YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 25 July 2012

రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళితే.. జేబులు లూటీ

* రేపట్నుంచే అమల్లోకి..
* చుక్కలు చూపించనున్న సేల్ డీడ్ రుసుం
* ఇకపై ఆస్తి విలువలో 0.5% చెల్లించాలి
* ఈసీ కావాలంటే జేబు ఖాళీ చేయాల్సిందే
* చార్జీ రూ.120 నుంచి రూ.1,000 వరకు పెంపు
* మనింట్లో పెళ్లికి... సర్కారుకు రూ.200 కట్నం
* వివాహాల నమోదు ఫీజు 40 రెట్లు పెంపు
* లీజు, టైటిల్ డీడ్‌ల డిపాజిట్ రుసుం 0.1శాతం

హైదరాబాద్, న్యూస్‌లైన్: బాదుడే.. బాదుడు... భూములు, భవనాల రిజిస్ట్రేషన్ విలువలు పెంచడానికి ముందే ప్రజలపై మరో భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తాజాగా మరో ప్రధాన ఆదాయ వనరు.. రిజిస్ట్రేషన్ చార్జీలపై దృష్టి సారించింది. కొన్నిరకాల రిజిస్ట్రేషన్ చార్జీలను ఏకంగా 50 రెట్లు పెంచేసింది. భాగస్వామ్య రిజిస్ట్రేషన్లు, తనఖా ఒప్పందాలు వంటివి వీటిలో ఉన్నాయి. సేల్‌డీడ్, గిఫ్ట్‌డీడ్, సెటిల్‌మెంట్, జీపీఏలతో పాటు మరికొన్నిటికి ఇప్పటివరకు రూ.1,000 రుసుముగా చెల్లిస్తే సరిపోయేది. కానీ ఇకపై ఆస్తి విలువలో అరశాతం కట్టాల్సిందే. 

అలాగే ఇళ్లు, స్థలాల క్రయవిక్రయాలప్పుడు ప్రతి ఒక్కరూ తీసుకునే ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ) చార్జీలనూ ప్రభుత్వం భారీగా పెంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఏటా 7 లక్షలకు పైగా ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేసుకోవాల్సిన వివాహ నమోదు చార్జీ ఒకేసారి 40 రెట్లు పెంచింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త చార్జీలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయి. ఆగస్టు 1వ తేదీ నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంచేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తిచేసిన సంగతి తెలిసిందే.

భారీ ఆదాయంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. 14 రకాల రిజిస్ట్రేషన్ల చార్జీలు ప్రస్తుతం రూ.1,000 చొప్పున ఉండగా.. ఇకపై వీటికి విలువ ఆధారంగా ఫీజులు వసూలు చేయనుంది. ఎవరైనా ఒక వ్యక్తి తన కుమార్తెకు ఏకంగా కోటి రూపాయల విలువైన ఆస్తికి గిఫ్ట్‌డీడ్ చేసినా.. ప్రస్తుతం రూ.1,000 రుసుం చెల్లిస్తే చాలు. ఇక నుంచి అలా వీలుకాదు. ఆస్తి విలువలో అర శాతం రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా 14 రకాల రిజిస్ట్రేషన్లకు రూ. వెయ్యి ఫీజు స్థానే ఆస్తి విలువలో 0.5% రుసుం చెల్లించాల్సిందే. 

సేల్‌డీడ్ (ఆస్తిని విక్రయిస్తామంటూ చేసే అగ్రిమెంట్), గిఫ్ట్‌డీడ్, మార్పిడి, సెటిల్‌మెంట్, అమ్మకంతో కూడిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, అభివృద్ధి ఒప్పందంతో కూడిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, ఒప్పంద విడుదల, డిక్రీ తదితరాలకు ప్రస్తుతం రూ. వెయ్యి రుసుం మాత్రమే ఉంది. ఇక నుంచి ఆస్తుల విలువలో అరశాతం ఫీజు చెల్లించాలి. లీజు, తనఖా, టైటిల్ డీడ్ల డిపాజిట్ రుసుమును 0.1 శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది. సొసైటీల రిజిస్ట్రేషన్ రుసుమును రూ. 200 నుంచి రూ. 500కు పెంచింది. అప్పీళ్లు, డూప్లికేట్ కాపీల చార్జీ రూ. 100 నుంచి రూ. 300కు పెంచింది. ఇక ఇళ్లు, స్థలాల క్రయ,విక్రయాల్లో ప్రతి ఒక్కరికీ అవసరమైన ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ), దస్తావేజు నకళ్లు (సర్టిఫైడ్ కాపీ)ల ఫీజులు కూడా పెరిగాయి. 

ప్రస్తుతం ఈసీ (ఆస్తికి సంబంధించి గతంలో జరిగిన లావాదేవీల వివరాల కాపీ) కోసం ప్రస్తుతం రూ. 120 చెల్లిస్తే సరిపోతుంది. ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చేసింది. కాలాన్ని బట్టి ఈసీల కోసం మూడు రకాల ఫీజులు నిర్ణయించింది. 13 ఏళ్లలోపు లావాదేవీల వివరాలతో ఈసీ కావాలంటే రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. 13- 30 ఏళ్ల మధ్య లావాదేవీలకు రూ.500, 30 ఏళ్లు, అంతకంటే ఎక్కువ కాలానికి వెయ్యి రూపాయల రుసుం చెల్లించాలి. వివాహ రిజిస్ట్రేషన్ రుసుం రూ.5 నుంచి ఏకంగా రూ.200కు పెరిగింది. ప్రతి వివాహాన్ని తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలనే సుప్రీంకోర్టు ఆదేశాలను ఆసరాగా తీసుకుని ప్రభుత్వం నమోదు రుసుం భారీగా పెంచింది. 

సవరణ ఫీజులు, వీలునామాల భద్రతా రుసుం 50 రెట్లు 
రిజిస్ట్రేషన్ సమయంలో దిక్కులు, ఇంటిపేర్లు, ఉప నంబర్లు లాంటి అంశాల్లో ఎక్కడైనా తప్పుగా నమోదైతే తర్వాత సవరించుకునే (రెక్టిఫికేషన్) అవకాశం ఉంది. ఆస్తివాటాదారుల్లో ఎవరైనా ఒకరు విధిలేని పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ సమయానికి రాలేకపోతే పలానా తేదీన వచ్చి సంతకాలు చేస్తామంటూ ఒప్పుదల (రాటిఫికేషన్) ఒప్పందం చేసుకునే వెసులుబాటూ ప్రస్తుతం ఉంది. ఆస్తికి సంబంధించి వివాదం ఉన్నా, సర్టిఫికెట్లలో లోపాలు ఉన్నా రిజిస్ట్రేషన్ తర్వాత దానిని రద్దు (క్యాన్సిలేషన్) చేసుకునే అవకాశం కూడా రిజిస్ట్రేషన్ శాఖలో ఉంది. అయితే ఈ మూడు రకాల ఫీజులను ప్రభుత్వం ఏకంగా 50 రెట్లు పెంచేసింది. వీటికి ప్రస్తుతం రూ.100 రుసుం ఉండగా రూ.5 వేలకు పెంచేసింది. చరాస్తుల తనఖా ఒప్పంద రుసుం కూడా రూ.100 నుంచి రూ.5 వేలకు పెరిగింది. 

అటెస్టేషన్ ఆఫ్ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ, విక్రయ హక్కులు లేని జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, సెలవు దినాల్లో రిజిస్ట్రేషన్, భాగస్వామ్య ఒప్పందాలకు సంబంధించిన రుసుం ప్రస్తుతం రూ.100 నుంచి రూ.500 లోపు ఉండగా రూ.5 వేలకు పెరిగింది. సీల్డుకవర్లలో వీలునామాలను భద్రపరిచేందుకు ప్రస్తుతం రూ.100 రుసుం ఉండగా ఇది కూడా రూ.5 వేలకు పెరిగింది. హక్కుదారు కదలలేని పరిస్థితుల్లో ఉంటే రిజిస్ట్రేషన్ పత్రాలపై సంతకం పెట్టించుకునేందుకు సబ్‌రిజిస్ట్రారు కార్యాలయ సిబ్బంది ఇంటికి వచ్చే వెసులుబాటు ఉంది. దీనినే ప్రైవేటు అటెండెన్స్ అంటారు. దీనికి ప్రస్తుత రుసుం రూ. 500 కాగా ఇది రూ. 5 వేలకు పెరిగింది. 

భారీగా పెరిగిన చార్జీలపై సబ్ రిజిస్ట్రార్లతోపాటు స్టాంపులు , రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘చార్జీలు పెంచవచ్చుగానీ 40 శాతం, 50 శాతం పెంచడం దారుణం. సవరణ, రద్దు ఫీజులను కూడా 50 రెట్లు పెంచితే జనం రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు రావాలంటేనే భయపడతారు. దీనివల్ల ఒప్పందాల రిజిస్ట్రేషన్లు తగ్గిపోతాయి. రిజిస్ట్రేషన్ చేసుకోని ఒప్పందాలు పెరిగిపోతాయి. ఇది ప్రభుత్వానికే నష్టం’ అని రాష్ట్ర సబ్ రిజిస్ట్రార్ల సంఘం ప్రతినిధి ‘న్యూస్‌లైన్’తో అన్నారు. 

రిజిష్ట్రేషన్ల శాఖ రెవెన్యూ టార్గెట్ 6700 కోట్లు: మంత్రి 
తిరుమల, న్యూస్‌లైన్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రూ.6,700 కోట్ల ఆదాయం లక్ష్యంగా నిర్ధారించుకున్నట్లు ఆ శాఖ మంత్రి తోట నరసింహం తెలిపారు. బుధవారం మంత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకుని స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ వివాహ రిజిస్ట్రేషన్ చేసుకున్న నూతన వధూవరులకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బుధవారం నుంచి రాష్ట్రంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈసీ, సీసీలు నిలిపివేశామని, వీటిని మీసేవ కార్యాలయాల్లో పొందవచ్చని మంత్రి వెల్లడించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!