YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday 26 September 2012

జగన్‌కు సంబంధం లేదు .వాన్‌పిక్ వ్యవహారంలో హైకోర్టు ఎదుట సీబీఐ అంగీకారం...

* భూ కేటాయింపుల్లో జగన్‌కు సంబంధం ఉందని ఆరోపిస్తూ వచ్చిన సీబీఐ
* తాజాగా హైకోర్టు నిలదీయడంతో వాస్తవం బయటపెట్టిన సీబీఐ న్యాయవాది
* వాన్‌పిక్ వ్యవహారాల్లో జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధం లేదని స్పష్టీకరణ 
* సీబీఐ న్యాయవాది వాదనలపై హైకోర్టు న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి 
* న్యాయస్థానాలను సంతృప్తిపరిచే విధంగా వాదనలు వినిపించాలని సూచన 
* సీబీఐ ఉన్నతాధికారుల సంతృప్తికోసం వాదనలు చేయవద్దని హితవు 
* హైకోర్టులో నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్‌పై విచారణ.. నేడు కూడా వాదనలు 

హైదరాబాద్, న్యూస్‌లైన్: వాన్‌పిక్ ఇండస్ట్రియల్ కారిడార్‌కు భూముల కేటాయింపు, ఇతర వ్యవహారాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధం ఉందని.. అందుకే వాన్‌పిక్ ప్రాజెక్టు భాగస్వామి నిమ్మగడ్డ ప్రసాద్ జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారని ఇంతకాలం తీవ్ర ఆరోపణలు చేస్తూ వచ్చిన సీబీఐ ఇప్పుడు విధిలేని పరిస్థితుల్లో వాస్తవాన్ని బయటపెట్టింది. వాన్‌పిక్ కారిడార్‌కు భూముల కేటాయింపు, రాయితీల కల్పన, తదితర వ్యవహారాల్లో జగన్‌కు ఎటువంటి సంబంధం లేదని సీబీఐ బుధవారం హైకోర్టుకు స్పష్టం చేసింది. 

అయితే ఈ విషయాన్ని సీబీఐ హైకోర్టుకు స్వచ్ఛందంగా నివేదించలేదు. వాన్‌పిక్ కారిడార్‌కు సంబంధించిన ఒప్పంద వివరాలను కోర్టు ముందుంచే సమయంలో సీబీఐ తరఫు న్యాయవాది యథావిధిగా జగన్ గురించి, జగతి పబ్లికేషన్స్‌లో నిమ్మగడ్డ పెట్టుబడుల గురించి ప్రస్తావించారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న హైకోర్టు.. వాన్‌పిక్ ఇండస్ట్రియల్ కారిడార్ వ్యవహారంలో జగన్ ప్రమేయం గురించి గట్టిగా నిలదీయటంతో సీబీఐ తప్పనిసరి పరిస్థితుల్లో వాస్తవాన్ని బయట పెట్టింది. కారిడార్ వ్యవహారాల్లో జగన్‌కు సంబంధం లేదన్న వాస్తవాన్ని అంగీకరించింది. జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో తనకు బెయిల్ నిరాకరిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సముద్రాల గోవిందరాజులు.. బుధవారం ఈ వ్యాజ్యాన్ని మరోసారి విచారించారు. గతవారం కోర్టు సమయం ముగియటంతో అసంపూర్తిగా ముగిసిన వాదనలను సీబీఐ తరఫు న్యాయవాది కేశవరావు బుధవారం కొనసాగించారు. ఎప్పటిలాగే సీబీఐ న్యాయవాది కేశవరావు వాదనలపై న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాదనలు ప్రారంభించేందుకు కేశవరావు సిద్ధం కాగానే.. ‘మీకు కావాల్సిన విధంగా వాదనలు వినిపిస్తారా..? లేక హైకోర్టుకు కావాల్సిన విధంగానా..? అనవసరమైన డాక్యుమెంట్ల గురించి చదువుతూ వెళతామంటే అందుకు ఈ కోర్టు అంగీకరించలేదు. 

కేవలం ఈ బెయిల్ పిటిషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్ల గురించి మాత్రమే ప్రస్తావించండి’ అని జస్టిస్ గోవిందరాజులు స్పష్టంచేశారు. దీనికి కేశవరావు స్పందిస్తూ.. డాక్యుమెంట్ల గురించి చదివే విషయంలో కోర్టు సమయాన్ని వృథా చేయబోనని, బెయిల్‌కు సంబంధించి డాక్యుమెంట్లలో ఒకటి రెండు పేరాల గురించి మాత్రమే ప్రస్తావిస్తానని తెలిపారు. తరువాత వాదనలు కొనసాగిస్తూ.. జీ టు జీ పద్ధతిన వాన్‌పిక్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం రస్ అల్ ఖైమా - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని తెలిపారు. 

బూట్ (బిల్డ్, ఓన్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్) పద్ధతిలో ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారని, అందులో భాగంగానే వాన్‌పిక్‌కు నాలుగు వేల ఎకరాలు కేటాయించారని వివరించారు. ఇండస్ట్రియల్ కారిడార్‌కు నాలుగు వేల ఎకరాల కేటాయింపు విషయంలో మంత్రివర్గ నిర్ణయం గురించి ఎక్కడా స్పష్టమైన ప్రస్తావన లేదని ఆయన తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘ఎందుకు ఇవన్నీ చెబుతారు..? బెయిల్ పిటిషన్‌కు మాత్రమే పరిమితంకండి. ఈ కేసులో పిటిషనర్ పాత్ర ఏమిటో చెప్పండి చాలు’ అని కేశవరావుకు స్పష్టం చేశారు. నిమ్మగడ్డ ప్రసాద్ క్విడ్ ప్రో కో పద్ధతిన జగన్‌కు చెందిన కంపెనీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారని కేశవరావు పేర్కొన్నారు. 

వాన్‌పిక్ ప్రాజెక్టుకు సంబంధించిన కన్సెషనల్ అగ్రిమెంట్ ద్వారా ప్రభుత్వం నుంచి నిమ్మగడ్డ లబ్ధి పొందారని, అందుకు ప్రతిఫలంగా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. పెట్టుబడులకు సంబంధించిన వివరాలు చార్జిషీట్‌లో ఉన్నాయన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘కింది కోర్టులో చెప్పినట్లు ఇక్కడ వాదనలు చెప్పొద్దు. కింది కోర్టులో వాదించేందుకు ఈ వాదనలను రిజర్వు చేసుకోండి. క్విడ్ ప్రో కో ఒప్పందంలో ఇంకెవరి పాత్ర ఉంది. వాన్‌పిక్ కారిడార్ వ్యవహారాల్లో ప్రధాన నిందితునిగా ఉన్న జగన్‌కు ఏమైనా సంబంధం ఉందా..? ఉంటే అది ఏ రకమైన సంబంధమో స్పష్టంగా చెప్పండి’ అని కేశవరావును సూటిగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేశవరావుతో సహా, కోర్టు హాలులో ఉన్న సీబీఐ అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. 

న్యాయమూర్తి అత్యంత కీలకమైన ప్రశ్న సంధించటంతో కేశవరావుకు వాస్తవాన్ని చెప్పకతప్పలేదు. వాన్‌పిక్ కారిడార్ వ్యవహారాల్లో జగన్‌కు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. అయినప్పటికీ జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్‌లో నిమ్మగడ్డ పెట్టుబడులు పెట్టారంటూ కేశవరావు మళ్లీ చెప్పిందే చెప్పారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘నా మనస్సులో పలు సందేహాలున్నాయి. మీరు చెప్పే దానిని, చార్జిషీట్‌లో పేర్కొన్న దానిని నమ్మి ఓ నిర్ణయానికి రాలేను.

వాస్తవాలను రాబట్టేందుకు నాకున్న పద్ధతులు నాకున్నాయి. పూర్తిస్థాయి పరిశోధన తరువాతే ఓ నిర్ణయానికి వస్తాను. అందువల్ల నేను అడిగే ప్రతీ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పండి. ముందు న్యాయస్థానాలను సంతృప్తిపరిచే విధంగా వాదనలు వినిపించండి. అంతేకాక కోర్టు హాలులో వెనుక ఉన్న అధికారులను సంతృప్తిపరిచేందుకు వాదనలు వినిపించొద్దు. మీ వాదనల పట్ల ఎవరైనా సంతృప్తి వ్యక్తం చేస్తే మాత్రం, అందుకు నేను చేయగలిగింది ఏమీ లేదు. నేను నిస్సహాయుడిని’ అని కేశవరావుకు తేల్చి చెప్పారు. బుధవారం కోర్టు సమయం ముగియటంతో వాదనలు గురువారం కొనసాగనున్నాయి.

http://www.sakshi.com/main/FullStory.aspx?catid=457964&Categoryid=1&subcatid=33

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!