కరీంనగర్,న్యూస్‌లైన్ :పరకాల ఉప ఎన్నికల్లో హామీ ఇచ్చిన మాది రిగా మూడు నెలల గడువు.. సెప్టెంబర్ 15లోగా తెలంగాణ తేకుంటే ప్రజాప్రతిఘటన తప్పదని వైఎస్సార్సీపీ కేంద్ర పాలకమండలి సభ్యురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ అల్టిమేటం ఇచ్చారు. సిరిసిల్లలో సోమవారం జరిగిన నేతన్న ధర్నాలో ఆమె ప్రసంగించారు. తెలంగాణ ఇచ్చేది కాంగ్రెస్... తెచ్చేది తామేనంటూ ప్రగల్భాలు పలుకుతున్న టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌పై ఒత్తిడి తేకుండా వైఎస్సార్సీపీపై దండయాత్రకు పూనుకోవడం విడ్డూరం గా ఉందన్నారు. తెలంగాణవాదాన్ని అసరాగా చేసుకుని రాజకీయం చేయడం కేసీఆర్ కుటుంబసభ్యులకే చెల్లిందన్నారు. టీఆర్‌ఎస్‌తో తెలంగాణ సాధ్యం కాదని తేల్చిచెప్పారు. 2014లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సాధించి చూపిస్తామన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను ప్రస్తుత ప్రభుత్వంతో ముక్కుపిండి అమలు చేయించేం దుకే చేనేత ధర్నాకు విజయమ్మ వస్తే తమ ఉనికి పోతుందనే భయంతో టీఆర్‌ఎస్ ఆరాచకాలకు దిగిందని దుయ్యబట్టారు. తెలంగాణవాదంతో రాజకీయం చేస్తున్న టీఆర్‌ఎస్‌కు పాలమూరు ప్రజలుపళ్లుఊడగొట్టారని,పరకాలలో చావుతప్పి కన్నులొట్టపోయి తెలంగాణలో నామరూపం లేకుండా పోతుందని భయం పట్టు కుందన్నారు.
విజయమ్మ ధర్నాను భగ్నం చేసేందుకు వెచ్చించిన సమయంలో పదిశాతమైనా నేత కార్మిక సమస్యలపై వెచ్చిస్తే సమస్యలు పరిష్కారమయ్యేవన్నారు. సిరిసిల్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్‌ఎస్‌కు చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆకలి చావులు కనబడటం లేదా అని ప్రశ్నించారు. విజయమ్మను అడ్డుకోవడంలో కేవలం రాజకీయ ఆధిపత్యమే తప్ప మరేమీ కాదన్నారు. ప్రజలకు అధికారపార్టీ మీద నమ్మకం పోయిందని ప్రతిపక్షం ప్రజాసమస్యలు పరిష్కరింపజేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. తెలంగాణవాదం బలంగా ఉన్నప్పటి కీ కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు విశ్రాంతి తీసుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకొంటూ అమాయకులను రెచ్చగొడుతూ గాయాలపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాన్నే తన అనుకూల చానళ్లలో పదే పదే చూపించి ఆనందపడుతున్నారని దుయ్యబట్టారు. మహబూబాబాద్ సంఘటన పునరావృతమవుతుందని పదేపదే వల్లించండం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సహనానికీ ఒక హద్దు ఉంటుందని, వైఎస్సార్‌సీపీ శ్రేణులుగాజులు తొడుక్కుని లేరని, ఆవేశమేకాదు.. ఆలోచనగలవారేనని పేర్కొన్నారు. ఆడపడుచులను తెలంగాణ సంస్కృతిలో గౌరవించడం సంప్రదాయమని, తల్లిలాంటి విజయమ్మను అవమానపర్చడం అమానుషమన్నారు.
నేతన్న సమస్యల పరిష్కారానికే: గట్టు
వైఎస్ ఇచ్చిన హామీలను ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అమలు చేయించేందుకే నేతన్న ధర్నా అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచందర్రావు అన్నారు. చేనేత కార్మికుల రుణమాఫీ కోసం బడ్జెట్‌లో రూ. 312 కోట్లు కేటాయిస్తే ఆయన మరణానంతరం పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. వైఎస్ రెక్కల కష్టంమీద అధికారాన్ని అనుభవిస్తున్న ప్రస్తుత పాలకులు ఆయన పథకాలను తుంగలో తొక్కి హామీలు మరచిపోయారని విమర్శించారు. ఆయన పథకాల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిరిసిల్లకు విజయమ్మ వస్తే అడ్డుకోవడం సమంజసం కాదన్నారు.
వైఎస్ హయాంలోనే అభివృద్ధి: రాజ్‌ఠాగూర్
వైఎస్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని పార్టీ కేంద్ర కమిటీ కార్యనిర్వాహక సభ్యుడు ఎంఎస్ రాజ్‌ఠాగూర్ గుర్తు చేశారు. తెలంగాణలోని చేనేత సమస్యల పరిష్కారానికి వచ్చిన పార్టీ అధ్యక్షురాలిని టీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. తెలంగాణవాదం ముసుగులో స్థానిక సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
నేతన్నలను ఆదుకున్నది వైఎస్సే: ఆది శ్రీనివాస్
నేత కార్మికులను ఆదుకున్నది వైఎస్సేని పార్టీ కేంద్ర కమిటీ కార్యనిర్వాహక సభ్యుడు ఆది శ్రీనివాస్ అన్నారు. చేనేత కార్మికుల ఆకలి చావులు ఆత్మహత్యలు చూసి చలించిన వైఎస్ అనేక పథకాలు అమలు చేయడమేగాక పావలా వడ్డీలో ఆర్థికంగా బలోపేతం చేశాయన్నారు. ప్రస్తుతం చేనేత సమస్యల పట్ల పట్టింపులేని టీఆర్‌ఎస్ ఉనికికోసం ఆరాచకాలు చేస్తోందని దుయ్యబట్టారు.
కేసీఆర్ తెలంగాణ ద్రోహి: రవీంద్రనాయక్
కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని మాజీమంత్రి రవీంద్రనాయక్ అభివర్ణించారు. తెలంగాణవాదం అడ్డంపెట్టుకుని కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారని మాజీ మంత్రి రవీంద్రనాయక్ దుయ్యబట్టారు.పేదల సమస్యల పట్టింపులేదని, ఉనికికోసం ఎంతటికైనా దిగజారుతుందన్నారు. వైఎస్సార్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 41 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణకు అనుకూలంగా సంతకాలు చేయించి ఢిల్లీకి పంపే విషయాన్ని టీఆర్‌ఎస్‌కు గుర్తు లేదా అని ప్రశ్నించారు. అనైతిక పొత్తుతో తెలంగాణకు టీఆర్‌ఎస్ అడ్డంకిగా మారుతోందని దుయ్యబట్టారు.
మేమే తెలంగాణ తెస్తాం: కొండా మురళి
వైఎస్సార్సీపీతోనే తెలంగాణ సాధ్యమని ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణవాదాన్ని అడ్డంపెట్టుకుని రాజకీయం చేస్తున్నారే తప్ప తెలంగాణ తేవాలన్న చిత్తశుద్ధి టీఆర్‌ఎస్‌కు లేదన్నారు. అమెరికానుంచి వచ్చి తెలంగాణ తెస్తానంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదని, తెలంగాణ నీరు తాగి బతుకుతున్న బిడ్డలం తాము తెలంగాణ సాధించి తీరతామన్నారు.
నేతన్నకు అండగా ఉంటాం: శివకుమార్
వైఎస్సార్సీపీ నేతన్నకు అండగా ఉంటుందని పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ ప్రకటించారు. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు నేతన్న కోసం అనేక హామీలు ఇచ్చారని, అకాలమరణం కారణంగా అమలు పూర్తి కాలేదన్నారు. వాటి అమలుపై తమ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. తెలంగాణవాదాన్ని అడ్డంపెట్టుకొని ఫామ్‌హౌస్, ఏసీ గదుల్లో ఉంటున్న కేసీఆర్ కుటుంబ సభ్యులు చేనేత ధర్నాను అడ్డుకోవటానికి కుట్ర పన్నటం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ కోసం 700 మంది విద్యార్థులు బలిదానాలు చేశారని, కేసీఆర్ కుటుంబంలో ఒకరైనా బలిదానం చేశారా అని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారానికి పోరాడే వారిపై గుడ్లు కొట్టించడమే కాదు... భవిష్యత్‌లో గుడ్లు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.
పరిశ్రమకు సబ్సిడీ ఇవ్వాలన్న వైఎస్ : జనక్ ప్రసాద్
చేనేత పరిశ్రమకు 75 శాతం విద్యుత్ సబ్సిడీ అందించాలని వైఎస్ కలలు కన్నారని పార్టీ అధికార ప్రతినిధి జన ప్రసాద్ అన్నారు. ఇప్పటికే 50 శాతం విద్యుత్‌పై సబ్సీడీ అందిస్తుండగా, 75 శాతం కోసం హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఆయన మరణానంతరంతో సబ్సీడీ విద్యుత్, రుణాల మాఫీ ఆగిపోయిందన్నారు.
వైఎస్‌కు బీసీలు రుణపడి ఉన్నారు: నల్లా సూర్యప్రకాశ్
వైఎస్‌కు దళితులు, బీసీలు రుణపడి ఉన్నారని పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్‌రావు పేర్కొన్నారు. వైఎస్ తన హయాంలో దళితులు, వెనుకబడిన తరగతుల వారికి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారని గుర్తు చేశారు. కొంతమంది తెలంగాణవాదాన్ని అడ్డంపెట్టుకుని బడుగు బలహీనవర్గాలను పావుగా వాడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సిద్దిపేట పొలిమేరలకు తరిమికొడతాం: మహేందర్‌రెడ్డి
తెలంగాణవాదాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తే కేసీఆర్ కుటుంబసభ్యులను సిద్దిపేట పొలిమేరల వరకు తరమి కొడుతామని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కేకే మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. చేనేత సమస్యలపై ధర్నా చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు విజయమ్మ సిరిసిల్లకు వస్తే తెలంగాణవాదాన్ని తెరపైకి తీసుకరావడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. కేసీఆర్, హరీష్‌రావు, కేటీఆర్ ప్రోద్బలంతో కొందరు టీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రశాంతవాతావరణాన్ని చెడగొడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణవాదం బలహీనపడలేదని, అది ప్రజలఆకాంక్ష అని, దాన్ని తీర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. కేటీఆర్‌కు ప్రజా సమస్యలపై నమ్మకం లేక, ఆటవికచర్యలను ప్రోత్సహిస్తున్నారన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో నేత కార్మికుల సమస్యలను పట్టించుకోని కేటీఆర్ విజయమ్మను అడ్డుకోవడం ఏమేరకు సమంజసమని మహేందర్ రెడ్డి ప్రశ్నిం చారు.
పంచుకుని అమ్ముకుంటున్నారు: గోవర్దన్
కేసీఆర్ కుటుంబసభ్యులు తెలంగాణవాదాన్ని అడ్డంపెట్టుకుని రాజకీయ మనుగడ కోసం పది జిల్లాలను పంచుకుని అమ్ముకుంటున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్దన్ దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ బలోపేతమైతే తెలంగాణలో ఉనికిని కోల్పోతామన్న భయం కేసీఆర్ కుటుంబానికి పట్టుకుందన్నారు. నేత కార్మికుల కష్టాల్లో పాలు పంచుకోవటానికి వచ్చిన విజయమ్మను అడ్డుకోవటానికి ప్రయత్నించడం విడ్డూరంగా ఉందన్నారు. తాము తెలగాణకు అనుకూలమేనని బాన్సువాడలో తెలంగాణ కోసం పదవిని త్యాగం చేసి, పోటీకి దిగలేదని, అదేవిధంగా తెలంగాణలో త్యాగం చేసిన స్థానాల్లో ఎక్కడాకూడా తమ పార్టీ అభ్యర్థులను బరిలో దింపని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాంటిది తెలంగాణ కోసం కొండా సురేఖ పరకాలలో పదవీత్యాగంచేస్తే పోటీకి దిగి స్వల్ప ఓట్లతో విజయం సాధించిన టీఆర్‌ఎస్ ఉనికికోసం పాకులాడుతోందని బాజిరెడ్డి విమర్శించారు. నేతన్న ధర్నాలో జిల్లా పార్టీ కన్వీనర్ పుట్ట మధు, గాదె నిరంజన్‌రెడ్డి, సిరిసిల్ల నేత వేణు, కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రసన్నకుమార్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శోభానాగిరెడ్డి, సుచరిత, పార్టీ నాయకురాలు రోజా తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment