రాష్ట్రాన్ని అయ్యవార్లంగారి నట్టిల్లుగా మార్చడమే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంలా కనిపిస్తోంది. ఇప్పటికే మన సర్కారు కరెంట్ నిర్వాకం పుణ్యమాని రాష్ట్రంలో పరిశ్రమలు పీకల్లోతు కష్టాల్లో ములిగిపోయాయి. అకాల వర్షాల కారణంగా రైతన్న మరోసారి కుదేలయ్యాడు. ఆకుమళ్లు కుళ్లిపోతున్నాయని కొందరూ- నారు వేసుకోడానికి వానలు అడ్డం వచ్చాయని మరికొందరూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ విద్యాలయాలూ, వైద్యాలయాల పనితీరు ఏనాటినుంచో మొక్కుబడి వ్యవహారాలుగా మారిపోయాయి. ఇకవైఎస్‌ఆర్ కలలుకన్న జలయజ్ఞంలాంటి భారీ పథకాల అమలు ఈ చేతగాని సర్కార ునుంచి ఎలాగూ ఆశించలేం. కనీసం వానలకు పెల్లుబికిన మురిక్కాలవలను కంట్రోలు చెయ్యడం కూడా ఈ సర్కారుకు సాధ్యం కాకుండా పోయింది!
ఇలాంటి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో సరుకుల సరఫరాకు బదులుగా ‘నగదు బదిలీ పథకం’ ప్రవేశపెడతానని తగుదునమ్మా అంటూ ముందుకువస్తే ఎలా నమ్మడం? ఇది పథకం కాదనీ, పెద్ద కుట్ర అనీ విమర్శలు చెలరేగుతున్నాయి. వైఎస్‌ఆర్ పట్టుపట్టి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా రాష్ట్ర ప్రభుత్వం నీరు కారుస్తోందని జనం ఘోషిస్తున్నారు. 104-108 లాంటి సేవలను దశలవారీగా ఉపసంహరించడంతో మొదలయిన ఈ నమ్మకద్రోహం ఇప్పుడు పరాకాష్టకు చేరుకుంది. రేషన్ షాపుల ద్వారా సరుకుల సరఫరాను కూడా ఇదే పద్ధతిలో - అంచెలంచెలుగా- ఉపసంహరించే కుట్ర మొదలయిపోయింది. ఈ క్రమంలో తొలి అడుగే ‘నగదు బదిలీ పథకం’.
వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మన రాష్ట్రంలో అమలు జరిగినన్ని సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలుకాలేదు. సాక్షాత్తూ ప్రధానమంత్రి అంతటివాడు -స్వయంగా గొప్ప ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్- వైఎస్‌ఆర్ దేశానికంతటికీ ఆదర్శప్రాయుడయిన ముఖ్యమంత్రి అని కీర్తించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన స్థాయిలో ఆలోచించే శక్తి సామర్థ్యాలు ప్రస్తుతం గద్దెమీద కూర్చుని ఉన్న మరుగుజ్జులకు ఎలాగూ లేవు. వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన పథకాల అమలును మెరుగుపరచడం వాళ్ల సత్తాకు మించినపని. కనీసం ఉన్నది ఉన్నట్లుగా ఈ పథకాలను అమలు చెయ్యడానికి ఏం తీపడం?
2009 ఎన్నికల సందర్భంగా ఈ నగదు బదిలీ పథకం వార్తల్లోకి వచ్చింది. ఈ పథకాన్ని నారా చంద్రబాబు నాయుడు పుత్రరత్నం లోకేష్ ‘కనిపెట్టాడని’ అప్పట్లో ఎల్లో మీడియా ఎంత డప్పుకొట్టినా, ఫలితం లేకపోయింది. ఇంతకీ నగదు బదిలీ పథకం లోకేష్ పుర్రెకు పుట్టిన బుద్ధేంకాదు. దక్షిణ అమెరికాలోని బ్రిజిల్ లాంటి కొన్ని దేశాలు దాదాపు దశాబ్ద కాలంగా ఇలాంటి పథకాలను అమలు చేస్తున్నాయి. ప్రపంచ బ్యాంకుకు బుద్ధీ, ఆత్మా కూడా తాకట్టు పెట్టిన ప్రపంచీకరన మేధావులు కొందరు ఈ పథకం అద్భుతంగా అమలయిందని కితాబులివ్వగా ఆయాదేశాల సామాన్య జనం మాత్రం ఈ పథకాన్ని ఎత్తిపారేయండి మహాప్రభో అని మొత్తుకుంటున్నారు. అక్కడి ప్రజాపంపిణీ వ్యవస్థను పందికొక్కులు దోచుకుతింటున్న నేపథ్యంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టాల్సి వచ్చిందని బ్రెజిల్ దేశాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆంద్రూ మిషాల్ నిర్ణయించారట. ఆదిత్య చక్రవర్తి అనే ఒక భారతీయ కాలమిస్ట్ రాసిన వ్యాసం చదివిన తర్వాతే తనకీ ఆలోచన వచ్చిందని మిషాల్ చెప్పాడట. ఇది జరిగింది 2003లో. మన లోకేష్ బాబు మిషాల్ దగ్గిర నుంచి ఈ అవిడియా -కాస్త ఆలస్యంగా- కొట్టేసి ఉండొచ్చు. కానీ, జనం మాత్రం ఈ కాపీ ఐడియాకు బొక్కబోర్లా పడిపోలేదు. 2009 ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం.
ఇంతకీ, మన ప్రజాపంపిణీ వ్యవస్థ -బ్రెజిల్‌లో మాదిరిగా- బాగుచెయ్యడానికి వీల్లేనంతగా కుళ్లిపోలేదు. సమర్థుడయిన నేత మార్గ దర్శకత్వంలో ఈ వ్యవస్థ కీలక పాత్ర వహించగలిగే అవకాశం ఇప్పటికీ ఉంది. ఆ సామర్థ్యం అలవర్చుకునే ప్రయత్నం పక్కనపెట్టి, నగదు బదిలీ లాంటి అతి తెలివి పథకాలను అమలుయ్యాలనుకోవడంలో అర్థం ఉందా? ఈ నగదు బదిలీ పథకానికి వ్యతిరేకంగా తిరుపతి పట్టణంలో మొదలయిన నిరసన వెల్లువ త్వరలోనే రాష్టాన్ని అంతటినీ కమ్మేస్తుందనడంలో సందేహం లేదు.
No comments:
Post a Comment