మహబూబ్ నగర్, పరకాల ఉప ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆలోచన, వ్యవహార తీరు మారుతోందా అనే అనుమానాలు పలువురి మదిలో మెదులుతున్నాయి. మహబూబ్ నగర్ ఉప ఎన్నికలో బీజేపీ చేతిలో అన్యూహ్యంగా ఓటమి పాలు కావడం, పరకాల ఉప ఎన్నికలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి కొండా సురేఖ చేతిలో ఓటమి అంచులను చూసిన టీఆర్ఎస్ పార్టీ రాజకీయ వ్యూహం మార్చకున్నట్టు కనిపిస్తోంది. ఉద్యమ స్పూర్తితో ప్రజలకు చేరువైన టీఆర్ఎస్.. పండగ, పబ్బానికి.. తూతూ మంత్రంగా.. ఎన్నికలు, సీట్లు ప్రధాన లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణవాదులే మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఓ లక్ష్యం కోసం ఉద్యమాన్ని నడిపే సంస్థలు, పార్టీలు అందర్ని కలుపుకుని పోయి.. పటిష్టంగా తయారవ్వడం చూశాం. అయితే ఇందుకు భిన్నంగా టీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరు అందరికి సందేహం కలిగిస్తోంది.
ఆర్ధిక అసమానతలు, ప్రజ, ప్రాంతీయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ అలసత్వం, నిర్లక్షం తదితర అంశాలు ఏ ఉద్యమం వెనుకనైనా ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ఏకైక లక్ష్యం తెలంగాణ ఏర్పాటు అంశం అయినప్పటికిని.. ప్రజా సమస్యల్ని విస్మరించడం ఏమాత్రం సమర్ధనీయం కాదు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ.. ఉద్యమంలో ప్రజలను మమేకం చేయాలి. అయితే ప్రజా సమస్యలను ఏనాడు వల్లించని టీఆర్ఎస్.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనే ఏక మంత్ర జపం చేస్తే అందుకు ప్రజలు ఏమాత్రం హర్షించరు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎజెండాగా పదేళ్లకు పైగా ఉద్యమ చరిత్ర ఉందని చెప్పుకుంటున్న టీఆర్ఎస్.. ఏనాడూ చట్ట సభల్లో తెలంగాణ ప్రాంత ప్రజా సమస్యలి పాలకుల దృష్టికి తీసుకువచ్చిన దాఖలాలు కనిపించవు.
అయితే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ తీరుపై మండిపడుతూ.. ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా గత రెండు ఏళ్లకు పైగా సమస్యలపై పోరాటం చేస్తూ.. ప్రజల అండ దండల్ని పుష్కలంగా సంపాదించుకున్న వైఎస్ఆర్ పార్టీపై టీఆర్ఎస్ వ్యవహరించిన తీరుపై బలహీన వర్గాలు, ప్రజా సంఘాలు బహిరంగంగానే నిరసన వ్యక్తం చేస్తున్నాయి. స్వయానా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమారుడు కే తారకరామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో సమస్యలు చేనేత కార్మికులకు ఉరితాళ్లుగా మారుతున్ననేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన ధర్నాకు ఏవో సాకుల రూపంలో అడ్డు తగిలిన వైనాని ఎవరూ హర్షించరు. అంతేకాక వైఎస్ఆర్ అకాల మృతితో తుది శ్వాస విడిచిన వారికి ఓదార్పు కోసం బయలుదేరిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్న తీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు కూడా సమర్ధించరు.
ప్రజా సమస్యలను పక్కన పెట్టి.. రాజకీయ లబ్ది ప్రధాన ఏజెండాగా మారిన పార్టీల చరిత్రలు ఎక్కువ కాలం ప్రజాస్వామ్య వ్యవస్థలో మనుగడ సాధించలేవు అనడానికి చాలా సంఘటనలు చరిత్ర పుటల్లో నిక్షిప్తమై ఉన్నాయి. అలాంటి సంఘటనలను ఉద్యమ పార్టీ ఓ సారి దృష్టి సారించి.. పంథా మార్చుకోకపోతే ఎదురు దెబ్బలకు సిద్ధంగా ఉండాల్సిందే!
No comments:
Post a Comment