YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 23 July 2012

జనసంద్రమై నినదించిన సిరిసిల్ల... విజయమ్మ ధర్నాకు మద్దతు

* ఆద్యంతం వెల్లువెత్తిన ప్రజాదరణ
* ఆప్యాయంగా అక్కున చేర్చుకున్న మహిళలు
* జిల్లా నలుమూలల నుంచీ భారీగా తరలివచ్చిన నేతన్నలు, ప్రజలు
* వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలి ప్రసంగానికి అద్భుత స్పందన
* చేనేత సమస్యలను సోదాహరణంగా ప్రస్తావించిన విజయమ్మ
* వారి సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంపై నిప్పులు
* చేనేత కార్మికులకు వైఎస్ చేకూర్చిన లబ్ధిని గుర్తు చేసినప్పుడల్లా హర్షధ్వానాలు
* ఆయన వాగ్దానాలన్నింటినీ జగన్ నెరవేరుస్తారన్న వ్యాఖ్యలకూ భారీ స్పందన
* దీక్షను అడ్డుకునేందుకు ఆద్యంతం విఫలయత్నం చేసిన టీఆర్‌ఎస్
* నేడు విద్యాసంస్థల బంద్‌కు, నిరసనలకు తెలంగాణ జేఏసీ పిలుపు

సిరిసిల్ల నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: నేత కార్మికుల సమస్యలను ఎత్తి చూపుతూ, వారి దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన నేతన్న దీక్ష పూర్తిగా విజయవంతమైంది. భారీ సంఖ్యలో దీక్షలో పాల్గొని, నేతన్నలు పెట్టిన పొలికేక పాలకుల చెవుల్లో ప్రతిధ్వనించింది. నేత కార్మికులతో పాటు స్థానికులు కూడా ఉత్సాహంగా తరలి వచ్చారు. విజయమ్మ ధర్నాకు పూర్తి మద్దతు ప్రకటించారు. జిల్లాలోని పలు ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు స్వచ్ఛందంగా రావడం కన్పించింది. 

ధర్నాను ఎలాగైనా అడ్డుకునేందుకు, అడుగడుగునా ఆటంకాలు కలిగించేందుకు టీఆర్‌ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు పట్టించుకోకుండా కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. టీఆర్‌ఎస్ ఏకంగా సిరిసిల్ల బంద్‌కు పిలుపునిచ్చినా ధర్నా దిగ్విజయంగా జరిగిన తీరు వైఎస్సార్‌సీపీ నేతలతో పాటు శ్రేణుల్లో కూడా ఉత్సాహం నింపింది. సంక్షోభంలో ఉన్న నేతన్నల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి ప్రముఖంగా తీసుకెళ్లడంలో విజయమ్మ విజయం సాధించారన్న వ్యాఖ్యలు సభికుల నుంచే విన్పించాయి. తెలంగాణ సంక్షేమానికి వైఎస్సార్ కాంగ్రెస్ క ట్టుబడి ఉందన్న ఆమె ప్రకటనకు కూడా పెద్ద ఎత్తున స్పందన లభించింది. 

విజయమ్మ కాన్వాయ్‌కి టీఆర్‌ఎస్ కార్యకర్తల నుంచి అక్కడక్కడా నిరసనలు కూడా ఎదురయ్యాయి. కాన్వాయ్ చేరగానే, సమీపంలోని అయ్యప్పగుడిలో ముందే దాక్కుని ఉన్న కొందరు టీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డంగా వచ్చి నినాదాలు చేశారు. తూముకుంట వద్దా అలాగే జరిగినా పోలీసులు అప్రమత్తమై వారిని అడ్డు తొలగించారు. సిద్దిపేట బైపాస్ రోడ్డు మీదుగా సిరిసిల్ల వైపు వెళ్తుండగా కూడా అడ్డుకోవడానికి టీఆర్‌ఎస్ కార్యకర్తలు తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. కాన్వాయ్‌కు అడ్డు రావడమే గాక కొందరు రాళ్లు రువ్వడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు. బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. మార్గమధ్యలో ఇమాంపేట, జక్కాపూర్ ప్రాంతాల్లో కూడా కాన్వాయ్‌పై దూరం నుంచి రాళ్లు రువ్వారు.

వేచిచూసిన అభిమానం..
టీఆర్‌ఎస్ అడ్డంకుల నేపథ్యంలో విజయమ్మ మూడు గంటలు ఆలస్యంగా ధర్నా శిబిరానికి చేరుకున్నా ప్రజలు ఓపిగ్గా వేచి ఉన్నారు. ఆమె రాకకు చాలా ముందుగానే సభాస్థలి కిక్కిరిసిపోయింది. టీఆర్‌ఎస్ నేతలు కొద్ది రోజులుగా ఎన్ని విమర్శలు గుప్పిస్తూ వచ్చినా విజయమ్మ మాత్రం తన ప్రసంగంలో ఎక్కడా వారిపై ప్రతి విమర్శలు చేయకపోవడం అందరినీ ఆకట్టుకుంది. దాదాపు అరగంట పాటు సాగిన ప్రసంగంలో ఆసాంతం చేనేతలు, రైతు సమస్యలనే ఆమె ప్రస్తావించారు. నేతన్నలపై, రైతన్నలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సోదాహరణంగా ఎత్తి చూపుతూ ఎండగట్టారు. 

‘‘చేనేత ఉత్పత్తుల వ్యయానికి, కార్మికులకు గిట్టుబాటవుతున్న ధరకు పొంతనే లేదు. అన్నం పెట్టే రైతుతో సమానంగా నేతన్నలు కూడా ఆపదలో పడ్డారు. కుల వృత్తిని వదులుకోలేక గుజరాత్, మహారాష్ట్రలకు వలస పోవడమో, ఆత్మాభిమానం చంపుకోలేక బలవన్మరణానికి పాల్పడటమో చేయాల్సిన దుస్థితి నెలకొంది’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. నేత కార్మికుల రుణ మాఫీకి బడ్జెట్‌లో రూ.312 కోట్లను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేటాయించినా ఈ ప్రభుత్వానికి మనసు, మానవత్వం లేక వాటిని ఇప్పటికీ విడుదల చేయలేదన్న విజయమ్మ వ్యాఖ్యలకు బాగా స్పందన లభించింది. చేనేత కార్మికుల సంక్షేమానికి, ప్రత్యేకించి సిరిసిల్ల నేతన్నలకు లబ్ధి కలిగేలా వైఎస్ తీసుకున్న పలు నిర్ణయాలను ఆమె గుర్తు చేశారు. వైఎస్‌కు నేత వస్త్రాలంటే చాలా ఇష్టమని, ఆయన పేరు చెప్పగానే ఆకట్టుకునే అచ్చ తెలుగు పంచె కట్టే గుర్తుకొస్తుందని విజయమ్మ అనగానే సభికులు పెద్ద ఎత్తున చప్పట్లతో స్పందించారు. జగన్ బయట ఉంటే దీక్షకు ఆయనే వచ్చి ఉండేవారన్నప్పుడు కూడా విపరీతమైన స్పందన లభించింది. 

చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి గత ఫిబ్రవరిలో జగన్ విపరీతమైన జ్వరం మధ్యే ధర్మవరంలో రెండు రోజుల పాటు దీక్ష చేశారని విజయమ్మ గుర్తు చేశారు. జ్వరముందిగా అని తానన్నా, ‘‘ఫరవాలేదమ్మా. ఈ రెండు రోజుల దీక్ష వల్ల ప్రభుత్వం స్పందించి నేతన్నకు ఏ కొంచెం మేలు జరిగినా మనం సంతోషపడాల్సిన విషయమేగా’’ అని చెప్పారని గుర్తు చేసుకున్నారు. ‘జగన్ త్వరలోనే వస్తారు. మీ మధ్యలోనే ఉంటూ మీ సమస్యల పరిష్కారానికి పోరాడతారు’ అని ఆమె అనగానే పెద్దపెట్టున హర్షధ్వానాలు విన్పించాయి.

విజయమ్మతో కరచాలనం చేసేందుకు..
సిరిసిల్ల ధర్నాలో మహిళలు విజయమ్మను ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నారు. విజయమ్మ ధర్నా వేదికపై ఉన్నంతసేపూ ఆమెను దగ్గరగా చూసేందుకు స్థానిక మహిళలు విపరీతంగా తోసుకొచ్చారు. విద్యార్థినులతో పాటు గృహిణులు కూడా ఆమె వద్దకు వెళ్లేందుకు, కరచాలనం చేసేందుకు ఉబలాటపడ్డారు. ప్రసంగాన్ని కూడా ఆద్యంతం ఆసక్తిగా విన్నారు. నేతన్నల బాధలను ప్రభుత్వం దృష్టికి తేవడం కోసం జగన్ సూచన మేరకు వచ్చానని విజయమ్మ చెప్పగానే వారి నుంచి పెద్దఎత్తున హర్షధ్వానాలు వినిపించాయి. 

సోమవారం ఉదయం ఏడింటికి హైదరాబాద్ నుంచి బయల్దేరిన మార్గమధ్యంలో అనేక చోట్ల జనం ఆమెకు బ్రహ్మరథం పట్టారు. పలు చోట్ల వైఎస్ విగ్రహాలకు విజయమ్మ పూలమాల వేసి నివాళులర్పించినప్పుడల్లా వైఎస్సార్ అమర్ హై, జై జగన్ నినాదాలు మిన్నంటాయి. మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్ వద్ద కొండా సురేఖ, కొండా మురళి దంపతులు విజయమ్మను కలిసి ఆమెతో పాటు ప్రయాణించారు. కొమురవెల్లి చౌరస్తా వద్ద కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో జనం ఆమెకు స్వాగతం పలికారు. మల్లన్న ఆలయ దర్శనానంతరం సిద్ధిపేటలో తెలంగాణ అమరవీరుల స్తూపానికి ఆమె నివాళులర్పించారు.

నేతల ప్రసంగాలకు కూడా..
వైఎస్సార్‌సీపీ నేతల ప్రసంగాలకు కూడా మంచి స్పందన లభించింది. ధర్నాను భగ్నం చేసేందుకు టీఆర్‌ఎస్ వెచ్చించిన సమయంలో పదో వంతును చేనేత కార్మికుల సమస్యల పరిష్కారంపై పెడితే వారి పరిస్థితి ఎప్పుడో మెరుగై ఉండేదని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ అనగానే భారీగా చప్పట్లు వినిపించాయి. దీక్షను అడ్డుకునే ప్రయత్నాలను ప్రస్తావిస్తూ, సహనానికి కూడా హద్దుంటుందని గుర్తుంచుకోవాలని ఆమె హెచ్చరించారు. నేతన్నల సమస్యపై చేపట్టిన ధర్నాకు తెలంగాణవాదంతో ముడిపెట్టజూడటం టీఆర్‌ఎస్ దిగజారుడుతనానికి నిదర్శనమని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కేకే మహేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. 

ధర్నాను అడ్డుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తనయుడు కేటీఆర్ 10 రోజులుగా సిరిసిల్లలోనే మకాం వేసి మరీ సర్వశక్తులూ ఒడ్డారు. ఎంపీ విజయశాంతి, రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం, విద్యావంతుల వేదిక ప్రతినిధులతో పాటు టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, కె.విద్యాసాగర్‌రావు, చెన్నమనేని రమేశ్, సోమారపు సత్యనారాయణ, మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మికాంతరావు తదితరులు కూడా మోహరించారు. బాల్క సుమన్ నేతృత్వంలో టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నేతలతో పాటు ఓయూ విద్యార్థి నాయకులను కూడా సిరిసిల్లకు రప్పించి ధర్నా భగ్నానికి పడరాని పాట్లు పడ్డారంటూ వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శిస్తున్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!