YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 24 September 2012

‘తొమ్మిదేళ్లకు తక్కువ’ పాలనను ప్రజలకు మళ్లీ గుర్తు చేయడానికే...


‘వస్తున్నా... మీకోసం’అంటున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మామూలుగా కాదు నేలమీద నడుచుకుంటూ వస్తున్నానని ప్రకటించేశారు. రామన్న రాజ్యం తెచ్చేందుకు రాష్ట్రాన్ని పాదయాత్ర ద్వారా చుట్టేస్తానని బాబూగారు సెలవిచ్చారు. జాతిపిత మహాత్మ గాంధీ జయంతి రోజున మొదలెట్టి ఏకధాటిగా నాలుగు నెలల పాటు నడుస్తూనే సగం పర్యటన పూర్తిచేస్తానంటున్నారు నారా బాబు. గణ తంత్ర దినోత్సవం నాటికి మొదటి విడత యాత్రకు ఫుల్‌స్టాఫ్ పెడతారట. తెలంగాణ ప్రాంతం నుంచి యాత్రను ప్రారంభించాలని భావించిన బాబు ఆదిలోనే వెనుకడుగు వేశారు. అన్న నందమూరి తారకరామారావుకు బ్రహ్మరథం పట్టిన అనంతపురం జిల్లా హిందూపురం నుంచే యాత్రకు శ్రీకారం చుట్టాలని చంద్రబాబు స్కెచ్ వేశారు.

ఇంతవరకు బాగానే ఉన్నా పాదయాత్ర ప్రకటన సందర్భంగా చంద్రబాబు చెప్పిన సంగతే రాష్ట్ర ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది. తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన ‘తొమ్మిదేళ్లకు తక్కువ’ పాలనను ప్రజలకు మళ్లీ గుర్తు చేయడానికే వస్తున్నానంటూ బాబుగారు పేల్చిన బాంబుతో జనాలు బెదిరిపోతున్నారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధిగా చంద్రబాబు సాగించిన పాలనను ప్రజలు ఇప్పటికీ పీడకలగానే పలవరిస్తున్నారు. పభుత్వ ఉద్యోగాలభర్తీపై మారటోరియం విధించిన బాబుగారి జమనా అంతా అవుట్ సోర్సింగ్ మయంగా మారింది. ప్రభుత్వ పరిశ్రమలపై (ప్రై)వేటు వేసి వేలాది మంది ఉద్యోగులను రోడ్డుపై నిలబెట్టిన ఘనత అప్పటిదే. హైటెక్ మోజులో అన్నపెట్టే రైతన్నను అధఃపాతాళానికి తొక్కేసిన దుస్థితి బాబు పాలనలోనే దాపురించింది.

సంస్కరణల పేరుతో ప్రచార్భాటంగా అఘోరించిన ఆనాటి ఏలుబడిని ఎంత త్వరగా మరచిపోతే అంతమంచిదని ప్రజలు అనుకున్నారు. అందుకే రైతు బాంధవుడిగా పేరున్న వైఎస్ రాజశేఖరరెడ్డికి వరుసగా రెండుసార్లు పట్టం కట్టారు. కలలోనైనా తలవడానికి ఇష్టపడ కే బాబుకు టాటా చెప్పారు. మహానేత సువర్ణ పాలనతో చంద్రబాబు చీకటి ఏలుబడిని జనం త్వరగానే మర్చిపోయారు. ఉచిత్ విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం వంటి జనరంజక పథకాలతో రాజన్న జనం గుండెలో చెరగని ముద్ర వేశారు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలే రాష్ట్రానికే కాదు దేశానికే చాటారు.

తన ‘తొమ్మిదేళ్లకు తక్కువ’ పాలనలో ప్రజలను పీడించుకు తిన్న నారా బాబు నిరుపేదలకు చేసింది నిండు సున్నా. ప్రచార ఊకదంపుడు తప్ప మిడిల్ క్లాస్‌కూ ఊరబొడిచింది లేదు. అటువంటి ఏలుబడిని గుర్తు చేస్తానని చంద్రబాబు తాజాగా చిలకపలుకలు పలకడంతో రాష్ర్ట ప్రజానీకం బెదురుతోంది. ప్రజలతో ఏవిధంగా మమేకమవ్వాలన్న దానిపై దృష్టి పెట్టకుండా జనాన్ని ఆకట్టుకునే కిటుకుల కోసం సినిమావాళ్లతో చంద్రబాడు పాఠాలు చెప్పించుకోవడం చూస్తుంటేనే అర్థమవుతుంది ఆయనేం మారలేదని. యాత్ర నామకరణం కోసం దాదాపు వందల సంఖ్యలో పేర్లు పరిశీలించడం ప్రచార్భాటంపై బాబుగారికి మమకారం పోలేదనడానికి నిదర్శనం. నినాదాలతో జనాన్ని నమ్మించాలని చూడడం చంద్రబాబుకు శ్రేయస్కరం కాదు. తన నీడను కూడా నమ్మని టీడీపీ అధినేత జనంతో ఏవిధంగా మమేకమవుతారన్న శంక సహజం. గతించిన అంధకార పాలనను గుర్తుచేయకుండా మారిన మనిషిగా ప్రజల దగ్గరికెళ్తేనే బాబుకు మేలు.

http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=49653&subcatid=0&categoryid=28

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!