YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 26 September 2012

బాబు ‘సుపరిపాలన’కు మచ్చుతునక ఐఎంజీ కుంభకోణం

ఆపద్ధర్మ సీఎం హోదాలో హడావుడి గోల్‌మాల్
అనామక కంపెనీకి హైదరాబాద్‌లో 850 ఎకరాలు
అప్పట్లో మార్కెట్ విలువ ఎకరం రు.5 కోట్లు
ఇచ్చింది ఎకరం రూ. 50వేలకే
1999లో అక్కడ తన భార్య భూమి ఎకరం రూ. కోటికి అమ్ముకున్న బాబు
బినామీ కాబట్టే బిల్లీరావుకు కారుచౌకగా పందేరం
4 రోజుల కంపెనీతో 4 రోజుల్లో ఒప్పందం
బాబు ఆదేశాలతో శరవేగంగా కదిలిన ఫైలు
కేబినెట్‌కు తెలియకుండా కేటాయింపులు
హైదరాబాద్ నడిబొడ్డులో ఆఫీసుకూ ఐదెకరాలు
ప్రజా ప్రయోజనాలను తుంగలో తొక్కి...
ఖజానాకు కన్నం వేసినా...
కుంభకోణమే జరగలేదంటున్న టీడీపీనాయకులు
ఫిర్యాదుచేసినవారిపై తాజాగా వీరంగాలు..


(సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
నాలుగు రోజుల క్రితం రిజిస్టరయిన కంపెనీ ఏకంగా ఓ రాష్ర్ట ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోగలుగుతుందా?
లక్ష రూపాయల పెట్టుబడితో మొదలైన ఓ కంపెనీ 750 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు వృద్ధిచేయగలదంటే ఎవరైనా నమ్మగలరా?
సొంత ఆఫీసు కూడా లేని ఓ అనామక కంపెనీకి ఏ ప్రభుత్వమైనా హైదరాబాద్‌లో 850 ఎకరాలు కట్టబెడుతుందా?
అప్పట్లోనే ఎకరా రూ.5 కోట్లు పలికిన భూమిని ఎటువంటి ప్రజా ప్రయోజనమూ ఆశించకుండా ఎకరా రూ.50 వేలకే ఏ ప్రభుత్వమైనా ఇచ్చేస్తుందా?
హైదరాబాద్‌లో వందల కోట్ల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన క్రీడామైదానాలను ఉత్తపుణ్యానికే ఏ కంపెనీకైనా రాసిచ్చేస్తారా?
ఇవన్నీ కాదు.... ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజా
ప్రయోజనాలకు, ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూ ఎవరైనా ‘కీలకమైన’ నిర్ణయాలు తీసుకుంటారా?

తెలుగుదేశం అధినేత, తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఇవన్నీ సాధ్యం. రాజధానిలో వేలకోట్ల విలువైన భూములను ఓ అనామక సంస్థకు ఉదారంగా రాసిచ్చేసిన ఐఎంజీ కుంభకోణం చంద్రబాబు చాతుర్యానికి మచ్చుతునక అని తెలుగుదేశం కార్యకర్తలు సైతం ఒప్పుకుంటారు. ఈ కుంభకోణంపై విచారణ జరపాల్సిందిగా 2006లో రాష్ర్ట ప్రభుత్వం ఆదేశిస్తే సిబ్బంది లేరంటూ కుంటిసాకులు చెప్పిన అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ అవసరమైతే ఇపుడు విచారిస్తామంటూ కోర్టును సమాధానపరిచే పనిలో బిజీగా ఉంది. దీంతో చెమటలు పట్టిన తెలుగుదేశం నాయకులు అసలు కుంభకోణమే జరగలేదని, కోర్టులు కొట్టేశాయని రోజుకో కథ చెబుతున్నారు. కేసువేసిన వారిపై ఎర్రన్నాయుడు వంటివారు అంతెత్తునలేస్తూ వీరంగం వేస్తున్నారు. బాబుగారేమో తన హయాంలోని ‘సుపరిపాలన’ను గుర్తుచేస్తానంటూ ‘మీకోసం’ యాత్రకు బయల్దేరుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పాలనలో రాష్ర్టంలో జరిగిన అనేకానేక కుంభకోణాల్లో ఒకటైన ‘ఐఎంజీ’ బాగోతం వివరాలు మీకోసం..

ఇదీ కుంభకోణం...
‘ఐఎంజీ భారత’ అనే ఓ కంపెనీని 2003 ఆగస్టు 5న హైదరాబాద్‌లో రిజిస్టర్ చేశారు. దాని అధినేత అహోబలరావు అలియాస్ బిల్లీరావు. ఆ కంపెనీకి కనీసం ఆఫీసు కూడా లేదు. లక్షరూపాయల మూలధనంతో ప్రారంభమైంది. అద్భుతమైన మైదానాలు కట్టి, క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి 2020 ఒలింపిక్స్‌కు తర్ఫీదు ఇప్పిస్తామని బిల్లీరావు ప్రచారం చేశారు. అప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. అందుకే తెరవెనక ఫైళ్లు వేగంగా కదిలాయి. కంపెనీ పెట్టిన నాలుగురోజుల్లోనే రాష్ర్ట ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం 850 ఎకరాల భూమిని... అదీ ఖరీదైన హైదరాబాద్ శివారు ప్రాంతంలో రాసిచ్చేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండల పరిధిలోని గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలు, సరూర్‌నగర్ మండల పరిధిలో అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న మామిడిపల్లిలో 450 ఎకరాలను ఎకరా రు. 50 వేల చొప్పున ఐఎంజీకి కేటాయించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఎవరైనా సందేహిస్తారు. కానీ చంద్రబాబు మాత్రం అలాంటివేవీ ఆలోచించలేదు. ఏ పరిశ్రమకైనా భూమిని ఇవ్వాలంటే సవాలక్ష అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. అది ఎన్నేళ్ల నుంచి ఉంది? భూమి ఇవ్వడం వల్ల ప్రజలకు ఎంత ప్రయోజనం జరుగుతుంది? ఎన్ని ఉద్యోగాలొస్తాయి? వంటి వాటినన్నిటినీ ప్రభుత్వం పరిశీలిస్తుంది. కానీ ఇక్కడ ఓ అనామక కంపెనీ కోసం ఆగమేఘాలపై నిర్ణయాలు జరిగిపోయాయి. భూమి ఇవ్వడమే కాదు. పాపం ఆ కంపెనీకి ఆఫీసు కూడా లేదని బాధపడి గచ్చిబౌలి నుంచి బంజారా హిల్స్ వరకూ ఎక్కడ ఎంచుకుంటే అక్కడ ఐదెకరాలు ఇస్తామని చంద్రబాబు ఆఫర్ చేశారు. ఆ కంపెనీ బంజారా హిల్స్‌ను ఎంచుకున్న వెంటనే ఓకే చేసేశారు.

ఎకరా రూ. 5 కోట్ల భూమి రూ. 50 వేలకే...
ఐఎంజీకి భూమి అప్పగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం 2004 ఫిబ్రవరి 9న జీవో జారీ చేసింది. ఆ జీవోలో అనేక ‘ఉదార’ నిబంధనలనూ చేర్చారు. 400 ఎకరాలకు బిల్లీరావు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజునూ చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుత మార్కెట్ రేటును బట్టి చూస్తే గచ్చిబౌలి ప్రాంతంలో ఎకరా ధర కనీసం రూ.10 కోట్లు ఉంది. అప్పట్లో ఐదు కోట్ల రూపాయల చొప్పున తీసుకున్నారు. 2వేల కోట్లు. అంటే గచ్చిబౌలిలోని 400 ఎకరాల రేటే రూ. 2వేల కోట్లు. ఇక ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలోని విలువైన 450 ఎకరాల మామిడిపల్లి భూమిని కూడా కలిపితే రూ.4,250 కోట్ల పైమాటే (అప్పటిధర). ఇక బంజారాహిల్స్ ప్రాంతంలో ఐదెకరాల భూమి విలువ రూ.100 కోట్లు దీనికి అదనం. లక్షరూపాయల మూలధనంతో ప్రారంభించిన కంపెనీ 750 కోట్ల రూపాయలతో రెండు దశల్లో క్రీడా ప్రాజెక్టు చేపడతామని ముందుకు రావడం, చంద్రబాబు ఆ కంపెనీకి ఉదారంగా హైదరాబాద్‌లో 850 ఎకరాల భూమిని నామమాత్రపు ధరకు హడావుడిగా అప్పగించడం ఈ కుంభకోణంలో కీలకమైన అంశం. 1999లోనే తన భార్య భువనేశ్వరి భూమిని ఎకరా రూ.కోటికి విక్రయించిన ప్రాంతంలో ఐదేళ్ల తర్వాత ఐఎంజీ భారతకు ఎకరా రూ.50వేలకు చంద్రబాబు కేటాయించడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

కోట్ల విలువైన స్టేడియాలూ రాసిచ్చారు...
బాబుగారి ఉదారత ఇక్కడితో ఆగలేదు. హైదరాబాద్‌లోనూ, శివార్లలోనూ నిర్మించిన పలు క్రీడా మైదానాలను 45 ఏళ్ల దీర్ఘకాలిక లీజుకు ఐఎంజీకి కట్టబెట్టాలని చంద్రబాబు నిర్ణయించడం ఈ కుంభకోణంలో మరో కీలకమైన అంశం. ఈమేరకు జీవో నం. 11ను విడుదల చేశారు. కానీ ఆ లీజు మొత్తం ఎంత అన్నది మాత్రం జీవోలో ఎక్కడా పేర్కొనలేదు. ఐఎంజీకి అప్పగించే స్టేడియాల నిర్వహణ ఖర్చులను ఐదేళ్లపాటు రాష్ర్ట ప్రభుత్వమే భరిస్తుందని, అందుకోసం ఏటా రూ.2.5 కోట్ల చొప్పున రూ.12.5 కోట్ల మొత్తాన్ని కేటాయిస్తామని జీవోలో పేర్కొన్నారు. అంతేనా... సాధారణంగా విద్యాసంస్థలకు కల్పించే రాయితీలు, సౌకర్యాలన్నీ ఐఎంజీకి వర్తింపజేశారు. పదేళ్లపాటు వినోదపు పన్ను మినహాయించారు. తొలి మూడేళ్లకు కరెంటు, నీటిబిల్లులు రద్దు చేశారు. తర్వాతి నాలుగేళ్లకు వాటిలో 25శాతం రాయితీ ఇచ్చారు.

ఆగస్టు 6కు ముందు ఏం జరిగింది?
‘ఐఎంజీ భారత’ సంస్థను 2003 ఆగస్టు 5న రిజిస్టర్ చేసిన మర్నాడే నాటి యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి 111080/ఎస్1/03 నంబర్ నోట్ ఫైల్‌ను ముసాయిదా ఎంఓయూ ఆమోదానికి పంపించారు. ఆ నోట్‌ను నాటి కేబినెట్ మంత్రులు నలుగురు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి అదే రోజు ఆమోదించారు. మర్నాడు... అంటే ఆగస్టు 7న సీఎం కార్యాలయంలో అదనపు కార్యదర్శి ఓ నోట్‌ను సర్క్యులేట్ చేశారు. ఐఎంజీఏ గురించి అందులో వివరించారు. ముఖ్యమంత్రి, మంత్రివర్గ ఉపసంఘం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి .. ఇలా పలు స్థాయిల్లో సమావేశాలు, చర్చలు జరిగినట్లు ఆ నోట్‌లో పేర్కొన్నారు. కానీ నిజానికి ఎటువంటి చర్చలు సమావేశాలు జరగనే లేదు. పూర్తిస్థాయి చర్చల తరువాతే నిర్ణయం తీసుకున్నామని అందరినీ నమ్మించేందుకే నోట్‌లో అలా పేర్కొన్నట్లు ప్రభుత్వం ఆ తర్వాత ఓ అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు తెలియజేసింది. ఇందులో దిగ్భ్రాంతికర విషయమేమిటంటే ఆగస్టు 6కు ముందు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలేవీ రికార్డుల్లో లేవు. అంటే ఐఎంజీ కంపెనీ తెరపైకి ఎలా వచ్చింది? దానితో ఎవరెవరు చర్చలు జరిపారు? అసలు బిల్లీరావు ఎవరు? వంటి విషయాలేవీ అధికారులకు తెలియదు. దీన్ని బట్టి బిల్లీరావు గురించి, ఐఎంజీ గురించి చంద్రబాబు నాయుడు ఒక్కడికే తెలుసని అర్థమవుతున్నది కదా!

రాష్ర్ట ప్రభుత్వం ఆదేశించినా విచారణకు కదలని సీబీఐ
ఐఎంజీ కుంభకోణం విషయంలో సీబీఐ అంతులేని నిర్లిప్తతను ప్రదర్శించింది. రాష్ర్ట ప్రభుత్వం విచారణకు ఆదేశించినా తమ వద్ద సిబ్బంది లేరని అది తప్పించుకుంది. ఇదే విషయమై ఇపుడు సీబీఐని హైకోర్టు మొట్టికాయలు వేసింది. సిబ్బంది లేరని మేం కూడా పనిమానేయవచ్చా అని ప్రశ్నించింది. నిజానికి అప్పట్లో సీబీఐ వద్ద ఇన్ని కేసులూలేవు. దీనిపై సందేహం వచ్చిన ఓ న్యాయవాది ఆర్టీఐ కింద కేంద్ర ప్రభుత్వాన్ని ఇదే ప్రశ్న అడిగారు. ‘‘తన వద్ద తగిన వనరులు లేవు కాబట్టి విచారణ జరపలేనని సీబీఐ నిస్సహాయత వ్యక్తం చేసింది’’ అని కేంద్రం నుంచి సమాధానం వచ్చింది.

ఐఎంజీ... ఆ పేరులోనే మోసం... 
ఐఎంజీ భారత అనేది ఫ్లోరిడాకు చెందిన ఐఎంజీ వరల్డ్‌వైడ్ కంపెనీకి అనుబంధ సంస్థేనని బిల్లీరావు, టీడీపీ నాయకులు బల్లగుద్ది మరీ చెప్పారు. అయితే ఫ్లోరిడాలోని ఐఎంజీకి ఇక్కడి ‘ఐఎంజీ భారత’కు ఎలాంటి సంబంధమూ లేదని తర్వాత బయటపడింది. కానీ అబద్ధాన్ని నిజం చేయడానికి చంద్రబాబు అనుయాయులు, ఆయనకు వత్తాసు పలికే మీడియా ఎన్నో ప్రయత్నాలు చేశాయి. ఐఎంజీ సంస్థ ఆకాశం నుంచి ఊడిపడినట్లు, అది వస్తే మొత్తం క్రీడాప్రపంచమే మారిపోతుందన్నట్లు ప్రచారం చేశారు. ఈ కబుర్లను నమ్మిన అధికారులు దాని గురించి నిజానిజాలు తెలుసుకునేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఈ విషయాలన్నిటినీ నాటి యువజన వ్యవహారాల ముఖ్య కార్యదర్శి స్వయంగా హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఒప్పుకున్నారు కూడా. ఐఎంజీ వ్యవహారంలో పారదర్శకత లోపించిందని, ఆశ్రీతపక్షపాతంతో హడా వుడిగా భూములు కట్టబెట్టారని, దీనివల్ల ప్రభుత్వానికి వందల కోట్ల మేర నష్టం వాటిల్లిందని స్పష్టంగా పేర్కొన్నారు. నిజానికి ఫ్లోరిడాలో ఐఎంజీ వరల్డ్‌వైడ్ కంపెనీకి ఉన్న భూమే 120 ఎకరాలు. ఆ పేరు పెట్టుకున్న డూప్ కంపెనీకి హైదరాబాద్‌లో 855 ఎకరాలు కట్టబెట్టేందుకు చంద్రబాబు తహతహలాడడం విశేషం కాదూ.

కేబినెట్‌కు తెలియకుండానే కథ నడిపారు...
ఐఎంజీకి భూమి కేటాయిస్తూ ఫైలుపై చంద్రబాబు సంతకం చేయగానే బిల్లీరావు 2003 ఆగస్టు 9న రాష్ర్ట ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే కంపెనీ రిజిస్టర్ కావడం, ఫైలు సిద్ధం కావడం, నలుగురు మంత్రులు ఆమోదించడం, బాబు సంతకాలు చేయడం ఇలా అన్నీ మొత్తం నాలుగంటే నాలుగు రోజుల్లోనే పూర్తయిపోయాయి. లక్ష రూపాయల మూలధనంతో మొదలైన కంపెనీకి వేల కోట్ల రూపాయల విలువైన భూములను, క్రీడామైదానాలను అప్పగిస్తూ రాష్ర్ట ప్రభుత్వం నాలుగంటే నాలుగురోజుల్లోనే కీలకమైన ఒప్పందం కుదుర్చుకుందన్నమాట. ఓ అనామక కంపెనీతో ఇంత ఖరీదైన ఒప్పందం ఇంత వేగంగా కుదుర్చుకోవడమనేది బహుశా దేశ చరిత్రలో ఇదే ప్రథమం కావచ్చునేమో! ఇది మంత్రివర్గ సమష్టి నిర్ణయమని నాటి సమాచార మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి 2003 సెప్టెంబర్ 1న విలేకరుల సమావేశంలో చెప్పారు. కానీ ఫైలును కేబినెట్ ముందు పెట్టకుండానే భూముల కేటాయింపుపై నిర్ణయం తీసుకున్నారని రికార్డులను పరిశీలిస్తే స్పష్టమౌతున్నది. తరువాత ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కూడా ఈ విషయం స్పష్టమయ్యింది.

బాబు బిల్లీ బినామీ బంధం
బిల్లీరావు అసలు పేరు అహోబలరావు. పుట్టింది కృష్ణాజిల్లా కొండపల్లి. రిషివ్యాలీ స్కూలులో చదువుకున్నారు. మద్రాస్ ఐఐటీ, అమెరికాలోని ‘మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ (ఎంఐటీ) నుంచి గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1995లో ఆర్థికమంత్రిగా ఉన్న చంద్రబాబుతో బిల్లీరావుకు పరిచయమేర్పడింది. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత చిత్తూరు జిల్లా కుప్పంలో చేపట్టిన ఇజ్రాయిల్ ప్రాజెక్టును బిల్లీరావు, ఆయన సోదరుడు ప్రభాకరరావు అలియాస్ పేట్‌రావుకు అప్పగించారు. అలా వారి మధ్య బంధం పెరుగుతూ వచ్చింది. అంతర్జాతీయంగా పేరున్న ఐఎంజీ అకాడెమీస్‌ను ఉపయోగించుకుని అదే పేరును పోలి ఉండేలా ‘ఐఎంజీ అకాడెమీస్ భారత’ అనే కాగితపు సంస్థను బిల్లీరావు సృష్టించాడు.

ఐఎంజీ అకాడెమీస్ యాజమాన్యం మార్క్ కార్మిక్ కుటుంబంతో సంబంధాలున్న ఆండ్రూ క్రీగర్‌ను తన వ్యూహంలో పావుగా మార్చాడు. ఐఎంజీ భారతకు చైర్మన్‌ని చేశాడు. అయితే భూమి చేతికి రాగానే క్రీగర్‌పై నేరస్తుడనే ముద్రవేసి చైర్మన్ పదవినుంచి తప్పించాడు. భారతదేశంలో మైదానాలు కట్టి, క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి 2020లో జరిగే ఒలింపిక్స్‌కు భారతదేశం నుంచి అద్భుతమైన క్రీడాకారుల్ని పంపిస్తామని ప్రచారం చేసుకున్నాడు. నిజానికి బిల్లీ క్రీడారంగంలో అనుభవశాలి కాదు. గతంలో ఒక్క స్టేడియంను నిర్మించిన అనుభవం కూడా లేదు. అయినా చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపించి ఐఎంజీ భారత సంస్థకు 850 ఎకరాలు ధారాదత్తం చేశారు. గచ్చిబౌలి భూములను బదలాయించేందుకు హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ వర్గాలు మొదట అంగీకరించలేదని, కానీ చంద్రబాబు తీవ్రంగా వత్తిడి చేయడంతో సరేననక తప్పలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఐఎంజీ ఫైళ్లు ఆగమేఘాల మీద కదలడానికి, భూములు శరవేగంగా చేతులు మారడానికి బాబు హయాంలో ఆయన ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఉమామహేశ్వరరావు ముమ్మరంగా కృషిచేశారు. బినామీ కనుకనే బిల్లీరావు విషయంలో చంద్రబాబు అంత శ్రద్ధ చూపి వేల కోట్ల విలువైన భూములను నామమాత్రపు ధరకు కట్టబెట్టారని దీనినిబట్టి అర్ధం కావడం లేదూ?


అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు డ్రామాలు
చంద్రబాబు ఆస్తులపై గతంలో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించగానే తెలుగుదేశం నాయకులు హడావుడిగా విలేకరుల సమావేశం నిర్వహించి ఐఎంజీ ప్రాజెక్టుపై ఓ కరపత్రాన్ని పంచిపెట్టారు. దాంతో పాటు రెండు ఈ మెయిల్ ప్రతులను కూడా ఇచ్చారు. ఐఎంజీ అకాడెమీస్ సీనియర్ వైఎస్ ప్రెసిడెంట్ టెడ్ మీక్మా రాసినట్లుగా చెబుతున్న రెండు ఈ మెయిల్స్‌ను టీడీపీ నాయకులు విడుదల చేశారు. వాటిలో ఒకటి 2005 సెప్టెంబర్ 22న రాసింది కాగా రెండోది 2006 అక్టోబర్ 5న రాసింది. ఐఎంజీ భారత తమకు అనుబంధంగా పనిచేస్తోందని, తమ బ్రాండ్, శిక్షణ కార్యక్రమాలు, మేనేజ్‌మెంట్ నైపుణ్యం తదితరాలను వాడుకోవడానికి ‘ఐఎంజీ అకాడెమీస్ ఈస్ట్’ సంస్థకు తామే లెసైన్స్ ఇచ్చామని మీక్మా పేర్కొన్నట్లు ఒక మెయిల్‌లో ఉంది.

అయితే ఈ రెండు మెయిల్స్ మీక్మా సొంత మెయిల్ నుంచి రాకపోవడం, ఎవరైనా ఐడీ సష్టించి ఉత్తరప్రత్యుత్తరాలు నడపగలిగే జీమెయిల్ నుంచి రావడం చూస్తే జనాన్ని మోసం చేయడానికి నకిలీ మెయిల్స్‌తోనూ బాబు అండ్‌కో తతంగం నడిపారని సులువుగానే అర్ధమౌతుంది. కానీ అసలు విషయం 2007లోనే బైటపడింది. ఐఎంజీ అకాడెమీస్ ఈస్ట్‌గానీ, ఐఎంజీ అకాడెమీస్ భారత గానీ తమకు అనుబంధ సంస్థలు కావని మీక్మా 2007లో రాష్ట్రప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఐఎంజీ వరల్డ్‌వైడ్‌కు గానీ, ఐఎంజీ ఆకాడెమీస్‌కు గానీ అవి అనుబంధం కావని అందులో తెలిపారు. ఈ రెండు సంస్థల్లోనూ తమ పెట్టుబడులు ఎంతమాత్రమూ లేవని, తాము వీటిలో ఇన్వెస్టర్లం కాదని, తాము యజమానులం కూడా కాదని స్పష్టం చేశారు. కుంభకోణం నుంచి బైటపడడం కోసం టీడీపీనాయకులు నడిపిన మెయిల్ డ్రామాలు అలా విఫలమయ్యాయి.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!