YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 24 July 2012

తేల్చకుంటే సర్కారుకు రాం రాం

కాంగ్రెస్‌కు ఎన్సీపీ హెచ్చరిక
మహారాష్ట్రలోనూ ప్రభావం ఉండగలదు
కోర్కెల చిట్టా ఏమీ లేదన్న ప్రఫుల్ పటేల్
భాగస్వాముల అభిప్రాయాలకు 
గుర్తింపు లేదని ఆరోపణ

న్యూఢిల్లీ: యూపీఏలో చెలరేగిన ప‘వార్’ అమీతుమీ తేల్చుకునే స్థాయికి చేరుకుంది. యూపీఏ సంకీర్ణ భాగస్వాములతో సమన్వయ కమిటీ ఏర్పాటు, భాగస్వామ్య పార్టీలకు సరైన గౌరవం తదితర డిమాండ్లపై బుధవారంలోగా తేల్చకుంటే ప్రభుత్వం నుంచి తప్పుకుంటామని కాంగ్రెస్‌ను హెచ్చరించింది. కేంద్రంలో తాము తప్పుకుంటే, ఆ ప్రభావం మహారాష్ట్రలోనూ ఉండగలదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సూచనప్రాయంగా హెచ్చరించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ నేతృత్వంలోని మంత్రివర్గం నుంచి తప్పుకునేందుకే అక్కడి తమ పార్టీ నేతలు మొగ్గు చూపుతున్నారని ఆయన చెప్పారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్సీపీ పదమూడేళ్లుగా భాగస్వామిగా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, యూపీఏలోని కాంగ్రెసేతర పార్టీలన్నీ తమ డిమాండ్ల పట్ల సానుకూలంగానే స్పందిస్తున్నాయని పేరు వెల్లడించేందుకు నిరాకరించిన ఎన్సీపీ నేత ఒకరు చెప్పారు. యూపీఏలోని మిగిలిన పార్టీలతో తమ పార్టీ సంప్రదింపులు కొనసాగిస్తోందని ఆయన తెలిపారు. ప్రధాని మన్మోహన్ సింగ్‌కు, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖలో తమ అధినేత పవార్ లేవనెత్తిన సమస్యలపై కాంగ్రెస్ కూడా తెరవెనుక మంతనాలు సాగించిందన్నారు. తమది బాధ్యతాయుతమైన పార్టీ అని, వరుసగా రెండు కేబినెట్ సమావేశాలకు గైర్హాజరవడం పవార్ వంటి స్థాయి గల నేతలకు తగదని అన్నారు. 

పవార్ త్వరలోనే తన రాజీనామాపై సస్పెన్స్‌కు తెరదించనున్నారని చెప్పారు. అందుకే తమ డెడ్‌లైన్ బుధవారంతోనే ముగియనుందని స్పష్టం చేశారు. కాగా, పవార్‌కు కేబినెట్‌లో ‘నంబర్ టూ’ స్థానం కోసమే కాంగ్రెస్‌పై ఎన్సీపీ ఒత్తిడి పెంచుతోందనే వార్తలను ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ మరోసారి తోసిపుచ్చారు. యూపీఏ భాగస్వామ్య పార్టీల మధ్య మరింత సమన్వయం, భాగస్వామ్య పార్టీలకు తగిన గౌరవం తదితర సమస్యల పరిష్కారం కోసమే తాము పట్టుబడుతున్నామని చెప్పారు. పవార్ కుమార్తె సుప్రియా సూలేకు కేబినెట్‌లో చోటు కోసమే ఎన్సీపీ ఈ పరిస్థితిని సృష్టించిందనే ఆరోపణలను కూడా ఆయన తోసిపుచ్చారు.

ఎన్సీపీ వద్ద కోర్కెల చిట్టా ఏమీ లేదని తేల్చిచెప్పారు. తాము మరిన్ని శాఖలను కోరుకోవడం లేదని అన్నారు. ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీల అభిప్రాయాలకు గుర్తింపు ఉండటం లేదని, అవి వాటికి కేటాయించిన శాఖల నాలుగు గోడలకే పరిమితం కావాల్సి వస్తోందని ఆరోపించారు. అధికారంలో కూడా భాగస్వామ్య పార్టీలకు న్యాయమైన వాటా దక్కడం లేదని, గవర్నర్ల నియామకం వంటి కీలక అంశాల్లో ప్రభుత్వం ఎలాంటి సంప్రదింపులు జరపడం లేదని ఆరోపించారు. మహారాష్ట్ర గవర్నర్ నియామకంపై మీడియాలో వార్తలు వచ్చాకే తమకు తెలిసిందని చెప్పారు. మహారాష్ట్రలో పృథ్వీరాజ్ చవాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కాంగ్రెస్-ఎన్సీపీ సమన్వయ కమిటీ సమావేశం ఒక్కసారైనా ఏర్పాటు కాలేదన్నారు. మహారాష్ట్రలో సైతం కార్యదర్శుల నియామకం వంటి అంశాల్లో ఎన్సీపీ మంత్రులతో ముఖ్యమంత్రి సంప్రదింపులు జరపడం లేదని ఆరోపించారు. పైగా, ముఖ్యమంత్రి మద్దతుదారులు ఎన్సీపీ మంత్రులపై బురదచల్లే ప్రచారం సాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని సాగునీటి రంగంపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండు చేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!