YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 24 July 2012

జగన్ విషయంలో శంకర్రావు లేఖ రాస్తే హైకోర్టు స్వీకరించి సీబీఐ విచారణకు ఆదేశించింది విజయమ్మ పూర్తి ఆధారాలతో పిల్ వేస్తే తిరస్కరించారు

జగన్ విషయంలో శంకర్రావు లేఖ రాస్తే హైకోర్టు స్వీకరించి సీబీఐ విచారణకు ఆదేశించింది
విజయమ్మ పూర్తి ఆధారాలతో పిల్ వేస్తే తిరస్కరించారు
విచారణల నుంచి తప్పించుకొని తిరగడమే చంద్రబాబు నైజం
సుప్రీంకోర్టు సూచనల ప్రకారం బాబుపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తాం

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘న్యాయం అనేది ఒకచోట ఒకవిధంగా మరోచోట మరో విధంగా ఉంటోంది... న్యాయస్థానాలు విభిన్నంగా తీర్పులు ఇవ్వడంవల్ల గందరగోళం నెలకొంటోంది..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆస్తుల విషయంలో మాజీ మంత్రి శంకర్రావు లేఖ రాస్తే దాన్ని స్వీకరించి హైకోర్టు.. సీబీఐ విచారణకు ఆదేశించింది. వాస్తవానికి ఆ రోజు జగన్‌పై దర్యాప్తు సంస్థలకు ఎవరూ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అదే చంద్రబాబుపై విజయమ్మ పూర్తి ఆధారాలతో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేస్తే హైకోర్టు.. తొలుత సీబీఐ, ఈడీ దర్యాప్తునకు ఆదేశించింది. ఆ తర్వాత బాబు బినామీలు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడి నుంచి మళ్లీ హైకోర్టుకు వచ్చినపుడు విచారణను నిలిపి వేశారు. విజయమ్మ సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్తే ముందుగా కిందిస్థాయిలో దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయండి.. వారు స్పందించ పోతే అపుడు మా దగ్గరికి రండి అన్నారు. అంతేకాదు.. ఈ కేసు రాజకీయ ప్రేరేపితం కనుక తాము తల దూర్చలేమని భావిస్తూ తోసిపుచ్చారు. ఇలా కొన్నింటిని న్యాయస్థానాలు స్వీకరిస్తున్నాయి. మరికొన్నింటిని తోసిపుచ్చుతున్నాయి...’’ అని వాసిరెడ్డి పద్మ అన్నారు. ‘‘శంకర్రావు రాసిన లేఖనే పిటిషన్‌గా స్వీకరించారు.

కానీ 2,400 పైచిలుకు పేజీలతో పూర్తి ఆధారాలు సేకరించి విజయమ్మ పిటిషన్ వేస్తే తిరస్కరించారు. రాష్ట్ర హైకోర్టులో జగన్‌పై కింది స్థాయి దర్యాప్తు సంస్థలకు ఎలాంటి ఫిర్యాదు లేకుండానే విచారణకు ఆదేశించారన్న విషయం రాంజెఠ్మలానీ సుప్రీంకోర్టు దృష్టికి తెస్తే అలా జరగడం దురదృష్టకరమని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు..’’ అని పద్మ వివరించారు. సుప్రీంకోర్టు తన తీర్పులో చంద్రబాబుకు క్లీన్‌చిట్ ఇవ్వలేదని, ఈ అవినీతి ఆరోపణలతో ముందుగా దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలని సూచించిందని తెలిపారు. కానీ టీడీపీ నేతలు మాత్రం దాన్ని వక్రీకరించి ప్రచారం చేసుకుంటున్నారని తప్పుపట్టారు. చంద్రబాబుపై వచ్చిన ఏ అవినీతి ఆరోపణలపైనా పూర్తిగా దర్యాప్తు పూర్తి కాలేదని, దర్యాప్తులు జరగకుండా చంద్రబాబు కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకోవడమో లేదా సాంకేతిక కారణాలతో కేసులను ఉపసంహరించడమో జరిగిందని ఆమె గుర్తు చేశారు. విచారణలను తప్పించుకొని తిరగడమే చంద్రబాబు నైజమని మండిపడ్డారు.

మరి ఇన్నాళ్లూ ‘క్లీన్‌చిట్’ అని ఎందుకు చెప్పుకున్నారు?

‘‘క్లీన్‌చిట్ అనే పదమే కోర్టు పరిభాషలో లేదని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చెబుతున్నారు. మరి అలాంటపుడు వారు ఇన్నాళ్లూ వాళ్ల నాయకుడికి కోర్టులు క్లీన్‌చిట్ ఇచ్చాయని ఎలా చెప్పుకున్నారు’’ అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పును తాము తప్పుగా ప్రచారం చేస్తున్నామని చెబుతున్న టీడీపీ నాయకులు.. వారి పార్టీకి వత్తాసు పలికే పత్రికలను కాకుండా ‘హిందూ’ వంటి ఆంగ్ల పత్రికలు చూస్తే వాస్తవాలు బోధపడతాయని సూచించారు. చంద్రబాబుపై అవినీతి ఆరోపణలను దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలని సుప్రీంకోర్టు సూచించిందే తప్ప అందులో ఆధారాలు లేవని చెప్పలేదని పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలన అంతా అవినీతిమయమేనని, ఆయనపై విచారణ జరిగేంత వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వదిలి పెట్టబోదని స్పష్టంచేశారు. తాత్కాలికంగా కోర్టుల ద్వారా ఊరట పొందుతూ.. ఎప్పటికపుడు తప్పించుకు తిరగవచ్చు గానీ అంతిమంగా శిక్ష అనుభవించక తప్పదన్నారు. చంద్రబాబు తనకు తాను విచారణకు సిద్ధపడితే మంచిదని సూచించారు. ఆయన అవినీతిపై వెనక్కు తగ్గేది లేదని, సుప్రీంకోర్టు సూచనలకు అనుగుణంగా దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!