల దాకా బాబు కంపెనీ తాజాగా తగ్గించేసింది. పైగా ఇందుకోసం జిల్లాలోని ఇతర డెయిరీలతో కుమ్మక్కైంది. అలా సిండికేట్ దోపిడీకి పక్కాగా తెర తీసింది! హెరిటేజ్ అంటే వారసత్వమని ఒక అర్థం. సొంత డెయిరీ కోసం గతంలో బాబు చిత్తూరు విజయా డెయిరీ ఉసురు తీసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే హెరిటేజ్ ద్వారా జిల్లా పాడి రైతుల పొట్ట కొడుతూ, ఆ వారసత్వాన్ని దర్జాగా కొనసాగిస్తున్నారాయన! ముందు నుంచే పక్కా పథకం ప్రకారం ఆయన ఈ దిశగా పావులు కదిపారంటూ రైతులు మండిపడుతున్నారు. ఇందిర క్రాంతి పథం ఆధ్వర్యంలోని బీఎంసీలు సేకరణ ధరను తగ్గించేలా ‘తనదైన’ శైలిలో చక్రం తిప్పి, ఆనక హెరిటేజ్ సారథ్యంలో మిగతా డెయిరీలనూ అదే బాటన నడిపారంటూ వాపోతున్నారు. అధికారంలోకి వస్తే రైతులను అందలమెక్కిస్తానని ఓవైపు చెబుతూ, మరోవైపు ఇలా తమ పొట్ట కొట్టడం ఏమిటంటూ వారు సంధిస్తున్న ప్రశ్నకు బాబు వద్ద సమాధానమే లేదు. పైగా, ఈ ఏడాది మొదట్లోనే లీటరు పాల అమ్మకపు ధరను రూ.2 పెంచిన హెరిటేజ్.. ఇటీవలే మరో 2 రూపాయలు పెంచేసింది! ఇలా రైతుల పొట్టగొట్టి కారుచౌకగా పాలను సేకరిస్తూ, వాటిని అడ్డగోలు ధరలకు అమ్ముకుంటూ రెండువిధాలా లాభపడుతోంది బాబుగారి కంపెనీ. రెతులు, ప్రజలు, సంక్షేమం అంటూపైకి కల్లబొల్లి కబుర్లు చెబుతున్న బాబు.. వాస్తవానికి మాత్రం అటు పాడి రైతు పొట్ట కొడుతున్నారు. పైగా అవే పాలను హెచ్చు ధరలకు అమ్మి వినియోగదారులనూ దోచుకుంటున్నారు! 

చిత్తూరు జిల్లాలో 48 ప్రైవేట్ డెయిరీలు 15 లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్నాయి. ఇందులో హెరిటేజ్ ఒక్కటే రోజుకు 1.91 లక్షల లీటర్లు సేకరిస్తోంది. తర్వాతి స్థానంలో ఉన్న దొడ్ల, బాలాజీ వంటి డెయిరీలు అందులో సగమే సేకరిస్తున్నాయి. సంగం వంటి ఇతర డెయిరీల వాటా అంతకంటే చాలా తక్కువగా ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇందిర క్రాంతి పథం ద్వారా నడిచే బీఎంసీలు (బల్క్ మిల్క్ కలెక్షన్ సెంటర్లు) అన్నీ కలిపి మరో 3.37 లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్నాయి. పాల వ్యాపారంలో పోటీ వాతావరణం దృష్ట్యా ఇటీవలి దాకా జిల్లా రైతులకు లీటర్ పాలకు రూ.20 నుంచి రూ.22 దాకా గిట్టుబాటవుతూ వచ్చింది. కానీ నెల క్రితం జిల్లాలోని పాల డెయిరీలన్నీ హెరిటేజ్ ఆధ్వర్యంలో సిండికేట్‌గా మారాయి. రైతులకిచ్చే మద్దతు ధరను లీటరు మీద రూ.3 దాకా తగ్గించాయి. అంతకు మరో నెల క్రితమే బీఎంసీలు సేకరణ ధరను రూ.18.67 నుంచి రూ.19కి పరిమితం చేశాయి. దీని వెనక చంద్రబాబే చక్రం తిప్పారని రైతులు, రైతు సంఘాల నేతలు దుయ్యబడుతున్నారు. హెరిటేజ్ సేకరణ ధరను తగ్గించేందుకే ఈ ఎత్తుగడ వేశారని చిత్తూ జిల్లా రైతు సంఘం నాయకుడు ఆదికేశవులురెడ్డి తదితరులు ఘంటాపథంగా చెబుతున్నారు. బీఎంసీలను సాకుగా చూపుతూ హెరిటేజ్ ఆధ్వర్యంలో ప్రైవేట్ డెయిరీలన్నీ అనధికారికంగా సిండికేటై.. 8.5 ఎస్‌ఎన్‌ఎఫ్ (పాలలో చిక్కదనం), 4.5 శాతం వెన్న ఉన్న పాల సేకరణ ధరను లీటరుకు రూ.19కి తగ్గించడం కూడా అందుకు బలం చేకూరుస్తోంది. ఇలా ఈ ప్రైవేట్ డెయిరీలన్నీ కలిపి రోజుకు రూ.45 లక్షల దాకా రైతుల సొమ్ముకు గండి కొడుతున్నాయి. ఇలా సేకరించిన పాలను లీటరు రూ.36 నుంచి రూ.40 లెక్కన విక్రయిస్తున్నాయి. కర్ణాటకకు చెందిన పలు ప్రైవేట్ డెయిరీలేమో కుప్పం పరిసర ప్రాంతాల్లో లీటరు పాలకు రూ.21 నుంచి రూ.21.32 చొప్పున సేకరిస్తున్నాయి. అంతేకాదు.. చిత్తూరు జిల్లాలో రూ.19 మాత్రమే చెల్లిస్తున్న హెరిటేజ్, కర్ణాటక సరిహద్దు గ్రామాల నుంచి సేకరించే పాలకు మాత్రం లీటరుకు రూ.20 నుంచి రూ 20.62 దాకా చెల్లిస్తోంది! ఇదేమంటే.. ‘వర్షాకాలంలో పశువులకు పచ్చి గడ్డి సులువుగా అందుబాటులోకి వస్తుంది గనుక రైతులకు పాల ఉత్పత్తి ధర తగ్గుతుంది. అందుకే మేం కూడా మద్దతు ధర తగ్గిస్తున్నాం’ అంటోంది. పాడి రైతులేమో రూ.350 ధర ఉన్న 50 కిలోల పశువుల దాణా బస్తా ఇప్పుడు రూ.450కి పెరిగిందనీ, ఆగస్టు 1 నుంచి రూ.600 కానుందని తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ఈ దృష్ట్యా లీటరుకు కనీసం రూ.22 మద్దతు ధర చెల్లించకుంటే తాము బతకడం కష్టమంటున్నారు. రైతులను ఇంతగా దోచేస్తున్న డెయిరీలు ఏజెంట్లకు కూడా పెద్దగా కమీషన్ పెంచలేదని డీలర్లు చెబుతున్నారు.

వైఎస్ చొరవతో..

చంద్రబాబు కుటుంబం ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో హెరిటేజ్ డెయిరీ ప్రారంభం కావడంతో, అప్పటి దాకా రైతులను ఎంతగానో ఆదుకున్న విజయా డెయిరీని నాటి బాబు ప్రభుత్వమే పథకం ప్రకారం నిర్వీర్యం చేసింది. ఆ డెయిరీ మూతబడి, జిల్లాలో హెరిటేజ్ సామ్రాజ్యానికి ఎదురు లేకుండా పోవడంతో రైతులను కూడా అయిన కాడికి దోచుకుంటూ వచ్చింది. 2004 దాకా రైతుకు లీటరుకు రూ.12 నుంచి 14 మాత్రమే ధర లభించింది. 2004లో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక చిత్తూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా ఇందిర క్రాంతి పథంలో భాగంగా బీఎంసీలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా రైతులకు లీటరుకు రూ.20 దాకా మద్దతు ధర లభించేలా చేశారు. బాలాజీ డెయిరీ కూడా బీఎంసీలతో పోటీగా లీటరుకు రూ.20 నుంచి 22 దాకా ఇచ్చింది. దాంతో హెరిటేజ్ , మిగతా ప్రైవేట్ డెయిరీలు కూడా 8.5 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్, 4.5 శాతం వెన్న ఉన్న లీటరు పాలకు కనీసం రూ.20 చెల్లించక తప్పలేదు. కానీ తాజాగా బాబు మాయాజాలం సాయంతో హెరిటేజ్ సారథ్యంలో మిగతా ప్రైవేటు డెయిరీలు పాడి రైతు పొట్ట కొడుతున్నాయి.
కొసమెరుపు: చిత్తూరు పాడి రైతులను ప్రైవేట్ డెయిరీల మోసం బారి నుంచి రక్షించాలనే నినాదంతో కిరణ్‌కుమార్‌రెడ్డి స్పీకర్‌గా ఉండగా జిల్లాలో భారీ సంఖ్యలో బీఎంసీలను ఏర్పాటు చేశారు. ఇప్పుడాయన సీఎంగా ఉండి కూడా, సొంత జిల్లాలో ప్రైవేట్ డెయిరీలు చేస్తున్న ఈ దగాపై స్పందించరేమని పాడి రైతులు ప్రశ్నిస్తున్నారు.

దోచేస్తున్న హెరిటేజ్
అమలాపురం, న్యూస్‌లైన్: పాల అమ్మకపు ధరలు ఇష్టానికి పెంచేస్తున్న హెరిటేజ్ యాజమాన్యం, సేకరణ విషయంలో మాత్రం రైతుల పొట్టగొడుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో విశాఖ డెయిరీ ైరె తులకు నగదు బదిలీ పేరిట గతేడాది లీటరుకు రూపాయి చొప్పున ఇన్సెంటివ్ ఇచ్చింది. ఈ ఏడాది మరింత పెంచే అవకాశముంది. దానికి తోడు మరెన్నో ప్రోత్సాహాకాలు అందజేస్తోంది. పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. పాడి రైతులకు, పశువులకు ప్రమాద బీమా కల్పిస్తోంది. సబ్సిడీపై దాణా బస్తాలు, మందులు, సీజనల్ వ్యాధులు రాకుండా వ్యాక్సిన్లు అందజేస్తున్నారు. పాడి రైతుల పిల్లలకు ఉపకార వేతనాలందజేస్తోంది. రైతులకు ఎలాంటి అనారోగ్యాలొచ్చినా ఆపరేషన్లు కూడా చేయిస్తోంది. హెరిటెజ్ మాత్రం పాడి రైతులకు మేలు చేకూర్చే ఒక్క కార్యక్రమమూ చేయడం లేదు. కనీసం ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం లేదు!

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!