YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 26 July 2012

రిలయన్స్-ఈటీవీ ఒప్పందాల్లో అవకతవకలపై దర్యాప్తు షురూ

రిలయన్స్-ఈటీవీ ఒప్పందాల్లో అవకతవకలపై దర్యాప్తు షురూ
మనీ లాండరింగ్‌తో సహా పలు అక్రమాలు జరిగినట్టు అనుమానం
దర్యాప్తును ధ్రువీకరించిన ఈడీ, కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు
ప్రాథమిక దర్యాప్తుకు ఆదేశించామని ఎంపీ ఉండవల్లికి ఆర్థిక శాఖ లేఖ
ఆద్యంతం అనుమానాస్పదంగా ఈటీవీ-రిలయన్స్ ఒప్పందం
రామోజీకి గుట్టుగా రూ.2,600 కోట్లను రిలయన్స్ మళ్ళించడంపైలోతుగా ఈడీ ఆరా

న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: పాపాల గుట్ట కదులుతోంది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను మోసం చేసి... నియంత్రణ సంస్థ సెబీ కళ్లుగప్పి... ఆదాయపు పన్ను శాఖను పక్కదోవ పట్టించిన రామోజీ రావు ‘‘2,600 కోట్ల రూపాయల డీల్’’పై ఆలస్యం గానైనా దర్యాప్తు సంస్థలు దృష్టి సారించటం మొదలెట్టాయి. రోజుల వ్యవధిలో ఏర్పాటు చేసిన గొట్టం కంపెనీల ద్వారా ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.2,600 కోట్లను ప్రవహింపజేసిన ఉదంతంలో రామోజీరావు పన్ను ఎగవేశారని వచ్చిన ఫిర్యాదుపై ఇప్పటికే ఐటీ శాఖ ఆయనకు నోటీసులిచ్చింది. 2007-08 ఆర్థిక సంవత్సరపు అసెస్‌మెంట్ ఆర్డర్‌ను తిరగరాస్తామని వాటిలో స్పష్టంగా పేర్కొంది. ఇపుడు ఈ నిధుల ప్రవాహంలోని మనీ ల్యాండరింగ్ కోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ కూడా దృష్టిపెట్టింది. 

రామోజీ వ్యవహారంపై తాము దర్యాప్తు మొదలుపెట్టామని, ప్రస్తుతానికి ఇది ప్రాథమిక దశలో ఉన్నందున ఎక్కువ వివరాలు వెల్లడించలేమని ఈడీ వర్గాలు స్పష్టంచేశాయి. అసలు రామోజీ వ్యవహారం పై 2006లోనే పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ అటు ఆర్‌బీఐకి, మిగిలిన దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశారు. డిపాజిట్ల సేకరణను నిలిపి వేయటంతో పాటు అప్పటికే ఉన్న డిపాజిట్లను వెనక్కివ్వాలని ఆర్‌బీఐ ఆదేశాలివ్వటం... రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిటీ వేయటం సంభవించాయి. అయితే ఆస్తుల్ని అటాచ్ చేయటం వంటి తదుపరి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం దిగకుండా నిలువరించాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించి రామోజీరావు స్టే తెచ్చుకున్నారు. ఇందుకోసం ఆయన తన టీవీ చానళ్లను, మార్గదర్శి ఆస్తుల్ని కోర్టుకు హామీగా చూపించారు. 

ఇదంతా జరిగింది 2007లో కాగా... ఆ తరవాత రామోజీరావు రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో రహస్య ఒప్పందం కుదుర్చుకుని ఈటీవీ చానళ్ళు, ఈనాడుతో కూడిన ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్‌లో 39 శాతం వాటాను రెండు విడతలుగా రూ.2,600 కోట్లకు విక్రయించారు. నిమేష్ కంపానీకి చెందిన ఈక్వేటర్ ట్రేడింగ్ ఇండియా లిమిటెడ్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ వివిధ గొట్టం కంపెనీల ద్వారా ఈ డబ్బును సరఫరా చేయటంతో అది రూ.2,600 కోట్లు చెల్లించి ఈ వాటా కొనుక్కుంది. తరవాత దీన్లో కొంత వాటాను రిలయన్స్‌కే చెందిన మరో గొట్టం కంపెనీ అనూ ట్రేడింగ్‌కు బదలాయించింది. 

నిజానికి కోర్టులో హామీ పెట్టిన ఆస్తిని ఇలా విక్రయించటం నేరం. పెపైచ్చు ఈ అమ్మకం కూడా పూర్తి అవకతవకలతో... కేవలం డబ్బును ప్రవహింపజేయటానికి పుట్టుకువచ్చిన కంపెనీల ద్వారా పూర్తికావటమనేది ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ దర్యాప్తునకు కారణమవుతోంది. తాను అప్పట్లో చేసిన ఫిర్యాదుకు సంబంధించి తదుపరి చర్యలేమైనా తీసుకున్నారా? అంటూ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల(మే 10న) ఆర్థిక శాఖ సహాయ మంత్రి పళని మాణిక్యానికి, అప్పటి ఆర్థికమంత్రి ప్రణబ్‌కు, ప్రధానమంత్రికి లేఖలు రాయటంతో... పళనిమాణిక్యం నుంచి ఆయనకు ఈ నెల 18న లిఖిత పూర్వకంగా సమాధానం వచ్చింది. ‘‘ఈ ఉదంతంపై ప్రాథమిక విచారణకు ఆదేశించాం’’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ వర్గాలను ‘సాక్షి’ ప్రతినిధి సంప్రదించారు. ‘‘నిజమే! దర్యాప్తు చేస్తున్నాం. కానీ ప్రాథమిక దశలోనే ఉన్నాం కనక ఎలాంటి వివరాలూ వెల్లడించలేం’’ అని ఆ వర్గాలు స్పష్టంచేశాయి. 

హెచ్‌డీఎఫ్‌సీ, టీవీ-18 డీల్స్‌పైనా దృష్టి!

రామోజీరావు వ్యవహారంలో ఈక్వేటర్-ఉషోదయా మధ్య జరిగిన ఒప్పందమే కాక... ఆయన హెచ్‌డీఎఫ్‌సీలో డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ రూపంలో రూ.1,688 కోట్లు పెట్టారని, ఇది కూడా అనుమానాస్పదంగానే ఉందని పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఈడీ అధికారి ఒకరు తెలియజేశారు. ఈ వ్యవహారం మొత్తం 2007 నవంబర్ 2 నుంచి 2008 జనవరి 3 మధ్యలో జరిగిందని చెప్పారాయన. అయితే ఉషోదయా-ఈక్వేటర్ డీల్ మొత్తం 2008 జనవరిలోనే పూర్తి కావటం ఈ సందర్భంగా గమనార్హం. అంటే రామోజీరావు తన డబ్బుల్ని హెచ్‌డీఎఫ్‌సీలోకి మళ్లించి, రిలయన్స్ నుంచి డబ్బులు తెచ్చుకున్నారా? అవి నిజంగా రిలయన్స్ డబ్బులేనా? అయితే అది ఎందుకు అంత రహస్యంగా పెట్టింది? లేక అవి వివిధ ఆరోపణలు వస్తున్నట్లుగా కేజీ బేసిన్ గ్యాస్ కోసం చంద్రబాబునాయుడికి రిలయన్స్ చెల్లించిన ముడుపులా? అనే అన్ని కోణాలనూ దర్యాప్తు సంస్థ పరిశీలిస్తున్నట్లుగా తెలియవచ్చింది.

వీటన్నిటితో పాటు ఇప్పటికే పలువురు విశ్లేషకుల కన్నెర్రకు కారణమైన టీవీ-18- రిలయన్స్ డీల్ కూడా దర్యాప్తు పరిధిలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ డీల్‌లో నిజానికి టీవీ-18 సంస్థ తన చేతి నుంచి రూపాయి పెట్టింది లేదు. ఈటీవీలో వాటా కొనుగోలు చేయటానికి దానికి రిలయన్ ్స సంస్థ రూ.2,800 కోట్ల పై చిలుకు మొత్తాన్ని సమకూర్చింది. అందుకు ప్రతిగా అది టీవీ-18కు చెందిన రైట్స్‌ను కొనుగోలు చేసింది. ఈ డీల్ కూడా ఈడీ పరిశీలనలో ఉందని తెలుస్తోంది. దీంతోపాటు భారీ నష్టాల్లో నడుస్తున్న ఈనాడు గ్రూపుకు చెందిన ఒక్కో షేరును ఏకంగా 5,28,630 రూపాయలకు రిలయన్స్ ఎందుకు కొనుగోలు చేసిందన్న అంశం మీదా దర్యాప్తు సంస్థ ప్రధానంగా దృష్టి పెట్టింది. మార్గదర్శి ఉదంతంలో ఆరోపణలన్నీ రుజువైతే, అక్రమంగా సేకరించిన డిపాజిట్లకు రెండున్నర రెట్లు జరిమానాను రామోజీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ సమస్యల నుంచి బయట పడేయాలంటూ ముకేశ్ అంబానీతో రామోజీ, టీడీపీ నేతలు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. రామోజీరావు, చంద్రబాబు తదితరులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఇటీవల హైకోర్టుకు ఫిర్యాదు చేసేదాకా అసలు ఈటీవీ-రిలయన్స్ ఒప్పందం అనేది ఒకటి జరిగిందన్న విషయాన్నే ఇరువర్గాలూ అత్యంత గోప్యంగా ఉంచిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!